Gutta Sukhendar Reddy: పొలిటికల్ హిట్ పెంచిన గుత్తా కామెంట్స్.. ఇంతకీ ఏమన్నారంటే..?

తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఆయన చేస్తున్న కామెంట్స్ బీఆర్ఎస్‌లో పొలిటికల్ హిట్ పెంచుతోంది. అవకాశం చిక్కినప్పుడల్లా గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన, పాలకుల తీరుపై విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు.

Gutta Sukhendar Reddy: పొలిటికల్ హిట్ పెంచిన గుత్తా కామెంట్స్.. ఇంతకీ ఏమన్నారంటే..?
Gutta Sukhendar Reddy
Follow us
M Revan Reddy

| Edited By: Balaraju Goud

Updated on: Aug 09, 2024 | 3:19 PM

తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఆయన చేస్తున్న కామెంట్స్ బీఆర్ఎస్‌లో పొలిటికల్ హిట్ పెంచుతోంది. అవకాశం చిక్కినప్పుడల్లా గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన, పాలకుల తీరుపై విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. బీఆర్ఎస్ పాలనపై విమర్శలు చేయడమే కాకుండా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి కితాబు ఇస్తున్నారు. తాజాగా ఆయన కృష్ణా బేసిన్ లోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో గత బీఆర్ఎస్ పాలకులు నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు బీఆర్ఎస్ లో దుమారం రేపుతున్నాయి. బీఆర్ఎస్ పై ఆ పెద్దమనిషి ఎందుకు విమర్శల దాడి చేస్తున్నారు..? ఆ పెద్దల మనిషికి అవిశ్వాస తీర్మానం భయం పట్టుకుందా..?

బీఆర్ఎస్ నుండి రెండోసారి మండలి చైర్మన్ గా..

నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి మూడుసార్లు ఎంపీగా గెలిచారు. మొదటి సారి టీడీపీ నుంచి, రెండు సార్లు కాంగ్రెస్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2014లో మూడో సారి కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన గుత్తా ఆ తర్వాత గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే తన ఎంపీ పదవి కాలం పూర్తయిన తర్వాతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు సమితికి తొలి చైర్మన్‌గా బాధ్యతలు వ్యవహరించారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికై, మండలి చైర్మన్ అయ్యారు. రెండో సారి కూడా మండలి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. అసెంబ్లీ స్పీకర్ కానీ, శాసన మండలి చైర్మన్ గా ఎన్నికైన వారు అంతకుముందు ప్రాతినిధ్యం వహించిన పార్టీల ప్రాథమిక సభ్యత్వాలకు రాజీనామా చేస్తారు. దీంతో వారు ఏ పార్టీకి చెందిన వారై ఉంటారు.

తాజా వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ లో దుమారం..

శాసన మండలి చైర్మన్ గుత్తా.. పొలిటికల్ కామెంట్స్ పార్టీ బీఆర్ఎస్‌లో కాకరేపుతున్నాయి. మండలి చైర్మన్ గా రెండో సారి ఆ పదవిని కట్టబెట్టిన బీఆర్ఎస్ పై అవకాశం వచ్చిన ప్రతిసారీ విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ లో కలకలం రేపాయి. కృష్ణా బేసిన్ లోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో గత బీఆర్ఎస్ పాలకులు నిర్లక్ష్యం చేశారని, దీంతో నల్గొండ జిల్లాకు అన్యాయం చేశారని విమర్శించారు. గోదావరి నదిపైన ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేసి, కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను అశ్రద్ధ చేశారని విమర్శలు సంధించారు. గత ప్రభుత్వం.. కాళేశ్వరం ప్రాజెక్టుపై చూపిన శ్రద్ధ, కృష్ణా బేసిన్ లో నిర్మిస్తున్న ప్రాజెక్టులపై చూపలేదని గుత్తా విమర్శించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసి, జిల్లాను సస్యశ్యామలం చేయాలని ఆయన సీఎం రేవంత్, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు సూచించారు. SLBC సొరంగ మార్గం ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే నల్గొండ జిల్లాకు మేలు జరిగేదని గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ లో దుమారం రేపుతున్నాయి.

అసలు ఎందుకీ విమర్శలు…?

గుత్తా సుఖేందర్ రెడ్డి పార్లమెంటు ఎన్నికలకు ముందు నుండే బీఆర్ఎస్ అధినాయకత్వంపై విమర్శలు దాడి కొనసాగిస్తున్నారు. బీఆర్ఎస్ లో చేరే ముందు ఇచ్చిన హామీ మేరకు గుత్తాకు కేసీఆర్ మంత్రి పదవి ఇవ్వలేకపోయినా.. మండలి చైర్మన్ గా రెండు సార్లు అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలోనే తన రాజకీయ వారసునిగా తన తనయుడు గుత్తా అమిత్ రెడ్డి రాజకీయ అరంగేట్రానికి గుత్తా చాలా ప్రయత్నాలు చేశారు. అమిత్ కు నల్గొండ, భువనగిరి లోక్ సభ స్థానాల్లో ఏదో ఒక చోటు నుంచి టికెట్ కావాలని కోరారు. కానీ, జిల్లాలోని గుత్తా వ్యతిరేక వర్గీయులు అడ్డుకోవడంతో బీఆర్ఎస్ ఎంపీ టికెట్ రేసు నుంచి వెనక్కి తగ్గారు. ఈ పరిణామాల తర్వాత అమిత్ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. అప్పటి నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన, నాటి సీఎం కేసీఆర్, మంత్రులపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. బీఆర్ఎస్ లో తనకు ఉచితంగా పదవులు రాలేదని,16 సార్లు కేసీఆరే రిక్వెస్ట్ చేస్తే, తెలంగాణ వాదిగా, ఎంపీగా ఇద్దరు ఎమ్మెల్యేలు, జడ్పీటిసిలతో కేబినెట్‌లో బెర్త్ హామీతో బీఆర్ఎస్‌లో చేరానని కేసీఆర్ పైనే విమర్శలు చేశారు.

మండలి చైర్మన్ పదవిని కాపాడుకునేందుకేనా…?

గుత్తా.. ఇప్పటికే బీఆర్ఎస్ కు దూరమై, మానసికంగా కాంగ్రెస్ కు దగ్గరయ్యారనే విమర్శ ఉంది. అవిశ్వాసం పెట్టి ఆ పదవి నుంచి బీఆర్ఎస్ తప్పిస్తారేమో అన్న ఆందోళనలో గుత్తా ఉన్నారట. వాస్తవానికి మండలిలో కాంగ్రెస్ కు బలం లేదు. మండలిలో 40 మంది సభ్యులు ఉండగా, బీఆర్ఎస్ కు 29 మంది సభ్యులు ఉంటే, కాంగ్రెస్ కు కేవలం నలుగురు ఎమ్మెల్సీలే ఉన్నారు. శాసస మండలిలో బీఆర్ఎస్ శాసన సభా పక్షం లేకుండా మూడింట రెండొంతుల మందిని లాగేసే ప్రయత్నాల్లో కాంగ్రెస్ ఉందట. ఇటీవల బీఆర్ఎస్ నుంచి ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికి చేరారు. ఇపుడు బీఆర్ఎస్ లో 23 మంది, కాంగ్రెస్ లో10 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. గుత్తా తన మండలి చైర్మన్ పదవిని కాపాడుకునేందుకే బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నారని గులాబీ నేతలు చెబుతున్నారు.

మొత్తానికి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న బీఆర్ఎస్ పై గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శల గళం.. రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్టున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..