Bathukamma Sarees: ఆడపడుచులకు బతుకమ్మ చీరలు.. పల్లె, పట్టణ, నగరాల్లో జోరుగా పంపిణీ
Bathukamma Sarees Distribution: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు అందిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీకి ఇవాళ మొదలైంది.
Venkata Narayana | Edited By: Balaraju Goud
Updated on: Oct 02, 2021 | 2:50 PM

తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ పండుగను ప్రతి ఒక్క ఆడబిడ్డలు తారతమ్య బేధం లేకుండా సంబురంగా జరుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వమే చీరల పంపిణిని చేపట్టింది. అక్టోబర్ 6వ తేదీ నుంచి బతుకమ్మ పండగ ప్రారంభం కానున్న నేపథ్యంలో అంతకుముందే చీరలు పంపిణీ చేసేలా అధికారులు పంపిణీ షురూ చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ డివిజన్ ఎన్ బీ టీ నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్యే దానం నాగేందర్ తో కలిసి బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి.

గతేడాది పంపిణీ సందర్భంగా మహిళల నుంచి అభిప్రాయాలను సేకరించిన అధికారులు.. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ సారి 30 సరికొత్త డిజైన్లను రూపొందించి వాటిని 20 విభిన్న రంగులతో సుందరంగా తీర్చిదిద్దారు. హైదరాబాద్ సనత్‌నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో బతుకమ్మ చీరల పంపిణీని మంత్రి తలసాని ప్రారంభించారు.

రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరలను పంపిణీని టీఆర్ఎస్ నేతలు, అధికారులు చేపట్టారు. గ్రామ, వార్డు కమిటీలతో పాటు స్వయం సహాయక సంఘాలతో పంపిణీ చేస్తున్నారు. ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని కూకట్‌పల్లి, వివేకానంద నగర్ డివిజన్లలో లబ్ధిదారులకు బతుకమ్మ చీరల పంపిణీని ప్రారంభించారు.

జాకార్డు, డాబి బోర్డర్ చీరలను కూడా ఈ ఏడాది తయారు చేశారు. మొత్తం 810 రకాల చీరలను అందుబాటులోకి తీసుకొచ్చారు. చీరల పంపిణీకి రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, మున్సిపల్ వార్డులు, కార్పొరేషన్ డివిజన్ల వారీగా రేషన్ షాపులకు సమీపంలో మొత్తం 15,012 పంపిణీ కేంద్రాల్లో పంపిణీ నిర్వహిస్తున్నారు.

ఏటా రూ.300 కోట్లతో ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుండగా.. ఈ ఏడాది రూ.318 కోట్లను వెచ్చించింది. దాదాపు 16 వేల మగ్గాలపై పది వేల నేత కుటుంబాలు ఆరు నెలల పాటు శ్రమించి చీరలను తయారు చేశాయి.





























