ఆ బ్లూటూత్ హెడ్ ఫోన్స్ వాడుతున్నారా..? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..
ఫోన్ ఉన్న ప్రతిఒక్కరు బ్లూటూత్ హెడ్ ఫోన్స్ వాడడం కామన్. కొంతమంది పెద్ద బ్రాండ్ల డివైజ్ లు వాడుతుంటారు. అటువంటి వారిని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అలర్ట్ చేసింది. వీటితో పర్సనల్ డేటా లీక్ అయ్యే ఛాన్స్ ఉందని హెచ్చరించింది.

టెక్నాలజీతో ఎంత మంచి జరుగుతుందో.. అంతే చెడు కూడా ఉంటుంది. సైబర్ దాడులతో ఇప్పటికే ఎంతో మంది లబోదిబోమంటున్నారు. కోట్ల రూపాయలను కేటుగాళ్లు కాజేస్తుండగా.. వారిని పట్టుకోవడం పెద్ద సవాల్‌గా మారింది. సైబర్ నేరగాళ్లు అంతటితో ఆగకుండా ఫోన్స్, సిస్టమ్స్ హ్యాక్ చేస్తూ పర్సనల్ డేటా సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇక దేశాల మధ్య గతంలో నార్మల్ యుద్ధాలు జరిగితే ఇప్పుడు డిజిటల్ యుద్ధాలు జరుగుతున్నాయి. కొన్ని దేశాలు సైతం సైబర్ నేరగాళ్లతో ఇతర దేశాలపై దాడులకు పాల్పడుతున్నాయి. ఇప్పుడు బ్లూటూత్ హెడ్ ఫోన్‌ల వంతు వచ్చింది. పలు ప్రధాన కంపెనీల బ్లూటూత్ హెడ్ ఫోన్స్‌లో భద్రతా లోపాలు బట్టబయలయ్యాయి. తొలుత దీనిని జర్మనీ సైబర్ సెక్యూరిటీ సంస్థ గుర్తించగా.. భారతీయులను ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అలర్ట్ చేసింది. ఈ డివైజ్‌లలో వాడే ఐరోహా చిప్‌ల వల్ల ఫోన్స్ హ్యాక్ అయ్యే అవకాశం ఉందని CERT-In హెచ్చరించింది. వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ప్రధానంగా సోనీ, జేబీఎల్, జాబ్రా ఎలైట్, మార్షల్ వంటి ప్రీమియం మోడళ్లలో ఈ లోపాలను గుర్తించడం ఆందోళన కలిగిస్తుంది. థర్డ్ పార్టీ సోర్స్ ద్వారా తైవాన్‌కు చెందిన ఐరోహ చిప్ లను ఉపయోగిస్తున్న సుమారు 100 మోడళ్లలో ఈ లోపాలు ఉన్నట్లు అంచనా వేసింది. ఈ బ్లూటూత్‌లను ఉపయోగించి కేటుగాళ్లు ఫోన్‌లోని డేటాను యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది. మీ ఆడియోలు వినడం, ఫోన్ కాల్స్ డేటా చోరీ చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు ఈ మోడళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో సదరు సంస్థలు ఈ లోపాలను అధిగమించేందుకు అప్‌డేట్ వెర్షన్స్ తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ మోడళ్లలోనే..
Sony CH-720N, Sony WF-1000XM3, Sony WF-C500, Sony WI-C100, Jabra Elite 8 Active, JBL Live Buds 3, Bose QuietComfort Earbuds, Marshall ACTON III, Marshall MOTIF II, Marshall STANMORE III సహా మరికొన్ని మోడళ్లకు చెందిన బ్లూటూత్ మోడళ్లు వాడే ప్రజలు అప్రత్తమంగా ఉండాలని CERT-In హెచ్చరించింది.