
తెలంగాణలో 5 స్థానాలకు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్‌కు 4, బీఆర్ఎస్‌కు ఒక్క ఎమ్మెల్సీ సీట్లు దక్కుతాయి. ఈ లెక్కన ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం అయితాయి. కానీ బీఆర్ఎస్ రెండో అభ్యర్థిని నిలబెడితే ఎన్నికలు తప్పవు. ఇక్కడే కేసీఆర్ తన మార్క్ పాలిటిక్స్‌కు తెరతీశారు. ఇప్పటికే ఎమ్మెల్సీ అభ్యర్థిపై కేసీఆర్ కసరత్తు కొలిక్కి వచ్చింది. ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థి పేరును ప్రకటించనుంది బీఆర్ఎస్. అయితే రెండో అభ్యర్థిపైనా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని సమాచారం.
బీఆర్ఎస్‌కు ఉన్న సంఖ్యాబలం ప్రకారం ఒక ఎమ్మెల్సీ సీటు పక్కాగా వస్తుంది. కానీ రెండో అభ్యర్థిని నిలబెట్టాలంటే పార్టీని వీడి వెళ్లిన ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ రెండో అభ్యర్థికి ఓటు వేయాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ మొత్తం 39 సీట్లు గెలుచుకుంది. ఆ తర్వాత కంటోన్మెంట్ బై ఎలక్షన్స్ వల్ల అక్కడ సీటును కోల్పోయింది. మిగిలిన 38 మందిలో పదిమంది ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం గులాబీ పార్టీకి 28 మంది ఎమ్మెల్యేలున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఐదు స్థానాలు భర్తీ కావల్సి ఉంది. ఆ లెక్కన ఒక్కో ఎమ్మెల్సీ గెలవాలంటే 19మంది ఎమ్మెల్యేల ఓట్లు కావాలి. బీఆర్ఎస్ ఇద్దరు అభ్యర్థులను గెలిపించుకోవాలంటే మొత్తం 38 ఓట్లు అవసరం. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిరాయింపుల చట్టం వర్తింపజేయాలని సుప్రీంకోర్టులో పోరాడుతుంది బీఆర్ఎస్.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో అభ్యర్థిని బరిలోకి దింపి ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఇరకాటంలో పెట్టాలని భావిస్తున్నారు కేసీఆర్. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ ఇప్పటికే తాను కాంగ్రెస్ పార్టీ కాదని ప్రకటించుకున్నారు. ఆయన బాటలోనే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నట్టు సమాచారం. వీరంతా తమకే ఓటు వేస్తారని బీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటుంది. రెండో అభ్యర్థిని నిలబెట్టి సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని టెన్షన్ పెట్టాలని చూస్తోంది బీఆర్ఎస్.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..