
తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఓట్ ఆన్ ఆకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2024-25 సంవత్సరానికి గాను బడ్జెట్ రూ.2,75,891కోట్లు ఉన్నట్లు తెలిపారు. ఆరు గ్యారెంటీలకు సంబంధించి రూ. 53,196 కోట్లు అంచనా వేసినట్లు పేర్కొన్నారు. అలాగే పరిశ్రమలకు రూ.2543 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ తో అనుసంధానమైన ఐటీ శాఖకు రూ. 774కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. అలాగే పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి రూ. 40,080 కోట్లు, పురపాలక శాఖకు రూ. 11,692 కోట్లు కేటాయింపులు చేశారు. మూసీ రివర్ ఫ్రాంట్ కు వెయ్యి కోట్లు కేటాయించగా.. వ్యవసాయ శాఖకు రూ. 19,746 కోట్లు నిధులు సమకూర్చినట్లు తెలిపారు. అలాగే ఎస్సి, ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం రూ.1,250కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు.
అలాగే వ్యవసాయం వాటి అనుబంధ రంగాలకు పెద్దపీట వేశారు. రైతులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రుణమాఫీపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రతి రైతుకు రూ. 2లక్షల రుణమాఫీ చేస్తామని త్వరలోనే కార్యాచరణ అమలు అవుతుందన్నారు. అలాగే కౌలు రైతులకు ఉచిత భీమా వర్తింపజేస్తామన్నారు. వీటితో పాటు ఇందిరమ్మ ఇళ్లపై కూడా ప్రత్యేక చొరవ చూపించారు. ఇళ్లు లేని ప్రతి పేదవాడికి ఇళ్లు కట్టించి ఇచ్చే బాధ్యత తమ ప్రభుత్వానిదే అని చెప్పారు. ధరణి రైతులపాలిట శాపంగా మారిందని వాటి సమస్యలను త్వరలోనే తొలగిస్తామన్నారు. అలాగే చేనేత కార్మికులను కూడా ఆదుకుంటామన్నారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రూ. 500కే వంట గ్యాస్ అందజేస్తామని మరోసారి తెలిపారు. త్వరలోనే ఈ హామీకి సంబంధించి ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..