MLA Komatireddy: ఎమ్మెల్యే కోమటిరెడ్డి కాంగ్రెస్‌లోనే ఉన్నట్టా? బీజేపీలోకి వెళ్తున్నట్టా?

|

Mar 15, 2022 | 5:44 PM

ఆ ఎమ్మెల్యే వ్యవహారం.. కాంగ్రెస్‌లో ఎప్పుడూ హాట్ టాపిక్కే.. ఎప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో తెలియదు... ఎప్పుడు ఏ స్టాండ్‌ తీసుకుంటారో అర్థం కాదు..

MLA Komatireddy: ఎమ్మెల్యే కోమటిరెడ్డి కాంగ్రెస్‌లోనే ఉన్నట్టా? బీజేపీలోకి వెళ్తున్నట్టా?
Congress Party MLA Komatireddy Rajgopal Reddy (File Photo)
Follow us on

Telangana Congress: ఆ ఎమ్మెల్యే వ్యవహారం.. కాంగ్రెస్‌లో ఎప్పుడూ హాట్ టాపిక్కే.. ఎప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో తెలియదు… ఎప్పుడు ఏ స్టాండ్‌ తీసుకుంటారో అర్థం కాదు.. పార్టీలో ఫైర్‌ బ్రాండ్ లీడరే.. కానీ, తన తీరుతో క్యాడర్‌లో గందరగోళం సృష్టిస్తున్నారు. కాషాయ కండువా కప్పుకోడు.. కాంగ్రెస్‌లో ఇమడలేడు.. అన్నట్టుగా ఉంది ఆయన వ్యవహారం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజక వర్గాలుంటే…. 2018లో టీఆర్‌ఎస్‌ హవాను తట్టుకుని మునుగోడు నుంచి గెలిచిన ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajgopal Reddy). కోమటిరెడ్డి బ్రదర్స్‌లో.. ఆయనకున్న క్రేజ్ అలాంటిది. స్థానిక పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ కాంగ్రెస్ కోసం తనదైన శైలిలో పాటుపడే ఫైర్ బ్రాండ్ నేతగా రాజగోపాల్ రెడ్డికి మంచి పేరే ఉంది. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో… వాటి పరిష్కారానికి కృషిచేయడంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి తర్వాతే ఎవరైనా అన్నట్టుగా ఉంటారు. లోకల్‌గా మునుగోడు మొనగాడు అనే బ్రాండ్‌ సంపాదించుకున్న రాజగోపాల్‌ రెడ్డి… సంచలన వ్యాఖ్యలకూ కేరాఫ్‌ అడ్రస్‌గా ఉంటారు.

పార్టీలో దూకుడుగా వ్యహరించే రాజగోపాల్ రెడ్డి… ఇటీవల కాంగ్రెస్‌తో అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. ఆయన త్వరలోనే కాంగ్రెస్ పార్టీని వీడుతారనే ప్రచారం కూడా జోరుగానే సాగింది. బిజెపికి అనుకూలంగా ఆయన మాట్లాడే మాటలు…. కమలం జాతీయనాయకత్వాన్ని సమర్థిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు… కాషాయ కండువా కప్పుకోవడానికేనన్న చర్చ కూడా జరిగింది. భవిష్యత్తులో బిజెపిలో చేరుతాననే సంకేతాలను సైతం రాజగోపాల్ రెడ్డి ఇచ్చారు. అయితే, త్వరలో.. త్వరలో.. అంటూ కాలం కాస్తా గడిచిపోతోంది తప్ప ఆయన ఇప్పటివరకూ ఏ నిర్ణయమూ తీసుకోలేదు.

మనసంతా బీజేపీ వైపే…?

రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో కొనసాగుతున్నప్పటికీ.. ఆయన మనసంతా బీజేపీ వైపే ఉందని ఆయన ఫాలోవర్స్‌ కూడా చెబుతుంటారు. ఆయన ఎప్పటికైనా బీజేపీలోకి వెళ్లే నాయకుడే అనే టాక్ కూడా రాజకీయవర్గాల్లో ఉంది. గతేడాది రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా… భవిష్యత్తులో తాను బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు రాజగోపాల్‌. తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుందని తాను ముందే చెప్పాననీ.. కాంగ్రెస్‌ నేతనైనా.. బీజేపీ గురించి తన అభిప్రాయాలను నిస్సంకోచంగా చెప్పానంటూ.. కీలక వ్యాఖ్యలు చేశారు రాజగోపాల్‌ రెడ్డి. అన్న వెంకటరెడ్డి కాంగ్రెస్‌లోనే కొనసాగినా.. తాను మాత్రం పార్టీ మారుతున్నానని చెప్పారు. అప్పట్నుంచీ పేరుకే కాంగ్రెస్‌లో ఉంటున్న ఆయన.. పీసీసీపై హాట్‌ కామెంట్స్‌ చేస్తూ.. అప్పుడప్పుడూ బిజెపిపై ఉన్న ప్రేమను బయటపెట్టుకుంటున్నారు.

తెలంగాణ రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. సీఎం కేసీఆర్ .. తెలంగాణలో మరోసారి ముందస్తు వెళ్తారనే చర్చ జరుగుతోంది. దీంతో, తమ భవిష్యత్తు కోసం నేతలు .. ఈ పరిణామాల్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామితో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తన భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని రాజగోపాల్ రెడ్డి చెప్పినప్పటికీ.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రావడానికి ఒక రోజు ముందే ఈ భేటీ జరగడంపై లెక్కలేనన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

రాజగోపాల్‌రెడ్డి తీరుతో క్యాడర్‌లో కన్ఫ్యూజన్‌

రాజగోపాల్ రెడ్డి వ్యవహారశైలి .. అనుచర వర్గాన్ని గందరగోళంలో పడేస్తోంది. రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాక మనుగోడులో కాంగ్రెస్ పార్టీకి ముగ్గురు జడ్పీటీసీలు, ఇద్దరు ఎంపీపీలు, ఒక మున్సిపల్ చైర్మన్ ఉన్నారు. అయితే, ఆయన తీరుతో ఒక్కొక్కరూ పార్టీని వీడుతున్నారు. ఇప్పుడు ఒకే ఒక్క జడ్పిటిసి మాత్రమే మిగిలారు. అభిమానం ఉన్నా.. ఆయన క్రియేట్‌ చేస్తున్న కన్ఫ్యూజన్‌.. నియోజకవర్గంలో కీలక నేతల్ని దూరం చేస్తోంది. ఇప్పటికైనా రాజగోపాల్‌ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఆయన మద్ధతుదారులు కోరుతున్నారు.

టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్న కోమటిరెడ్డి తదుపరి రాజకీయ అడుగులు ఎటు వైపు అన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నే..

Also Read..

Telangana Police Jobs: పోలీస్ శిక్షణా కేంద్రాల్లో ట్రైనింగ్ తీసుకోవాలని భావిస్తున్నారా? ఇలా అప్లై చేసుకోండి..!

CM KCR on Hijab: ఎవరు ఏ బట్టలు వేసుకుంటే ప్రభుత్వాలకు అభ్యంతరం ఎందుకు.?.. హిజాబ్ వివాదంపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు