BJP Vs TRS: బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ.. బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత.. పలువురికి గాయాలు
బండి సంజయ్ ప్రసంగిస్తుండగా.. టిఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి చేరి..ఆయన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు యత్నం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టిఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
BJP Vs TRS: తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా నేడు జనగాం జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా దేవరుప్పుల చౌరస్తాలో ఏర్పటు చేసిన సభలో సంజయ్ ప్రసంగిస్తుండగా.. టిఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి చేరి..ఆయన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు యత్నం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టిఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బీజేపీ ఫ్లెక్సీలు TRS కార్యకర్తలు దగ్ధం చేశారు. బిజేపీ కార్యకర్తల కార్లను కూడా ధ్వంసం చేశారు. దీంతో ఇరుపార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. పలువురు బీజేపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. అంతేకాదు టిఆర్ఎస్ కార్యకర్తలు బండి సంజయపై రాళ్లతో దాడికి యత్నించడంతో అక్కడ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఇరు వర్గాల మరిన్ని చెదరగొట్టారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై బండి సంజయ్ స్పందిస్తూ.. పోలీస్ కమిషనర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లా అండ్ ఆర్డర్ చేతకాని సీపీ ఇంట్లో కూర్చోమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీజీపీతో నేరుగా బండి సంజయ్ కుమార్ మాట్లాడారు. బీజేపీ కార్యకర్తల తలల పగలకొడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ మండిపడ్డారు. పోలీసులకు జీతాలు కేసీఆర్ జేబుల్లోంచి ఇస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. సీఎం గా కేసీఆర్ ఉండేది ఇంకో 6 నెలలే.. అంటూ వ్యాఖ్యానించారు. తక్షణమే పాదయాత్ర ప్రశాంతంగా కొనసాగేలా చూడాలని డీజీపీని కోరారు. లేనిపక్షంలో జరగబోయే పరిణామాలకు పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు సంజయ్. డీజీపీ ఈ ఘటనపై వెంటనే స్పందించాల్సిందేనని.. లేనిపక్షంలో గాయపడ్డ కార్యకర్తలను తీసుకుని డిజీపీ కార్యాలయం వద్దకు తీసుకొని వస్తానంటూ డీజీపీకి బండి సంజయ్ డెడ్ లైన్ పెట్టారు.
దేవురుప్పుల ఘటన నేపథ్యంలో బండి సంజయ్ కు పోలీస్ సెక్యూరిటీని పెంచారు. అయితే ఆయన తనకు సెక్యూరిటీ వద్దు అంటూ నిరాకరించారు. భద్రతా సిబ్బందిని ఉపసంహరించుకోవాలని అధికారులకు చెప్పారు. తమ కార్యకర్తలపై దాడులు చేస్తుంటే పోలీసులు చూస్తూ ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు తీవ్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతోంది. ఈ ఘటనలో స్తానికుల్లో ఆందోళన నెలకొంది. ఎప్పుడు ఏమిజరుగుతుందో అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..