భారత్‌లో తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం! తెలుగు నేల నుంచే నింగిలోకి..
ఇస్రో గగన్‌యాన్, స్పేస్ స్టేషన్ వంటి కీలక ప్రయోగాలతో నిమగ్నమై ఉంది. వాణిజ్య, చిన్న ఉపగ్రహ ప్రయోగాలకు ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం అనివార్యమైంది. ఈ నేపథ్యంలో స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ తన విక్రమ్-1 రాకెట్‌ను శ్రీహరికోట నుండి ప్రయోగించనుంది. ఇది భారత అంతరిక్ష చరిత్రలో తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం కావడం విశేషం.

అంతరిక్ష ప్రయోగాల్లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సత్తా చాటుతోంది. గగన్ యాన్, సొంత స్పేస్ స్టేషన్, చంద్రుడిపై వ్యోమగాములను తీసుకెళ్లడం లాంటి అత్యంత కీలక ప్రయోగాలపై దృష్టి పెట్టింది ఇస్రో. కమర్షియల్ ప్రయోగాలతో పాటు స్వదేశీ అవసరాల కోసం వరుస ప్రయోగాలు చేస్తున్నా ఇస్రోపై ప్రపంచ దేశాల నుంచి ఆ దేశాల ఉపగ్రహాల ప్రయోగాల కోసం ఒత్తిడి పెరుగుతోంది. దీంతో ప్రైవేట్ ప్రయోగాలను ప్రోత్సహించేందుకు భారత్ నిర్ణయించింది. స్కై రూట్ అనే సంస్థ ప్రయోగాలకు సిద్దమైంది. ఈ నెలలోనే శ్రీహరికోట నుంచి తొలి ప్రైవేట్ రాకెట్ లాంచ్ జరగబోతోంది. దీంతో భారత్ అంతరిక్ష ప్రయోగ రంగంలో మరో అడుగు ముందుకు పడనుంది.
ఇస్రో రెండేళ్ల క్రితం అంతరిక్ష పరిశోధనలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు పాలసీని ప్రవేశ పెట్టింది. ఇందుకోసం ఇస్రో మౌలిక వసతులు ఉపయోగించుకునేందుకు వీలు కల్పించింది. ఇందులో భాగంగా రెండేళ్ల క్రితం శ్రీహరి కోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి స్కై రూట్ అనే సంస్థ టెస్ట్ లాంచ్ చేపట్టింది. ఇస్రో ప్రస్థానం మొదలైన నాటి నుంచి శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేపట్టారు. చంద్రుని పైకి, అంగారక గ్రహంపైకి , సూర్య గ్రహం వద్దకు ప్రయోగాలు చేయడమే కాకుండా ఒకే రాకెట్ ప్రయోగం ద్వారా సుమారు 103 ఉపగ్రహాలను సైతం అంతరిక్షంలోకి పంపి రికార్డు సృష్టించారు. వందకు పైగా రాకెట్ ప్రయోగాలు చేపట్టి శాస్త్ర సాంకేతిక రంగంలో ప్రపంచ దేశాలకు దీటుగా భారత్ ఎన్నో రికార్డులను కైవసం చేసుకుంది. అయితే ఈ తరహా ప్రయోగాలు అన్నీ భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులతో చేపట్టింది.
ఇది కూడా చదవండి: బంగారం వెదజల్లుతున్న అగ్నిపర్వతం! రోజూ కిలోల కొద్ది బయటపడుతున్న గోల్డ్.. ఎక్కడంటే?
కానీ ఇప్పుడు ఇస్రో అలా కాకుండా మరో కొత్త విధానాన్ని తీసుకొచ్చి శాస్త్ర సాంకేతిక రంగంలో ప్రైవేట్ సంస్థలకు సైతం అవకాశం కల్పించే దిశగా అడుగులు వేసింది. ఈ నేపథ్యంలోనే ఇస్రో ప్రైవేటు సంస్థలు కూడా రాకెట్ ప్రయోగాలు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. అందులో భాగంగానే ఇస్రో ఆధ్వర్యంలో స్కై రూట్ అనే కొత్త ప్రైవేటు అంతరిక్ష సంస్థ తమ సొంత నిధులతో రాకెట్ ప్రయోగాలు చేపట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే స్కై రూట్ సంస్థ తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుండి జూలై రెండవ వారంలో ప్రయోగాత్మకంగా విక్రమ్-1 అనే రాకెట్ ప్రయోగం జరుపనుంది. ఈ విక్రమ్-1 రాకెట్ ప్రయోగానికి సంబంధించి స్కైరూట్ శాస్త్రవేత్తలు ఇప్పటికే షార్‌లోని మొదటి లాంచ్ ప్యాడ్ వద్ద విక్రమ్-1 రాకెట్ కు సంబంధించి మొదటి దశ అనుసంధాన ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. రెండో దశ అనుసంధాన పనులను కూడా మొదలు పెట్టనున్న స్కైరూట్ శాస్త్రవేత్తలు తొలి ప్రైవేట్ లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
ప్రైవేట్ లాంచ్ ఎందుకంటే
అంతరిక్ష ప్రయోగాల్లో ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడాలనే ఉద్దేశంతో సొంతంగా స్పేస్ స్టేషన్, అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపడం, చంద్రుడిపైకి మానవ సహిత ప్రయోగం, ఇలా అనేక క్లిష్టమైన ప్రయోగాలతో బిజీగా ఉంది ఇస్రో. అలాగే ఇతర దేశాలకు సంబంధించిన అలాగే మన దేశానికి సంబంధించిన ప్రైవేటు సంస్థల ఉపగ్రహాలను నింగిలోకి పంపేందుకు ఇస్రో కమర్షియల్ ప్రయోగాలను కూడా చేపడుతూ వస్తోంది. అయితే ప్రైవేటు ఉపగ్రహాల ప్రయోగాల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో ఇస్రోకు తగిన సమయం లేకపోవడంతో ప్రైవేట్ రాకెట్ సంస్థలను ప్రోత్సహించడం ద్వారా చిన్నచిన్న ప్రయోగాలను ప్రైవేటు సంస్థలు చేపట్టడం ద్వారా కీలకమైన ప్రయోగాలను చేపట్టేందుకు ఇస్రోకు అవసరమైన సమయం దొరుకుతుంది. అమెరికాకు చెందిన నాసా సంస్థ క్లిష్టమైన ప్రయోగాలను చేపడుతుందంటే అక్కడ ప్రైవేట్ రాకెట్ సంస్థలు ఉండడం వల్లే. అదే తరహాలో భారత్ కూడా ప్రైవేట్ రాకెట్ సంస్థలను ప్రోత్సహించి ఇస్రో కీలక ప్రయోగాలు చేపట్టేలా ఈ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఈ నెలలో తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం జరగనుంది.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
