AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని రకాల సీతాకోక చిలుకలు ఉన్నాయో తెలుసా.. సర్వేలో ఆసక్తికర విషయాలు..

ఎక్కడైతే సీతాకోకచిలుకలు స్వేచ్ఛగా వివరిస్తాయో అక్కడ జీవవైవిద్యం ఉన్నట్టు అర్థం.. సృష్టి అందాన్ని.. అతివల సౌందర్యాన్ని సీతాకోకచిలుకలతో పోల్చుతాం.. పూలలోని మకరందాన్ని ఆస్వాదించి సృష్టిలోని రంగులన్నీ తాను పులుముకున్నట్లు సోబగులద్దే మృదువైన ప్రాణి సీతాకోకచిలుక.. మన దేశంలో ఎన్ని సీతాకోకాచిలుకల జాతులు ఉన్నాయో తెలుసా..?

తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని రకాల సీతాకోక చిలుకలు ఉన్నాయో తెలుసా.. సర్వేలో ఆసక్తికర విషయాలు..
Butterfly Species Survey In Telangana
G Peddeesh Kumar
| Edited By: Krishna S|

Updated on: Nov 12, 2025 | 12:25 PM

Share

జీవవైవిధ్యానికి ఇండికేటర్స్‌గా భావించే సీతాకోకచిలుకల సంఖ్యను లెక్కించే సర్వే తెలుగు రాష్ట్రాల్లో మొదలైంది. ప్రకృతి అందాన్ని, జీవవైవిధ్యాన్ని సూచించే ఈ రంగుల ప్రాణులు స్వేచ్ఛగా విహరిస్తేనే ఆ ప్రాంతం కాలుష్య రహితంగా ఉన్నట్లు అర్థం. చూడగానే మనసు పులకరింపజేసే ఈ మృదువైన ప్రాణులు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో జాతులుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ములుగు జిల్లాలోని ఏటూరునాగారం రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో నిర్వహించిన అధ్యయనం పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

వరంగల్ వైల్డ్‌లైఫ్ సొసైటీ, అటవీశాఖ సంయుక్తంగా నిర్వహించిన ఈ సర్వేలో తొమ్మిది రాష్ట్రాలకు చెందిన పరిశోధకులు, పర్యావరణవేత్తలు పాల్గొన్నారు. చుట్టూ పచ్చని చెట్లు, వన్యప్రాణుల మధ్య పచ్చని అడవికి రంగులుద్దుతున్న వివిధ రకాల సీతాకోకచిలుకలను వారి కెమెరాలలో బంధించి, వాటి గురించి ఆరా తీశారు. మూడు రోజుల పరిశోధనలో ఏటూరునాగారం అభయారణ్యంలో మొత్తం 80 రకాల సీతాకోకచిలుకలు స్వేచ్ఛగా విహరిస్తున్నట్లుగా పరిశోధకులు గుర్తించారు.

గుర్తించిన 80 జాతులలో బారోనెట్, బాబ్రీ బ్లూ, ఇండియన్ జేజే టెయిల్, రెడ్ ఐ, టానిరాజు, కామన్ ఫోరింగ్ లాంటి అనేక అరుదైన రకాల సీతాకోకచిలుకలు ఉన్నాయి. కాలుష్య రహిత ప్రాంతం కావడం వల్లే ఏటూరునాగారం అభయారణ్యం వీటి స్వేచ్ఛా విహారానికి అనుకూలంగా ఉందని అధికారులు తెలిపారు. సహజంగా ఒక సీతాకోకచిలుక జీవితకాలం నాలుగు నెలలు మాత్రమే ఉంటుంది. మరికొన్ని జాతులు ఆరు నెలల నుండి ఒక సంవత్సరం లోపు జీవిస్తాయి.

ప్రపంచవ్యాప్తంగా 17,500 రకాల సీతాకోకచిలుకల జాతులు ఉన్నాయి. వీటిలో భారతదేశంలో 1,501 జాతుల సీతాకోకచిలుకలు ఉన్నట్లు పరిశోధనల్లో గుర్తించారు. వీటిలో తెలుగు రాష్ట్రాలలో 170కి పైగా జాతులు ఉండగా, తెలంగాణలో 140కి పైగా జాతులు ఉన్నాయి. ములుగు జిల్లాలో 80 రకాలు ఉన్నట్లు తేలగా, మిగిలిన జాతులు ఉన్నాయా లేదా అంతరించిపోయాయా అనేది పూర్తి సర్వేలో తేలాల్సి ఉంది.

ములుగు జిల్లా అటవీశాఖ అధికారి రాహుల్ కిషోర్ జాదవ్ మాట్లాడుతూ..‘‘ఇలాంటి జీవవైవిధ్య సూచికల గణన వల్ల అనేక కొత్త విషయాలు తెలుస్తాయి. ఎన్ని రకాల జాతులను గుర్తించాం.. మిగిలిన జాతులు ఏమైపోయాయి..? అనే పూర్తి వివరాలు తేల్చి వెబ్‌సైట్‌లో పెడతా’’ అని తెలిపారు. అర్బన్ ఏరియాల్లో పెరుగుతున్న కాలుష్యం మనిషి మనుగడకు ముప్పు తెస్తున్న నేపథ్యంలో ఇలాంటి బయో ఇండికేటర్స్ స్వేచ్ఛగా విహరించినంత కాలమే మనిషి మనుగడ సాఫీగా సాగుతుందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి..