Telangana: తెలంగాణలో విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన చేపల వేట
చేపల వేట మనుషుల ప్రాణం తీస్తోంది. చేపల వేటకు వెళ్లి ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అయినా ప్రజలు మాత్రం వేటను ఆపడం లేదు. తాజాగా తెలంగాణలో చేపల వేట వల్ల ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లో ఈ విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి.

చేపల.. అందరూ ఇష్టంగా తింటారు. గ్రామాల్లో అయితే స్వయంగా చెరువులకు వెళ్లి చేపలు పట్టుకొచ్చి వండుకుని తింటారు. కానీ చేపల వేట వల్ల ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. చెరువులో ఫ్రీగా చేపలు దొరుకుతాయని వేటకు వెళ్లడం నీటిలో మునిగి మరణించడం.. అయినా ప్రజలు మాత్రం చేపల వేటకు వెనకాడరు. తాజాగా రాష్ట్రంలో చేపల వేటకు వెళ్లి ముగ్గురు వ్యక్తులు మరణించడం కలకలం రేపింది. కరీంనగర్‌లో ఇద్దరు, మహబూబాబాద్ జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
కరీంనగర్‌లోని ఎల్ఎండీ రిజర్వాయర్‌లో ఇద్దరు వ్యక్తులు చేపల వేటకు వెళ్లారు. కరీంనగర్‌కు చెందిన సయ్యద్ ఫిరోజ్.. తన తమ్ముడి కొడుకు సయ్యద్ రిజ్వాన్‌తో కలిసి చేపలు పట్టేందుకు వెళ్లారు. అయితే చేపలు పడుతున్న సమయంలో రిజ్వాన్ నీళ్లలో మునిగిపోయాడు. అతన్ని కాపాడే క్రమంలో ఫిరోజ్ కూడా నీటిలో మునిగి చనిపోయాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. పెద్దనాన్న, కొడుకు మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోనూ ఇటువంటి ఘటనే జరిగింది. బూరుగుంపు గ్రామానికి చెందిన నరేష్ తిట్టే వాగులో చేపల వేటకు వెళ్లాడు. అయితే భారీ వర్షాలకు వాగు ఉధృతి పెరగడంతో నీటిలో మునిగి మరణించాడు. అతడి మృతదేహం కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. భారీ వర్షాలకు వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయని.. ఈ సమయంలో చేపల వేటకు వెళ్లొద్దని పోలీసులు సూచించారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని.. ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని చెప్పారు.
ఏపీలోనూ ఒకరు మృతి..
అటు ఏపీలోనూ ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. గార మండలం బందరువానిపేటలో చేపలవేటకు వెళ్లిన మత్స్యకారుల పడవ బోల్తా పడింది. అలల ఉధృతికి సముద్రంలో బోటు బోల్తా పడగా.. పడవలో ఉన్న గజేంద్ర అనే మత్స్యకారుడు మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడికి ముగ్గురు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నాడు. గజేంద్ర మరణంతో కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
