AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: గది తలుపు తెరిచేసరికి షాకింగ్ సీన్..! యువ ఆర్కిటెక్ట్ మృతిపై ఎన్నో అనుమానాలు..!

హైదరాబాద్‌లోని టోలిచౌకి పోలీస్‌స్టేషన్ పరిధిలో 27 ఏళ్ల యువ ఆర్కిటెక్ట్, ఇంటీరియర్ డిజైనర్ సమీహా వజాహత్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన ఘటన కలకలం రేపింది. తన నివాసంలో ఉరివేసుకుని కనిపించిన సమీహా మృతిపై కుటుంబ సభ్యులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.

Hyderabad: గది తలుపు తెరిచేసరికి షాకింగ్ సీన్..! యువ ఆర్కిటెక్ట్ మృతిపై ఎన్నో అనుమానాలు..!
Young Architect Death
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Aug 05, 2026 | 2:42 PM

Share

హైదరాబాద్‌లోని టోలిచౌకి పోలీస్‌స్టేషన్ పరిధిలో 27 ఏళ్ల యువ ఆర్కిటెక్ట్, ఇంటీరియర్ డిజైనర్ సమీహా వజాహత్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన ఘటన కలకలం రేపింది. తన నివాసంలో ఉరివేసుకుని కనిపించిన సమీహా మృతిపై కుటుంబ సభ్యులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ ఆధారాల ఆధారంగా అసలు కారణాన్ని నిర్ధారించనున్నట్లు అధికారులు తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం.. టోలిచౌకిలోని ఎస్‌ఏ కాలనీలో ఉన్న క్యూ-మ్యాక్స్ డైమండ్ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన జరిగింది. సమీహా ఇంటి నుంచే ఆర్కిటెక్ట్, ఇంటీరియర్ డిజైనర్‌గా పనిచేస్తూ కుటుంబంతో కలిసి నివసిస్తోంది. ఘటన అనంతరం ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు.

మృతురాలి తండ్రి మహమ్మద్ అతారుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్రం సమీహా గది తలుపు వేసుకుని బయటకు రావడం లేదని సమాచారం అందడంతో వెంటనే అక్కడికి వెళ్లారు. మార్గమధ్యంలో అల్లుడికి ఫోన్ చేయగా తాను ఆఫీసులో ఉన్నానని చెప్పాడని తెలిపారు. అయితే తాము ఇంటికి చేరుకునే సరికి అల్లుడు ఇప్పటికే అక్కడికి చేరుకుని గది తలుపు తెరిచి, ఉరిలో ఉన్న సమీహాను కిందకు దించి మంచంపై పడుకోబెట్టాడని ఆరోపించారు. అంతేకాకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఆలస్యం చేశారని కూడా పేర్కొన్నారు.

వివాహం జరిగినప్పటి నుంచి భర్త, అత్తింటి వారి వేధింపుల గురించి తమ కుమార్తె పలుమార్లు చెప్పిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మృతిపై తమకు తీవ్ర అనుమానాలు ఉన్నాయని, సమగ్ర దర్యాప్తు జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని పోలీసులను కోరారు.

మరోవైపు టోలిచౌకి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సభ్యుల ఆరోపణలతో పాటు ఘటనాస్థలంలోని పరిస్థితులు, ఫోరెన్సిక్ ఆధారాలు, కాల్ డేటా, పోస్టుమార్టం నివేదిక తదితర అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే మరణానికి గల అసలు కారణంపై స్పష్టత వస్తుందని పోలీసులు వెల్లడించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us