AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల బంద్.. ఎందుకంటే..?

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, స్కాలర్‌షిప్‌ల విడుదలలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ జులై 14 (మంగళవారం) రాష్ట్రవ్యాప్త కళాశాలల బంద్‌కు అఖిల భారత విద్యార్థి పరిషత్ (ABVP) పిలుపునిచ్చింది. జూనియర్ కళాశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు బంద్‌కు సహకరించాలని కోరింది.

Telangana: తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల బంద్.. ఎందుకంటే..?
Telangana Students
Vidyasagar Gunti
| Edited By: |

Updated on: Jul 13, 2026 | 12:11 PM

Share

తెలంగాణలో జులై 14, మంగళవారం రాష్ట్రవ్యాప్త కళాశాలల బంద్‌కు అఖిల భారత విద్యార్థి పరిషత్ పిలుపునిచ్చింది. జూనియర్ కళాశాలల నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు అన్ని రకాల ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థలను మూసివేసి, ఈ బంద్‌ను విజయవంతం చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ABVP ప్రకటించింది.

రూ. 11,000 కోట్ల బకాయిలు.. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం!

తెలంగాణలో దాదాపు 20 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థులు ప్రభుత్వం అందించే ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లపై ఆధారపడి ఉన్నత చదువులు చదువుకుంటున్నారని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు తెలిపారు. కానీ, ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫీజుల విడుదలలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన మండిపడ్డారు. దీనివల్ల రాష్ట్రంలో ఏకంగా రూ. 11,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోయాయని వెల్లడించారు.

ఏటా 2 లక్షల మంది డ్రాపౌట్స్.. సర్టిఫికేట్లు అందక అవస్థలు

ప్రభుత్వ వైఖరి వల్ల ఏటా రెండు లక్షల మంది పేద విద్యార్థులు చదువు మధ్యలోనే ఆపేసి డ్రాపౌట్స్‌గా మారుతున్నారని రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. చదువు పూర్తయిన 4.5 లక్షల మంది విద్యార్థులు కాలేజీల్లో ఫీజులు కట్టలేక ఒరిజినల్ సర్టిఫికేట్లు తీసుకోలేక ఇబ్బందులు పడుతున్నారని, ఫలితంగా ఉన్నత చదువులకు, ఉద్యోగాలకు దూరమై పక్క రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి దాపురించిందని విమర్శించారు. గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తుంగలో తొక్కితే.. తాము అధికారంలోకి రాగానే బకాయిలు చెల్లించడంతో పాటు, ప్రతి నెల ఫీజుల చెల్లింపుల కోసం ప్రత్యేకంగా గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేస్తామని నాడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని.. కానీ నేడు ఆయనే స్వయంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ బకాయిలు విడుదల చేయకపోవడంతో ఈ వ్యవహారం కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చిందని రాంబాబు ధ్వజమెత్తారు.

ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు, ప్రభుత్వం కలిసి ఆడుతున్న నాటకంలో పేద విద్యార్థులు బలి పశువులవుతున్నారని, బడ్జెట్ కాలేజీలు సైతం మూతపడుతున్నాయని ఏబీవీపీ ఆరోపించింది. జీతాలు లేక పొట్టకూటి కోసం లెక్చరర్లుగా మారిన నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ అనేది విద్యార్థుల హక్కే కానీ, ప్రభుత్వం వేసే భిక్ష కాదని స్పష్టం చేశారు. హక్కుల కోసం పోరాడుతుంటే విద్యార్థులపై లాఠీఛార్జీలు చేస్తూ, అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్త ఉధృత ఉద్యమానికి అంకురార్పణ చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలోని అన్ని కళాశాల ప్రాంగణాలు, విశ్వవిద్యాలయాలు మరోసారి ఉద్యమ వేదికలుగా మారి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరణశాసనం రాస్తాయని ABVP నేతలు తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

పేద విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ జులై 14న చేపట్టే ఈ రాష్ట్రవ్యాప్త కాలేజీల బంద్‌ను విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు, విద్యాభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని ఏబీవీపీ పిలుపునిచ్చింది.

Follow Us