AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: అర్ధరాత్రి గర్ల్స్ హాస్టల్ గదిలో వింత శబ్దాలు.. తెల్లారి డోర్ తీసి చూడగా భయపెట్టే సీన్.. ఇదిగో వీడియో..

సినిమాను మించిన రేంజ్ ట్విస్ట్ ఇదీ. అర్ధరాత్రి హాస్టల్ గదిలో భయంకర శబ్దాలు రావడంతో భయపడిపోయిన ఇద్దరు విద్యార్థినులు.. వెంటనే దానికి గడియపెట్టి వేరే గదికి వెళ్లి పడుకున్నారు. తెల్లవారిన తర్వాత ధైర్యం చేసి డోర్ తీయగా లోపల ఉన్న సీన్ చూసి ఒక్కసారిగా షాక్‌తో పరుగు తీశారు. అక్కడ ఉన్నది చూస్తే మీరైనా వణికిపోవాల్సిందే. అదేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Video: అర్ధరాత్రి గర్ల్స్ హాస్టల్ గదిలో వింత శబ్దాలు.. తెల్లారి డోర్ తీసి చూడగా భయపెట్టే సీన్.. ఇదిగో వీడియో..
Python Enters Girls Hostel Room
N Narayana Rao
| Edited By: |

Updated on: Jun 04, 2026 | 9:48 AM

Share

బయట చూస్తే కుండపోత వర్షం, భయంకరమైన ఉరుములు, మెరుపులు, పిడుగుల శబ్దాలు.. ఆ పెద్ద హాస్టల్ బిల్డింగ్‌లో కేవలం ఇద్దరే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. అంతలోనే వారు పడుకున్న గదిలో ఏదో విచిత్రమైన, భయంకరమైన సౌండ్ రావడం మొదలైంది. ఏంటో చూద్దామంటే కరెంట్ లేదు. ఒకవైపు చిమ్మచీకటి, మరోవైపు గదిలో బుసబుస మంటూ వింత శబ్దాలు.. ఆ విద్యార్థినులకు గుండె ఆగినంత పని అయ్యింది. ఎలాగోలా ధైర్యం చేసి హాస్టల్ వాచ్ ఉమెన్ సహాయంతో ఆ గదికి బయట నుంచి గడియపెట్టి, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పై అంతస్తులోని మరో గదికి పరుగులు తీశారు. తీరా తెల్లవారిన తర్వాత అసలు రాత్రి ఆ గదిలో ఏం జరిగిందో చూద్దామని తలుపు తీసిన ఆ ఇద్దరు స్టూడెంట్స్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో చోటుచేసుకుంది. సత్తుపల్లిలోని జేవియర్ డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న గిరిజన బాలికల వసతి గృహంలోకి అర్ధరాత్రి వేళ ఒక భారీ కొండచిలువ చొరబడింది. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో హాస్టల్‌లో విద్యార్థినులు ఎవరూ లేరు. అయితే బిఎడ్ చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు మాత్రం నిన్ననే హాస్టల్‌కు చేరుకున్నారు. రాత్రి భారీగా వర్షం కురవడంతో హాస్టల్ పక్కనే ఉన్న అటవీ ప్రాంతం నుంచి ఏకంగా 12 అడుగుల పొడవున్న భారీ కొండచిలువ హాస్టల్లోకి ప్రవేశించింది. ఆ ఇద్దరు అమ్మాయిలు ఉన్న రూమ్‌లోకి దూరి, ఒక మూలన చుట్టుకుని పడుకుంది.

చీకటిగా ఉండటం వల్ల లోపలికి ప్రవేశించిన ఆ భారీ కొండచిలువ మొదట ఆ విద్యార్థినులకు కనిపించలేదు. కానీ అది వింతగా బుసలు కొడుతూ శబ్దాలు చేయడంతో లోపలికి ఏదో క్రూర జంతువు లేదా పాము వచ్చిందని గ్రహించి అమ్మాయిలు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆ గదికి తాళం వేసి పైకి వెళ్లిపోవడంతో తృటిలో ఒక పెద్ద ప్రమాదం తప్పింది. ఉదయాన్నే తలుపులు తీసి చూడగా.. అక్కడ 12 అడుగుల కొండచిలువను చూసి భయంతో పరుగులు తీశారు. వెంటనే వారు హాస్టల్ వార్డెన్‌కు సమాచారం అందించడంతో ఆయన అటవీ శాఖలో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగి ఎండి మహమ్మద్‌కు ఫోన్ చేసి విషయం చెప్పారు.

సమాచారం అందుకున్న వెంటనే మహమ్మద్ హుటాహుటిన హాస్టల్‌కు చేరుకున్నారు. అత్యంత చాకచక్యంగా ఆ భారీ కొండచిలువను పట్టుకునే ప్రయత్నం చేస్తుండగా.. ఆ కొండచిలువ ఒక్కసారిగా భీకరంగా బుసలు కొడుతూ ఆయనపైకి దూకింది. అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా భయంతో వణికిపోయారు. అయినప్పటికీ మహమ్మద్ ఏమాత్రం భయపడకుండా సమయస్ఫూర్తితో ఆ కొండచిలువను లొంగదీసుకుని, బయటకు తీసుకొచ్చి గోనె సంచులలో బంధించారు. గోనె సంచిలో బంధించిన ఆ 12 అడుగుల భారీ కొండచిలువను సురక్షితంగా సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి విడిచిపెట్టారు. దీంతో హాస్టల్‌లో ఉన్న ఆ ఇద్దరు విద్యార్థినులు, హాస్టల్ సిబ్బందితో పాటు చుట్టుపక్కల ప్రజలు పెద్ద గండం గడిచిందని ఊపిరి పీల్చుకున్నారు.

వీడియో చూడండి..

Follow Us