Hyderabad: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు తక్షణమే క్లియర్ చేయాలి.. విద్యార్థుల ఆందోళన!
తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని.. దీనిని వ్యతిరేకిస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల బహిష్కరణ చేపట్టారు. పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.8 వేల కోట్ల ఫీజు బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని, పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.8 వేల కోట్ల ఫీజు బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన రాష్ట్రవ్యాప్త కళాశాలల బహిష్కరణ కార్యక్రమానికి విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన లభించిందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం తెలిపారు.
జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు గుజ్జ సత్యం అధ్యక్షతన నిర్వహించిన ఈ ఆందోళనలో వందలాది మంది విద్యార్థులు పాల్గొని ప్రభుత్వ వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారని ఆయన పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి కొత్తపేట చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా గుజ్జ సత్యం మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్‌మెంట్ అనేది ప్రభుత్వ దయాదాక్షిణ్యం కాదని, రాజ్యాంగబద్ధమైన విద్యా అవకాశాలను కల్పించే సామాజిక న్యాయ పథకమని స్పష్టం చేశారు. వేలాది మంది పేద, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థుల భవిష్యత్తు ఈ పథకంపై ఆధారపడి ఉందని, అయినప్పటికీ ప్రభుత్వం నిధుల విడుదలలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం అత్యంత బాధాకరమన్నారు.
ఇప్పటికే కళాశాలలకు వేల కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోవడంతో అనేక విద్యాసంస్థలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయని, మరోవైపు విద్యార్థులు ఫీజుల పేరుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యను హక్కుగా గుర్తించిన ప్రభుత్వం, అదే హక్కు అమలులో మాత్రం వెనుకడుగు వేయడం విరుద్ధమైన వైఖరని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన చర్యలు విద్యార్థుల్లో నెలకొన్న అనిశ్చితిని తొలగించలేకపోయాయని, పూర్తి స్థాయిలో పెండింగ్ బకాయిల విడుదలపై స్పష్టమైన హామీ ఇవ్వకపోతే ఆందోళనలు మరింత ఉధృతం అవుతాయని హెచ్చరించారు. విద్యార్థుల సహనాన్ని ప్రభుత్వం పరీక్షించవద్దని, సమస్యను రాజకీయ కోణంలో కాకుండా విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పరిష్కరించాలని కోరారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని యథాతథంగా కొనసాగించడం, పెండింగ్‌లో ఉన్న రూ.8 వేల కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయడం, విద్యార్థులపై ఆర్థిక భారం మోపే విధానాలను ఉపసంహరించుకోవడం వరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం పోరాటం కొనసాగుతుందని గుజ్జ సత్యం స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
