Hyderabad: వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్యద్ పల్లిలో పశువుల దొంగలు రెచ్చిపోయారు. అర్థరాత్రి పొలం వద్ద కట్టేసిన పశువులను దొంగిలించారు. కావలి దశరథ్ అనే రైతుకు రెండు ఆవులు, రెండు ఎద్దులు ఉన్నాయి. రోజూలాగే సాయంత్రం తన పశువులను పొలం వద్దే కట్టేసి ఇంటికి వెళ్లాడు. మరుసటిరోజు ఉదయం వచ్చి చూసేసరికి పశువులు కనిపించలేదు. ఎంత వెతికినా ప్రయోజనం లేకుండాపోయింది. దాంతో పశువులను ఎవరో ఎత్తుకెళ్లారని నిర్ధారించుకున్నాడు. దాంతో బాధిత రైతు దశరథ్.. పరిగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. పశువులను కట్టేసిన తాళ్లను కట్ చేసి.. ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. ఓ వాహనం తన పొలం వద్దకు వచ్చిపోయినట్లు ఆనవాళ్లను గుర్తించారు. కాగా, నిన్న సాయంత్రం ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరిగారని, ఈ చోరీ వారి పనే అయి ఉంటుందని స్థానిక రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక అర్థరాత్రి ఓ బొలేరో వాహనం వచ్చిపోయిన కదలికలు సిసి కెమెరాల్లో రికార్డయింది. బాధిత రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..