తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పై బీజేపీ ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో ఆయన టీవీ9తో మాట్లాడుతూ.. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రభావం ఏమాత్రం ఉండబోదని జోస్యం చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనతో తెలంగాణను దోచుకుంటోందని విమర్శించారు డాక్టర్ లక్ష్మణ్. ఇది చాలక దేశాన్ని దోచుకోవాలని జాతీయ పార్టీ అంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉట్టికి ఎక్కలేని వ్యక్తి, ఆకాశానికి నిచ్చెన వేసినట్లు కేసీఆర్ వ్యవహార శైలి ఉందని మండిపడ్డారు. తెలంగాణ సమాజం ఈ రోజు బాధ పడుతోందని, కేసీఆర్ పాలనలో తెలంగాణలోని ఏ వ్యక్తి సంతోషంగా లేరని డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు. సీఏం కేసీఆర్ ఒకసారి థర్డ్ ఫ్రంట్ అని, మరోసారి ఫోర్త్ ఫ్రంట్ అని ఇంకోసారి కాంగ్రెసేతర కూటమి అని అంటున్నారని, ఆయన మాటపై ఆయనకే విశ్వాసం ఉండదన్నారు.
కేసీఆర్ కలిసిన నితీష్, ఉద్దవ్, సోరేన్, స్టాలిన్ అందరూ కాంగ్రెస్ మద్దతుదారులేనని డాక్టర్ లక్మణ్ పేర్కొన్నారు. కేసీఆర్ కూడా కాంగ్రెస్ గూటికి చేరే రోజు దగ్గర్ లో ఉందని జోస్యం చెప్పారు. తెలంగాణ లో టీఆర్ ఎస్ మునిగిపోతున్న పడవని విమర్శించారు. తెలంగాణ ప్రజల దృష్టి మరల్చడానికే జాతీయ పార్టీ అంటూ హడావుడి చేస్తున్నారని లక్ష్మణ్ విమర్శించారు. టిఆర్ఎస్ తెలంగాణలో కనుమరుగు అవుతున్న పార్టీ అని, ఆపార్టీపై ప్రజలు విశ్వాసం కోల్పోయారన్నారు.
ఇలా ఉండగా తెలంగాణలో టిఆర్ ఎస్, బీజేపీ నాయకులు ప్రతి రోజూ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. కేంద్రప్రభుత్వ విధానాలను టీఆర్ ఎస్ తప్పుబడుతుంటే, తెలంగాణలో టీఆర్ ఎస్ ప్రభుత్వ విధానాలపై బీజేపీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు తెలంగాణ శాసనసభ ఎన్నికలకు దాదాపు ఏడాది మాత్రమే గడువు ఉండటంతో తెలంగాణలో బలోపేతంపై బీజేపీ దృష్టిసారించగా, తమ బలాన్ని కాపాడుకోవడంపై టీఆర్ ఎస్ దృష్టిపెట్టాయి. అయితే టిఆర్ ఎస్ లో అసంతృప్తిగా ఉన్న నాయకులను ఆకర్షించి బీజేపీలో చేర్చుకోవాలని కమలం పార్టీ తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణలో బీజేపీ వైఖరి టీఆర్ ఎస్ చిరాకు తెప్పిస్తోంది. క్షేత్రస్థాయిలో కారు పార్టీపై గుర్రుగా ఉన్న నాయకులను బీజేపీ ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు టీఆర్ ఎస్ కూడా వ్యూహాలను రూపొందిస్తోంది. దీనిలో భాగంగా ఇరు పార్టీల నాయకులు ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా బీజేపీ సీనియర్ నేత డాక్టర్ కె.లక్ష్మణ్ చేసిన ఘాటు వ్యాఖ్యలపై టీఆర్ ఎస్ నాయకులు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాల్సి ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..