Basara IIIT Updates: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల జాగరణ దీక్ష కొనసాగుతోంది. తమ హామీలను నెరవేర్చాలంటూ వేలాది మంది విద్యార్థులు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ అలీ బాసర ఐఐఐటీ విద్యార్థులతో చర్చలు నిర్వహించారు. అధికారులు, విద్యార్థుల మధ్య రెండు గంటలపాటు కొనసాగిన చర్చలు విఫలమయ్యాయి. మొదట విద్యార్థుల వద్దకు చేరుకున్న కలెక్టర్ అలీ.. దీక్ష విరమించాలంటూ విద్యార్థులను కోరారు. తమ 12 డిమాండ్లు నేరవేర్చాలని విద్యార్థులు పట్టుబట్టారు. దీంతోపాటు సీఎం నుంచి రాతపూర్వక హామీపత్రం కావాలని విద్యార్థులు స్పష్టంచేశారు. డిమాండ్లు నేరవేర్చకపోతే నిరసన విరమించబోమంటూ బాసర ఐఐఐటీ విద్యార్థులు తేల్చిచెప్పారు. క్లాసులకు హాజరు కావాలంటూ అలీ సూచించగా.. తాము హాజరుకామని స్పష్టంచేశారు. డిమాండ్లను అంగీకరిస్తేనే హాజరవుతామని విద్యార్థులు తేల్చి చెప్పారు.
ఈ క్రమంలో విద్యార్థులు కూడా తనకు హామీ ఇవ్వాలని.. అప్పుడే తాను కూడా హామీ ఇప్పిస్తానంటూ కలెక్టర్ అలీ సూచించారు. క్లాసులకు హాజరైతే తప్పకుండా హామీ ఇప్పిస్తానని అలీ పేర్కొనగా.. ముందుగా ఇప్పటించాలని అప్పటివరకు క్లాసులకు హాజరుకామంటూ విద్యార్థులు తేల్చిచెప్పారు.
కాగా.. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన సోమవారంతో 7వ రోజుకు చేరింది. ప్రభుత్వం స్పందించేవరకు ఆందోళనలు కొనసాగుతాయని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..