T.Congress: ఈ రాత్రికి హైదరాబాద్‌కు దిగ్విజయ్ సింగ్.. ట్రబుల్ షూటర్‌ను ఢిల్లీలోనే టచ్ చేసిన రేవంత్‌రెడ్డి.. సీనియర్ల ఏం చెప్పుకుంటారో..
అసలు వివాదం ఎలా మొదలైంది. కేవలం కమిటీల్లో సీనియర్లకు ప్రాధాన్యం దక్కలేదన్నదే కారణమా..? అంతకుమించిన అంశాలు ఏమైనా ఉన్నాయా.. అన్న అంశాలపై దిగ్విజయ్ వాకబు..

టాస్క్ మొదలైంది. రెండుగా విడిపోయిన తెలంగాణ కాంగ్రెస్‌ను ఒక్కటి చేసే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు దిగ్విజయ్ సింగ్. రాత్రికి ఆయన హైదరాబాద్ రానున్నారు. అయితే ఈలోపే ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్‌లో తెలంగాణ ఇంచార్జ్ మాణిక్యం ఠాకూర్, సహ ఇంచార్జ్‌లు బోసురాజు, నదీమ్ జావేద్, రోహిత్ చౌదరి పాల్గొన్నారు. అసలు వివాదం ఎలా మొదలైంది. కేవలం కమిటీల్లో సీనియర్లకు ప్రాధాన్యం దక్కలేదన్నదే కారణమా..? అంతకుమించిన అంశాలు ఏమైనా ఉన్నాయా.. అన్న అంశాలపై దిగ్విజయ్ వాకబు చేసినట్లుగా తెలస్తోంది.
ఇదిలావుంటే, బుధవారం ఉదయం ఢిల్లీలో దిగ్విజయ్‌సింగ్‌ను రేవంత్‌రెడ్డి కలవడం ఆసక్తికరంగా మారింది. రేవంత్ ఏం మాట్లాడారు..? ఇటీవలి వివాదాలపై ఏదైనా నివేదిక ఇచ్చారా..? తమ వర్షన్‌ను ముందే చెప్పేశారా అన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది.
డిగ్గీరాజా వస్తున్నది సీనియర్లను బుజ్జగించేందుకు. వాళ్లంతా ఇప్పటికే రేవంత్ తీరుపై గరంగరంగా ఉన్నారు. దిగ్విజయ్ తమ వర్షన్ వింటారు. న్యాయం చేస్తారన్న హోప్‌తో ఉన్నారు జీ 9 సభ్యులు. అటు రేవంత్ వర్గం కూడా ఢీ అంటే ఢీ అంటోంది.
ఇప్పటికే 12 మంది PCC పదవులకు రాజీనామా చేశారు. సో .. అసమ్మతులతో కూడిన జీ-9 గ్రూప్, రేవంత్ గ్రూప్ ఇద్దరూ రిపోర్టులతో రెడీ అయినట్లు తెలుస్తోంది. దిగ్విజయ్ దగ్గరే తాడోపేడో తేల్చుకోవాలని భావిస్తున్నారు రెండు వర్గాల నేతలు.
దిగ్విజయ్‌నే ప్రియాంక గాంధీ ఎందుకు నమ్ముతున్నారు..
దిగ్విజయ్‌కు ట్రబుల్ షూటర్‌గా పేరుంది. పైగా గతంలో ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ ఇంఛార్జ్‌గా చాలా కాలం పనిచేశారు. పార్టీ సీనియర్లంతా పరిచయం. ఇక్కడి సమస్యలు, వర్గపోరు, విబేధాలపైనా ఇప్పటికే ఓ క్లారిటీ ఉంది. సో ఆయనైతే సీనియర్లతో మరింత లోతుగా మాట్లాడే అవకాశం ఉంటుంది. పైగా హైకమాండ్‌కు విశ్వాసపాత్రుడు. అందుకే దిగ్విజయ్ వైపు మొగ్గుచూపింది హైకమాండ్.! మరిఆయనకు సీనియర్లు సహకరిస్తారా? ఆయన మాటలు ఆలకిస్తారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇక సీన్‌లోకి ప్రియాంకా గాంధీ ఎంట్రీ ఎప్పుడన్నది కూడా ఆసక్తికరం…!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం