BRS: కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ ఫైట్.. నల్లగొండ రైతు మహాధర్నా మరోసారి వాయిదా
తాము రైతుల తరపున పోరాడుతుంటే కాంగ్రెస్ సర్కార్ భయపడుతోందని పొలిటికల్ ఎటాక్ చేస్తోంది బీఆర్ఎస్. అయితే బీఆర్ఎస్ నేతలు ప్రతి జిల్లాకు వెళ్లి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని కౌంటర్ ఇచ్చింది కాంగ్రెస్. మరోవైపు నల్లగొండలో బీఆర్ఎస్ తలపెట్టిన రైతు మహాధర్నా మరోసారి వాయిదా పడింది.

తెలంగాణలో రైతు చుట్టూ రాజకీయం నడుస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఈ అంశంలో ఎప్పటికప్పుడు విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా నల్లగొండ రైతు మహాధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంపై బీఆర్ఎస్ ఫైర్ అయ్యింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పాలన చేతకాక, ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజల నిరసనను అడ్డుకుంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు. ప్రజల పక్షాన పని చేయటం పార్టీల హక్కు అని.. తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమం తీసుకున్నా.. ప్రభుత్వం అడ్డుకుంటున్నదని మండిపడ్డారు. కేటీఆర్ ఏ కార్యక్రమం చేపట్టినా రేవంత్ రెడ్డికి ఎందుకు వణుకు పుడుతుందని ప్రశ్నించారు. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
అయితే బీఆర్ఎస్ విమర్శలను అధికార కాంగ్రెస్ తిప్పికొట్టింది. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో 6,121 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. వారి ఆత్మహత్యలకు కారణమైన గత ప్రభుత్వ నేతలు ఇప్పుడు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. బీఆర్ఎస్ నేతలు ప్రతి జిల్లాకు వెళ్లి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మేలు జరుగుతోందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రూ. 61 వేల కోట్లు రైతుల ప్రయోజనాల కోసం ఖర్చు చేశామన్నారు.
మరోవైపు నల్గొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే రైతు మహాధర్నా మరోసారి వాయిదా పడింది. ఈ ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. తదుపరి విచారణను 27కు వాయిదా వేసింది. దీంతో కోర్టు నిర్ణయం అనంతరం మహాధర్నా తేదీని మరోసారి ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి