లేడికి లేచిందే పరుగు..! మా రూటే సెపరేట్ అంటున్న GenZలు
ఏడాది పొడవునా కష్టపడి ఒక్క పెద్ద లాంగ్ ట్రిప్ వేసే పద్ధతికి నేటి జెన్ జీ తరం స్వస్తి పలుకుతోంది. రీఛార్జ్ అవ్వడానికి వీకెండ్ ప్లాన్స్ లేదా చిన్నపాటి విహారయాత్రలకే నేటి యువత జై కొడుతోంది. ఎయిర్‌బీఎన్‌బీ నిర్వహించిన తాజా సర్వేలో వెల్లడైన ఈ ఆసక్తికరమైన ట్రావెల్ ట్రెండ్స్, యువత మారుతున్న జీవనశైలి గురించి వివరంగా తెలుసుకుందాం!

నెలల ముందే ప్లాన్ చేసుకునే పాత కాలపు ప్రయాణాలకు నేటి తరం పూర్తిగా దూరమైంది. ప్లాన్ లేకపోవడమే ప్లాన్ అనుకుంటూ, యూనిక్ అనుభూతుల కోసం వీకెండ్స్‌లో చిన్నపాటి పర్యటనలకు యువత మొగ్గు చూపుతోంది. పర్యాటక ప్రదేశాల కంటే బస చేసే ప్రదేశానికే ప్రాధాన్యతనిస్తూ మారుతున్న జెన్ జీ ట్రావెల్ అలవాట్ల గురించి, ఆ సర్వేలో వెల్లడైన ఆశ్చర్యకరమైన విషయాల గురించి తెలుసుకుందాం!
రీఛార్జ్ అవ్వడానికి సరైన మార్గం
నేటి యువత భారీ ట్రిప్పుల కంటే చిన్న చిన్న పర్యటనలకే ఎక్కువ ఇష్టపడుతోంది. 87 శాతం మంది యువత వారం లోపు ముగిసిపోయే ట్రిప్స్‌కు మొగ్గు చూపుతుండగా, ఏడాదిలో కనీసం 3 చిన్న యాత్రలు చేయడానికి 70 శాతం మంది ఆసక్తిగా ఉన్నారు. ఒకప్పుడు నెలల ముందే బుక్ చేసుకునే పద్ధతిని పక్కన పెట్టి, కేవలం కొన్ని రోజుల ముందు లేదా వారం ముందు మాత్రమే ప్లాన్ చేసుకోవడం నేటి ట్రెండ్‌గా మారింది. తాము చేసే ఏ రెండు ప్రయాణాలు కూడా ఒకేలా ఉండకూడదని, ప్రతి ట్రిప్ ప్రత్యేకంగా ఉండాలని 67 శాతం మంది కోరుకుంటున్నారు.
‘యాంటీ-ఇటినరీ’ తరం
నేటి యువతను ‘యాంటీ-ఇటినరీ’ అని పిలవడంలో తప్పులేదు. వీరు కచ్చితమైన టైమ్ టేబుల్ ప్రకారం ప్రదేశాలను చూడటానికి ఇష్టపడరు. 95 శాతం మంది తమ ట్రిప్ వ్యక్తిగతంగా, భిన్నంగా ఉండాలని భావిస్తారు. 64 శాతం మంది యువత తమ ప్రయాణంలో కొంత సమయాన్ని ప్లాన్ లేకుండానే ఉంచుకుంటారు. చూడదగ్గ ప్రదేశాల జాబితాను పక్కన పెట్టి, ప్రశాంతంగా ఒక్కచోట విశ్రాంతి తీసుకోవడం వీరికి ఎంతో ముఖ్యం. ఇది పర్యాటక రంగంలో వస్తున్న పెను మార్పుకు నిదర్శనం.
వసతికే ప్రాధాన్యత
డెస్టినేషన్ కంటే తమ అభిరుచికి తగ్గట్టుగా ఉండే ప్రదేశాలను ఎంచుకోవడానికి 92 శాతం మంది ఆసక్తి చూపుతున్నారు. వీరి దృష్టిలో పర్యాటక కేంద్రాల కంటే లోకల్ మార్కెట్లలో తిరగడం, స్థానిక సంస్కృతిని అనుభవించడం ముఖ్యం. అందువల్ల, 82 శాతం మంది యువత బస చేసే వసతికే ప్రాధాన్యతనిస్తున్నారు. చక్కని బాల్కనీ, స్నేహితులతో కలిసి ముచ్చటించుకోవడానికి వీలుగా ఉండే లివింగ్ ఏరియా ఉన్న చోట ఉండటానికే 78 శాతం మంది యువత ఇష్టపడుతున్నారు. మొత్తానికి, ప్రయాణం అనేది కేవలం తిరగడం మాత్రమే కాదు, అది తమ వ్యక్తిత్వాన్ని చాటుకునే ఒక సాధనంగా మారుతోంది. ఈ మార్పులు భవిష్యత్తులో పర్యాటక రంగ గమనాన్ని పూర్తిగా మార్చనున్నాయి.
