మీ ఫోన్ స్లోగా ఉందా? ఇలా చేస్తే ఫోన్ స్పీడ్ పెరగడమే కాదు.. మరెన్నో లాభాలు
చాలా రోజులపాటు వాడకుండా ఉండే యాప్‌లు ఫోన్ పర్ఫార్మెన్స్‌ను దెబ్బతీస్తాయి. బ్యాటరీని వేగంగా ఖాళీ చేయడం, మొబైల్ డేటాను వాడుకోవడం, ఫోన్ స్టోరేజ్‌ను అనవసరంగా ఆక్రమించడం వంటి సమస్యలకు ఇవే కారణం. ఫోన్ వేగంగా పనిచేయాలన్నా, మీ డేటా సురక్షితంగా ఉండాలన్నా అనవసరమైన యాప్‌లను ఎప్పటికప్పుడు తొలగించడం చాలా అవసరం. ఫోన్‌లో నిల్వ ఉన్న ఈ 'డిజిటల్ చెత్తను' ఎలా శుభ్రం చేసుకోవాలో తెలుసుకుందాం.

స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు.. రకరకాల యాప్‌లను డౌన్‌లోడ్ చేయడం, వాటిని ఒకసారి వాడి మర్చిపోవడం మనకు అలవాటు. కానీ, నెలల తరబడి ఓపెన్ చేయని యాప్‌లు మీ ఫోన్‌లో అలాగే ఉండిపోవడం వల్ల మీ ప్రైవసీతో పాటు సెక్యూరిటీ కూడా తీవ్ర ప్రమాదంలో పడే అవకాశం ఉందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం ఒకరోజు అవసరానికి డౌన్‌లోడ్ చేసుకున్న యాప్‌లు, మీ కెమెరా, మైక్రోఫోన్, లొకేషన్ మరియు కాంటాక్ట్స్ వంటి కీలకమైన పర్మిషన్లను కలిగి ఉంటాయి. ఇవి బ్యాక్‌గ్రౌండ్‌లో నిరంతరం రన్ అవుతూ, మీ వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే ప్రమాదం ఉంది.
అన్‌యూజ్డ్ యాప్‌ల వల్ల కలిగే నష్టాలు
1. డేటా భద్రత: మీరు యాప్‌ను వాడకపోయినా, దానికి ఇచ్చిన పర్మిషన్ల వల్ల అది మీ లొకేషన్, అలవాట్ల డేటాను సేకరిస్తూనే ఉంటుంది. భవిష్యత్తులో ఆ యాప్‌లలో ఏదైనా సెక్యూరిటీ లోపం తలెత్తితే, మీ వ్యక్తిగత సమాచారం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. 2. ఫోన్ వేగం తగ్గడం: ఇవి బ్యాక్‌గ్రౌండ్‌లో నోటిఫికేషన్లు పంపడం, అప్‌డేట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడం వంటి పనులు చేస్తాయి. దీనివల్ల ఫోన్ వేడి అవ్వడమే కాకుండా స్లో అయిపోతుంది. 3. మెమరీ సమస్య: భారీ స్టోరేజ్ ఆక్రమించే యాప్‌ల వల్ల ఫొటోలు, వీడియోల కోసం ఫోన్‌లో స్పేస్ దొరకదు.
ఎలా క్లీన్ అప్ చేయాలి?
- ఆఫ్‌లోడ్ & ఆర్కైవింగ్: ఒకవేళ ఆ యాప్ భవిష్యత్తులో అవసరమవుతుందనిపిస్తే, ఐఫోన్‌లో ‘ఆఫ్‌లోడ్ యాప్’ (Offload App), ఆండ్రాయిడ్‌లో ‘యాప్ ఆర్కైవింగ్’ (App Archiving) ఫీచర్లను ఉపయోగించండి. దీనివల్ల యాప్ డిలీట్ అయినా, అందులోని మీ డేటా భద్రంగా ఉంటుంది.
- క్రమం తప్పని చెకప్: ప్రతి మూడు నెలలకు ఒకసారి మీ ఫోన్‌లోని యాప్‌ల లిస్ట్‌ను తనిఖీ చేసి, వాడని వాటిని తొలగించండి.
- లాగ్‌అవుట్ & అకౌంట్ క్లోజ్: యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేసే ముందు కచ్చితంగా ‘లాగ్‌అవుట్’ అవ్వాలి. ఆ యాప్ ఇక ఎప్పటికీ అవసరం లేదు అనుకుంటే, మీ అకౌంట్‌ను సర్వర్ల నుండి పూర్తిగా డిలీట్ చేయండి. అప్పుడే మీ డేటా కంపెనీల సర్వర్లలో నిల్వ ఉండకుండా, మీ ప్రైవసీకి పటిష్టమైన రక్షణ ఉంటుంది.
మీ ఫోన్ ఎంత క్లీన్‌గా ఉంటే, మీ డిజిటల్ జీవితం అంత సురక్షితంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడే మీ ఫోన్‌ను ఒకసారి చెక్ చేసి, అనవసరమైన యాప్‌లకు గుడ్ బై చెప్పేయండి!
