Bibinagar: సర్పంచ్ స్థానానికి భార్యభర్తలు ఇద్దరూ నామినేషన్ వేశారు.. డమ్మీ అనుకునేరు
రాజకీయాల్లో అవకాశముంటే కుటుంబ సభ్యులందరూ పోటీ చేస్తుంటారు. ఒక్కోసారి డమ్మీ అభ్యర్థులుగా కుటుంబ సభ్యులతో నామినేషన్ వేయిస్తుంటారు. అదే సందర్భంలో కొందరు జ్యోతిష్యాల సూచనలు కూడా పాటిస్తుంటారు. కానీ ఓ సర్పంచ్ అభ్యర్థి తన గెలుపు కోసం భార్యని ఏం చేశాడో.. తెలిస్తే అందరూ షాక్ అవుతారు.

యాదాద్రి జిల్లా బీబీనగర్‌కు చెందిన నారగోని మహేష్ గ్రామంలో చురుకుగా ఉండేవాడు. తాను ఏ పనికైనా, కార్యాలకైనా గురువుగా భావించే ఓ జ్యోతిష్యుడిని సంప్రదిస్తుంటాడు. దాంతోపాటు అతడికి భార్య అంటే సెంటిమెంట్. అయితే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేయాలని మహేష్ భావించాడు. తన గురువైన సిద్ధాంతి వద్ద తన కోరికను వెలిబుచ్చాడు. నువ్వు తలపెట్టిన కార్యంలో ఎప్పటిలాగే నీ భార్య కూడా ఉండాలని.. అప్పుడే విజయం వరిస్తుందని జ్యోతిష్యుడు చెప్పాడు. వెంటనే గ్రామ సర్పంచ్ పదవికి తనతో పాటు భార్య శ్రీలతతో కూడా నామినేషన్ వేయించాడు. 8000 ఓట్లు కలిగిన బీబీనగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి కాంగ్రెస్, బిఆర్ఎస్ మద్దతు దారులతోపాటు భార్యాభర్తలు బరిలో ఉన్నారు. మహేష్‌కు ఉంగరం, శ్రీలతకు కత్తెర గుర్తులు వచ్చాయి. సర్పంచ్ ఎన్నిక బ్యాలెట్‌లో భార్యాభర్తల గుర్తులు కనిపించడంతో బీబీనగర్ వాసులు ఆసక్తిగా చూస్తున్నారు. తనకు భార్య సెంటిమెంట్ అని.. ఆమెతో కలిసి చేసే ప్రతి పని కలిసి వస్తుందని మహేష్ చెబుతున్నాడు. జ్యోతిష్యుడు సూచన మేరకే సర్పంచ్ పదవికి తనతో పాటు భార్యను కూడా బరిలో దింపానని మహేష్ చెబుతున్నాడు. దీంతో అసలు ఓటు వేయాలనుకున్నాళ్లు భర్తకు వేయాలా..? భార్యకు వేయాలా అనే కన్‌ఫ్యూజన్ మొదలైంది. అయితే మహేష్‌కు భార్య సెంటిమెంటు ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి. ఇలా ఈ తెలంగాణ స్థానిక ఎన్నికల్లో ఎన్నో చిత్ర విచత్రమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
