తెలంగాణకు తలమానికంగా మరో ప్రాజెక్టు.. ట్రయల్ రన్ సక్సెస్..

| Edited By: Srikar T

May 15, 2024 | 1:26 PM

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‎లో చారిత్రక ఘటం ప్రారంభమైంది. పవర్ ప్లాంట్‎లో అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. చివరి దశకు చేరుకున్న ప్లాంట్‌ పనులతో రెండు యూనిట్లలో ఫేజ్ -1 కింద టీఎస్ జెన్కో విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించి విద్యుత్‌ ఉత్పత్తి దిశగా అడుగులు వేసింది.

తెలంగాణకు తలమానికంగా మరో ప్రాజెక్టు.. ట్రయల్ రన్ సక్సెస్..
Telangana
Follow us on

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‎లో చారిత్రక ఘటం ప్రారంభమైంది. పవర్ ప్లాంట్‎లో అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. చివరి దశకు చేరుకున్న ప్లాంట్‌ పనులతో రెండు యూనిట్లలో ఫేజ్ -1 కింద టీఎస్ జెన్కో విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించి విద్యుత్‌ ఉత్పత్తి దిశగా అడుగులు వేసింది. త్వరలో దశలవారీగా విద్యుత్ ఉత్పత్తిని చేపట్టి గ్రిడ్‎కు అనుసంధానం చేయనున్నారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద 2015లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం యాదాద్రి థర్మల్ ప్లాంట్ (YTPS) నిర్మాణాన్ని చేపట్టింది. నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో YTPS నిర్మాణాన్ని తెలంగాణ జెన్కో చేపట్టింది. ఒక్కో యూనిట్‎లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది. పవర్ ప్లాంట్ నిర్మాణం అనుకున్న గడువుకన్నా రెండేళ్లు ఎక్కువ కావడంతో అంచనా వ్యయం రూ.29,500 కోట్ల నుంచి రూ.34,500 కోట్లకు పెరిగింది. తాజాగా పవర్ ప్లాంట్ అంచనా వ్యయం రూ.50 వేల కోట్లకు చేరింది.

యాదాద్రి పవర్ ప్లాంట్ రెండో దశ నిర్మాణంలో పర్యావరణ ఉల్లంఘనలో జరిగాయని రెండు స్వచ్ఛంద సంస్థలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటి)కి ఫిర్యాదు చేశాయి. దీంతో ఎన్జీటి యాదాద్రి పవర్ ప్లాంట్ రెండో దశ నిర్మాణానికి పర్యావరణ అనుమతులను నిలిపివేసింది. దీంతో ప్లాంట్ నిర్మాణ పనులు 90 శాతం పూర్తయినప్పటికీ విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో రాష్ట్ర అధికారులు గత ఏడాది నవంబర్ 8న మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ జరిపి పర్యావరణ అనుమతుల కోసం ప్రతిపాదనలను కేంద్రానికి పంపారు. వీటిని పరిశీలించిన నిపుణుల మదింపు కమిటీ ప్లాంటు రెండో దశ నిర్మాణానికి అనుమతులను సిఫార్సులను చేసింది. కొన్ని షరతులతో కూడిన అనుమతిని పర్యావరణ శాఖ మంజూరు చేసింది.

దీంతో పవర్ ప్లాంట్ పనులను జన్‎కో అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు. విద్యుత్ ఉత్పత్తికి ఏటా అవసరమయ్యే 3.5 టీఎంసీల నీటిని టెయిల్‌ పాండ్ ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్ నుంచి తరలించేందుకు 22 కిలోమీటర్ల మేర చేపట్టిన పైపు లైన్ పనులు, రిజర్వాయర్ నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాయి. విద్యుత్ ఉత్పత్తికి కావలసిన బొగ్గును దామరచర్ల మండలం విష్ణుపురం రైల్వేస్టేషన్ నుంచి యాదాద్రి థర్మల్ ప్లాంట్ వరకు 8.5 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ కూడా నిర్మిస్తున్నారు. హైటెన్షన్‌ విద్యుత్‌లైన్‌ టవర్ల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్‎లోగా మూడు యూనిట్లలో పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసే లక్ష్యంతో అధికారులు పనులను యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. ఇందులో భాగంగానే మొదటి, రెండవ యూనిట్లలోని యాక్సిలరీ బాయిలరల్లో లైట్ అప్ చేసి ట్రయల్ రన్ నిర్వహించారు. బొగ్గుకు ప్రత్యామ్నాయంగా ఇంధనాన్ని ఉపయోగించి అధికారులు ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. 275 మీటర్ల ఎత్తు గల చిమ్నీ ద్వారా వాయును విడుదల చేశారు. ట్రయల్ రన్ లో భాగంగా ప్రాథమిక పరీక్షలను పూర్తి చేసినట్లు జెన్కో అధికారులు చెబుతున్నారు. ఈ ట్రయల్ రన్ లో టీఎస్ జెన్కో సిఎండి రిజ్వి పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…