AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిల్లలు, పెద్దలు, బాలింతలు.. ఎవరికైనా నడుము బలానికి చేసి పెట్టే సున్నుండలు.. తయారు చేయడం సింపుల్‌

తెలుగు సంప్రదాయ వంటకాలలో ప్రత్యేక స్థానం పొందిన మినప సున్నుండలు రుచితో పాటు ఆరోగ్యాన్నీ అందిస్తాయి. మినప్పప్పు, బెల్లం, నెయ్యితో తయారయ్యే ఈ లడ్డూల్లో ప్రోటీన్లు, కాల్షియం, ఐరన్, ఫైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పిల్లల ఎదుగుదల నుంచి ప్రసవానంతర మహిళల ఆరోగ్యం వరకు ఎంతో మేలు చేసే ఈ సంప్రదాయ స్వీట్‌ను సరైన పద్ధతిలో తయారు చేసుకుంటే రుచి, పోషకాలు రెండూ లభిస్తాయి.

పిల్లలు, పెద్దలు, బాలింతలు.. ఎవరికైనా నడుము బలానికి చేసి పెట్టే సున్నుండలు.. తయారు చేయడం సింపుల్‌
Minapa Sunnundalu Recipe
Shaik Madar Saheb
|

Updated on: Jul 01, 2026 | 1:39 PM

Share

తెలుగునాట పండగలు, పెళ్లిళ్లు వంటి ఏ శుభకార్యానికైనా సున్నుండలు లేకుండా సంబరం పూర్తవదు. కేవలం రుచికే కాదు, ఆరోగ్య ప్రయోజనాలకు కూడా సున్నుండలు ప్రసిద్ధి. వాస్తవానికి “మినుములు తింటే ఇనుమంత బలం” అనే పెద్దల మాటలు ఈ వంటకం పోషక విలువలను స్పష్టంగా తెలియజేస్తాయి. ఈ ప్రత్యేకమైన సున్నుండలు పిల్లల కండపుష్టికి, యుక్తవయస్సులోని అమ్మాయిల ఆరోగ్యానికి, ముఖ్యంగా ప్రసవానంతరం స్త్రీల నడుము బాలానికి అద్భుతమైన ఆహారం.. సంప్రదాయ వంటకమైనా, నేటికీ దీని ప్రాముఖ్యత తగ్గలేదు. ప్రతిరోజూ ఒక సున్నుండ తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన శక్తి, బలం లభిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మినప సున్నుండలు పోషకాల గని.. మినప్పప్పు, బెల్లం, నెయ్యితో చేసే ఈ లడ్డూలు శరీరానికి తక్షణ శక్తిని, అవసరమైన ఖనిజాలను అందిస్తాయి. ఈ లడ్డుల్లో ప్రొటీన్లు, ఫైబర్, విటమిన్లు బి-కాంప్లెక్స్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

కావలసిన పదార్థాలు:

  • సున్నుండల తయారీకి ముఖ్యంగా రెండు రకాల మినపపప్పును ఉపయోగిస్తారు:
  • పొట్టు మినుములు, పొట్టు తీసిన మినపగుళ్ళు – అవి సగం ఇవి సగం..
  • బియ్యం (కొంచెం)
  • తురిమిన బెల్లం : అరకిలో పప్పుకు 400 గ్రాములు సరిపోతుంది
  • కాచిన నెయ్యి: 250 ml

తయారీ విధానం:

మినపపప్పు వేయించడం: ముందుగా ఒక కప్పు పొట్టు మినుములు, ఒక కప్పు పొట్టు తీసిన మినపగుళ్ళను (మొత్తం 500 గ్రాములు) ఒక పెద్ద బాణలిలో తీసుకోండి. వీటిని తక్కువ మంటపై (low flame) మాత్రమే బంగారు రంగు వచ్చేవరకు, మంచి సువాసన వచ్చేవరకు వేయించాలి. మినపపప్పు వేయించడానికి సుమారు 20 నుండి 25 నిమిషాల సమయం పడుతుంది. ఈ దశలో మంట ఎక్కువగా ఉంటే పప్పు బయట మాడిపోయి, లోపల పచ్చిగా ఉంటుంది.

బియ్యం చేర్చడం: పప్పు సగం వేగిన తర్వాత, రెండు టేబుల్ స్పూన్ల బియ్యాన్ని కలపండి. కేవలం మినపపప్పుతోనే చేస్తే, లడ్డూలు తింటున్నప్పుడు నోటికి పిండి అంటుకుపోయినట్లు అనిపిస్తుంది. బియ్యం కలపడం వల్ల లడ్డూలకు మంచి రుచి, ఆకృతి వస్తాయి. బియ్యం కూడా పప్పుతో పాటు గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేవరకు వేయించండి.

చల్లార్చడం, పిండి పట్టడం: వేయించిన పప్పును దించి, పూర్తిగా చల్లారనివ్వండి. పప్పు పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సీ జార్ లో వేసి మెత్తగా పిండి చేసుకోవాలి. పిండి మరీ సాఫ్ట్‌గా కాకుండా, కొద్దిగా బరకగా ఉంటే సున్నుండలు రుచిగా ఉంటాయి. ఎక్కువ మొత్తంలో పప్పు తీసుకుంటే, మిల్లులో పిండి పట్టించుకోవడం ఉత్తమం.

బెల్లం కలపడం: పిండిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుని, అందులో రెండు కప్పుల తురిమిన బెల్లం (400 గ్రాములు) కలపండి. చేత్తో కలపడం కష్టం కాబట్టి, బెల్లం వేసిన తర్వాత పిండిని మళ్లీ మిక్సీ జార్ లో వేసి ఒక్కసారి తిప్పండి. ఇలా చేయడం వల్ల బెల్లం పిండిలో చక్కగా కలిసిపోతుంది. పిండిలో బెల్లం చక్కగా కలిసిపోయి, కొద్దిగా బరకగా ఉండేలా చూసుకోండి.

నెయ్యి కలిపి ఉండలు చుట్టడం: ఇప్పుడు ఈ పిండి మిశ్రమంలో 250 ml (సుమారు ఒక కప్పు) కాచిన వేడి వేడి నెయ్యిని కొద్దికొద్దిగా పోస్తూ గరిటతో కలపండి. వేడి నెయ్యి కాబట్టి చేతితో వెంటనే ముట్టుకోవద్దు. నెయ్యి కొద్దిగా చల్లారిన తర్వాత, చేత్తో పిండిని గట్టిగా ప్రెస్ చేస్తూ నెయ్యి అంతా కలిసేలా కలపండి. నెయ్యి మొత్తం పిండిలో కలిసిన తర్వాత, మీకు కావలసిన పరిమాణంలో సున్నుండలను చుట్టుకోండి. అరకిలో పప్పుతో సుమారు 30 సున్నుండలు వస్తాయి.

చిట్కాలు:

సున్నుండల అసలైన రుచి మీరు వాడే నెయ్యిని బట్టే ఉంటుంది. మంచి నాణ్యత గల దేశీ నెయ్యిని ఉపయోగించడం వల్ల రుచి, సువాసన అద్భుతంగా ఉంటాయి.

ఎక్కువ మొత్తంలో సున్నుండల పిండిని తయారు చేసుకున్నప్పుడు, దాన్ని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసి, అవసరమైనప్పుడు ఫ్రెష్‌గా నెయ్యి కలిపి సున్నుండలు చేసుకోవచ్చు.

పిండిని మరీ మెత్తగా కాకుండా, కొద్దిగా బరకగా గ్రైండ్ చేయడం వల్ల సున్నుండలు తినడానికి మరింత రుచిగా ఉంటాయి.

ఈ మినప సున్నుండలు కేవలం ఒక రుచికరమైన స్వీట్ మాత్రమే కాదు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పోషకాహారం కూడా.. మీ ఇంట్లో కూడా ఈ సంప్రదాయ సున్నుండలను తయారు చేసి, వాటి రుచిని, ఆరోగ్య ప్రయోజనాలను ఆస్వాదించండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us