AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రాండ్‌ Vs జనరిక్‌ ఫార్ములా ఒకటే.. ధరల్లో భారీ తేడా.. ఎందుకిలా?

బ్రాండ్‌ Vs జనరిక్‌ ఫార్ములా ఒకటే.. ధరల్లో భారీ తేడా.. ఎందుకిలా?

Phani CH
|

Updated on: Jul 25, 2026 | 1:11 PM

Share

ఒకే ఫార్ములా, ఒకే ప్రభావం ఉన్న మందుల్లో ధరల్లో ఎందుకు భారీ తేడా ఉంటుంది? బ్రాండెడ్ మందులతో పోలిస్తే జనరిక్ మందులు 50–80 శాతం తక్కువ ధరలో ఎందుకు లభిస్తాయి? వాటి నాణ్యత, పనితీరు, భద్రతపై ఉన్న అపోహలు ఎంతవరకు నిజం? జనరిక్ మందుల అసలు కథ, వాటి ప్రయోజనాలు, తక్కువ ధర వెనుక ఉన్న కారణాలను ఈ కథనంలో తెలుసుకోండి.

మనం రోజూ వాడే మందుల్లో ఎంతపెద్ద కథ ఉందో తెలుసా? ఒకే వ్యాధికి వాడే మందు, దాన్ని తయారుచేసే ఫార్ములా, అది చూపే ప్రభావం అంతా ఒక్కటే అయినా… ధరల దగ్గరికి వచ్చేసరికి మాత్రం కొండంత తేడా. వేల రూపాయలు పెట్టి కొనే బ్రాండెడ్ మందు స్థానంలో, జనరిక్ మందులు సగానికంటే తక్కువ ధరకు దొరుకుతున్నాయి. అసలు ఇవి, ఎందుకు ఇంత తక్కువ ధరకు ఇస్తున్నారు? వీటి క్వాలిటీలో ఏమైనా తేడా ఉంటుందా? ఇవి కూడా బ్రాండెడ్ మందుల లాగే ఫాస్ట్ గా పనిచేస్తాయా? వైద్య ఖర్చులు భారీగా పెరుగుతున్న వేళ బ్రాండెడ్ మందులకు, ఈ జనరిక్ మందులకు మధ్య తేడా ఏంటో ప్రతీ ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాల్సిందే! ఒకే మందు… ఒకే ఫార్ములా… కానీ ఒకటి ₹500… మరొకటి ₹120…! రెండూ ఒకే వ్యాధికి పనిచేస్తే… ధరలో ఇంత తేడా ఎందుకు? ఇదే బ్రాండ్ వర్సెస్ జనరిక్ మందుల అసలు కథ. మనకు అవసరమైన ప్రతి మందులోనూ ఒక కెమికల్‌ ఉంటుంది. దీన్నే మెడికల్‌ భాషలో A.P.I. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రిడియెంట్ అంటారు. మందు పేరు ఏదైనా… కంపెనీ ఏదైనా… జబ్బును నయం చేసే పదార్థం మాత్రం సేమ్ ఉంటుంది. జ్వరానికి ఉపయోగించే పారాసిటమల్‌నే తీసుకుంటే… మార్కెట్‌లో ఇది ఎన్నో బ్రాండ్ల నేమ్స్ తో అందుబాటులో ఉంటుంది. రకరకాల కంపెనీ పేర్లతో, వేర్వేరు ధరలకు అమ్ముతుంటాయి. కానీ అందులో ఉండే ఫార్మూలా మాత్రం సేమ్. ఇలాంటి మందులనే జనరిక్ మందులు అంటారు. జనరిక్ మందుల గురించి ఇంకా వివరంగా చెప్పాలంటే.. ఒక కొత్త మందును కనిపెట్టిన తర్వాత.. ఆ మందుకు పేటెంట్ హక్కులు ఉంటాయి. కొత్త మందును కనిపెట్టిన కంపెనీకి కొన్ని సంవత్సరాల పాటు ఆ మందును అమ్మే ప్రత్యేక హక్కు ఉంటుంది. దానినే పేటెంట్ అంటారు. అయితే, ఆ పేటెంట్ గడువు ముగిసిన తర్వాత.. అదే ఫార్ములాతో ఇతర కంపెనీలు తయారు చేసే మందులను జనరిక్ మందులు అంటారు. ఇవి బ్రాండెడ్ మందులతో పోలిస్తే చాలా తక్కువ ధరలో లభిస్తాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు జనరిక్ మందులపై ఆధారపడతారు. అయితే , జనరిక్ మందులపై మూడు పెద్ద అపోహలు ఉన్నాయి. మొదటిది. తక్కువ నాణ్యత. రెండు. ఈ మందులు ఆలస్యంగా పనిచేస్తాయని, ఇక మూడు. ఇవి పేదవాళ్ల కోసం మాత్రమే అని. తక్కువ ధరలో దొరుకుతున్నాయి కాబట్టి జనరిక్ మందుల నాణ్యతపై చాలామందికి ఇలాంటి డౌట్స్‌ ఉన్నాయి. కానీ నిపుణుల ప్రకారం ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమే. ఎందుకంటే, బ్రాండెడ్ మందులకు ఉండే నాణ్యత ప్రమాణాలే జనరిక్ మందులకు కూడా వర్తిస్తాయి. మరి, ఈ జనరిక్ మందులు ఎందుకు తక్కువ ధరకు లభిస్తాయి? దీనికి ప్రధాన కారణం ఖర్చులు అని చెప్పొచ్చు. పెద్దపెద్ద కంపెనీలు ఒక మందును మార్కెట్‌లోకి తెచ్చేటప్పుడు.. ప్యాకింగ్, మార్కెటింగ్, ప్రమోషన్లు చేసేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతుంటాయి. ఈ ఖర్చులన్నింటినీ కలిపి ఆ మందుల ఎమ్మార్పీపైనే వేస్తాయి. కానీ జనరిక్‌ మందులకు ఎలాంటి మార్కెటింగ్‌ లేదా ప్రమోషన్స్‌ అక్కర్లేదు. నేరుగా ఇవి మార్కెట్‌లోకి వస్తాయి. అందుకే బ్రాండెడ్‌ మందుల కంటే 50 నుంచి 80 శాతం తక్కువ ధరకు లభిస్తాయి. ఇక, ఈ జనరిక్ మెడిసన్స్‌ కూడా.. డ్రగ్ కంట్రోల్ సంస్థల నిబంధనలు పాటిస్తూనే తయారు చేస్తారు. సో, జనరిక్ మందుల్లో కూడా అదే యాక్టివ్ ఇంగ్రిడియెంట్ ఉంటుంది కాబట్టి… శరీరంలో వాటి ప్రభావం, పనిచేసే విధానంలో ఎటువంటి తేడా ఉండదు. అందుకే, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా జనరిక్ మందుల వినియోగం ఎక్కువగా ఉంది. తక్కువ ధరలో నాణ్యమైన చికిత్స అందుబాటులో ఉండటం వల్ల అన్ని వర్గాల ప్రజలు వీటిని ఉపయోగిస్తున్నారు. ఇక జనరిక్ మందుల వల్ల కలిగే ప్రధాన ప్రయోజనం… వైద్య ఖర్చులు తగ్గడం. ముఖ్యంగా షుగర్, బీపీ, గుండె సంబంధిత వ్యాధులు వంటి దీర్ఘకాలిక సమస్యలకు ప్రతిరోజూ మందులు వాడాల్సి ఉంటుంది. ఇలాంటి వారికి ప్రతి నెలా మందుల ఖర్చు పెద్ద భారంగా మారుతుంది. అలాంటి సందర్భాల్లో జనరిక్ మందులు అదే చికిత్సను తక్కువ ఖర్చుతో అందించడంలో సహాయపడతాయి. కుటుంబాలపై పడే వైద్య ఖర్చుల భారాన్ని చాలా వరకు తగ్గిస్తాయి. అంతేకాదు… ఆర్థిక పరిస్థితుల కారణంగా మందులు కొనలేని వారికి జనరిక్ మందులు ఒక మంచి ప్రత్యామ్నాయంగా చెప్పొచ్చు. భారత్‌లో కూడా జనరిక్ మందుల వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం జన్ ఔషధి కేంద్రాల ద్వారా తక్కువ ధరలకు మందులను అందిస్తోంది. మొత్తంగా చూస్తే… జనరిక్ మందులు తక్కువ ధరలో లభించడానికి కారణం వాటి నాణ్యత తక్కువగా ఉండటం కాదు. పరిశోధన, మార్కెటింగ్, బ్రాండింగ్ వంటి అదనపు ఖర్చులు తగ్గడం వల్లే వాటి ధరలు తగ్గుతాయి. సేమ్ ఫార్ములా… సేమ్ ఇంపాక్ట్‌… కానీ తక్కువ ఖర్చు. ఇదే జనరిక్ మందుల ప్రత్యేకత. అందుకే మందులు కొనుగోలు చేసే ముందు… వైద్యుల సలహాతో జనరిక్ ప్రత్యామ్నాయాల గురించి తెలుసుకోవడం ద్వారా ఆరోగ్య ఖర్చులను తగ్గించుకోవచ్చు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral Video: బాస్‌ అంటే మీలా ఉండాలి.. యజమాని మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం

Chennai Love Story: హిట్టా..? ఫట్టా..? కిరణ్‌ అబ్బవరం ఖాతాలో హిట్‌ పడిందా?

Follow Us