Telangana: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆ పార్టీ నేత అద్దంకి దయాకర్ మరోసారి క్షమాపణలు చెప్పారు. చండూరు సభలో తాను చేసిన కామెంట్స్‌కు పాశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ మరోసారి క్షమాపణలు కోరారు. ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేశారు అద్దంకి దయాకర్. మరోసారి ఇలాంటివి రిపీట్ అవకుండా చూసుకుంటానని మాట ఇచ్చారు. నాయకులు అంతా కలిసికట్టుగా పని చేయాలనేది తన ఉద్దేశం అని, చండూరు సభలో తాను చేసిన వ్యాఖ్యలపై రాతపూర్వకంగా కూడా క్షమాపణ తెలియజేశాను అని అద్దంకి పేర్కొన్నారు.
సారీ చెప్పిన టీపీసీసీ చీఫ్ రేవంత్..
మరోవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఎంపీ కోమటిరెడ్ది వెంకట్ రెడ్డికి క్షమాపణలు చెప్పారు. తాను చేసిన హోంగార్డు వ్యాఖ్యలతో పాటు, చండూరు సభలో అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలకూ బాధ్యత వహిస్తూ క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఆయన వీడియో విడుదల చేశారు. ‘‘చండూరు బహిరంగ సభలో కాంగ్రెస్ నే అద్దంకి దయాకర్ చేసిన కామెంట్స్, తాను చేసిన హోంగార్డ్ కామెంట్స్ పట్ల ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మనస్తాపానికి గురయ్యారు. పీసీసీ అధ్యక్షుడిగా సారీ చెప్పాలని వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆ వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి బహిరంగ క్షమాపణలు చెబుతున్నా. ఇలాంటి చర్యలు, ఇలాంటి భాష ఎవరికీ మంచిది కాదు. తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారు. అలాంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇలా అవమానించే విధంగా ఎవరు మాట్లాడినా తగదు.’’ అని వీడియో వివరణ ఇచ్చారు రేవంత్ రెడ్డి.
ఇదిలాఉంటే.. మునుగోడు వ్యవహారం ప్రధాన పార్టీల్లో తీవ్ర అలజడి సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేయడంతో కాంగ్రెస్‌లో కలవరం మరింత పెరిగింది. అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్స్, ఇటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారశైలితో ఉక్కిరిబిక్కిరి అవుతోంది కాంగ్రెస్. రాజగోపాల్ రెడ్డి.. పార్టీకి, మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసింది మొదలు.. రచ్చ నానాటికీ పెరుగుతుందే తప్ప.. ఏకోశానా తగ్గడం లేదు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి తీరని మోసం చేశారని టీపీసీసీ చీఫ్ సహా పార్టీలోని మిగతా నేతలు విమర్శలు గుప్పిస్తుంటే.. మధ్యలో తననెందుకు లాగుతున్నారంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ అవుతున్నారు. ఈ వివాదం ఇప్పటికీ ఇలాగే కంటిన్యూ అవుతోంది. మరి చివరకంటా ఏమవుతుందో తెలియదు గానీ, వివాదం ఇలాగే కంటిన్యూ అయితే, కాంగ్రెస్ పార్టీకి భారీ నష్టం తప్పదనే చెప్పాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..