సీఎం సాబ్.. జరూర్ ఆనా! సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ తన కుమార్తె వివాహానికి ఆహ్వానించారు. యూకేలో జరగనున్న ఈ పెళ్ళికి హాజరు కావాలని కోరుతూ సీఎం నివాసంలో ఆహ్వాన పత్రికను అందజేశారు. రాజకీయంగా భిన్న ధ్రువాలుగా ఉన్నా, వ్యక్తిగత సందర్భాల్లో నేతలు పరస్పర మర్యాదలు కొనసాగించడం తెలంగాణ రాజకీయాల్లో ఒక ఆచారంగా నిలుస్తోంది.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన కుమార్తె వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ ముఖ్యమంత్రికి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. అక్బరుద్దీన్ ఓవైసీ కుమార్తె వివాహ వేడుక యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)లో జరగనుంది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితులు, రాజకీయ ప్రముఖులకు వ్యక్తిగతంగా ఆహ్వాన పత్రికలు అందజేస్తున్నారు.
అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా కలిసి వివాహానికి రావాలని ఆహ్వానించారు. రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్, ఎంఐఎం వేర్వేరు రాజకీయ పక్షాలైనా, వ్యక్తిగత సందర్భాల్లో పరస్పర మర్యాదలు కొనసాగిస్తూ వస్తున్నారు. ఇటీవల కూడా వివిధ సామాజిక, కుటుంబ కార్యక్రమాల్లో రాజకీయ నాయకులు ఒకరినొకరు ఆహ్వానించుకోవడం తెలంగాణ రాజకీయాల్లో కొనసాగుతున్న సంప్రదాయంగా భావిస్తున్నారు. ఈ సమావేశం కూడా అదే కోణంలో ప్రాధాన్యం సంతరించుకుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
