తెలుగు రాష్ట్రాల్లో కొత్త ట్రెండ్ నడుస్తోంది. బుక్స్ మెయింటెయిన్ చేస్తున్నాం బుక్ చేస్తాం జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇస్తున్నారు విపక్షనేతలు. ఏపీలో రెడ్‌బుక్ పాలనకు జగనన్న 2.0 సర్కార్‌లో రివేంజ్ ఉంటుందని వైసీపీ అధినేత ప్రకటించారు. అయితే ఈ బుక్కుల గోల తెలంగాణకు కూడా పాకింది. తమ కార్యకర్తలను వేధిస్తున్నవారి పేర్లను పింక్ బుక్‌లో ఎక్కిస్తామని బీఆర్ఎస్ ప్రకటించింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో విపక్షాలు బుక్కులనే ఆయుధాలుగా భావిస్తున్నాయి. పగసాధించడానికి సరిపోదా ఒక బుక్ అంటున్నాయి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన పార్టీలు. ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేత నారా లోకేష్ రెడ్ బుక్ మెయింటెయిన్ చేశారు. టీడీపీ కార్యకర్తలను వేధించినవారి పేర్లను అందులో రాసుకున్నామని.. అధికారంలోకి వచ్చాక ఎవ్వరినీ వదిలేదిలేదంటూ వార్నింగ్ ఇచ్చారు.
అయితే.. రెడ్‌బుక్ పాలనలో భాగంగానే తమ నేతలను, కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. వల్లభనేని వంశీని కూడా రెడ్‌బుక్ కోటాలోనే అరెస్ట్ చేశారని విమర్శించింది. జగనన్న 2.0 సర్కార్‌లో రెడ్ బుక్ పాలనకు కౌంటర్ ఉంటుందన్నారు వైసీపీ అధినేత జగన్..
ఏపీలో రెడ్ బుక్ వర్సెస్ జగనన్న 2.0 మధ్య డైలాగ్ వార్ డెయిలీ ఎపిసోడ్ అయింది. అయితే ఈ బుక్కుల గొడవ తెలంగాణకు పాకడం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తుందని, జైళ్లకు పంపుతుందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. వేధింపులకు గురిచేస్తున్నవారి పేర్లను పింక్‌బుక్‌లో రాస్తామన్నారు ఎమ్మెల్సీ కవిత.
ప్రజా సమస్యలపై ట్వీట్ చేసినా.. ప్రభుత్వాన్ని ప్రశ్నించినా పోలీసులను పంపించి అరెస్ట్ చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నేతలు. ఇలా వేధించే వారి లెక్కలన్నీ రాసుకుని లెక్క సెట్ చేస్తామంటున్నారు.
బీఆర్ఎస్ కార్యకర్తలపై అధికారులు ఇష్టారాజ్యంగా అక్రమ కేసులు పెడితే చూస్తూ ఊరుకోబోమన్నారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
ఏపీలో రెడ్‌బుక్ ఎంత ఫేమస్ అయిందో తెలంగాణలో పింక్ బుక్ అంత చర్చనీయాంశంగా మారింది. పింక్ బుక్‌లో ఎవరి పేర్లు చేరుస్తారో చూడాలి మరి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..