Radio: ప్రపంచ సమాచార వ్యవస్థ గతినే మార్చిన రేడియో.. ఈ ఆవిష్కరణ కోసం మార్కోనీ ఏం చేశాడో తెలుసా?

Radio: ఏదైనా ఒక విషయాన్ని కనిపెట్టడం అంత సులువు కాదు. ఒకవేళ కనిపెట్టినా దానిని విజయవంతంగా ప్రజలను ఒప్పించడం మరింత కష్టం.

Radio: ప్రపంచ సమాచార వ్యవస్థ గతినే మార్చిన రేడియో.. ఈ ఆవిష్కరణ కోసం మార్కోనీ ఏం చేశాడో తెలుసా?
Radio Marconi
Follow us
KVD Varma

|

Updated on: Jul 02, 2021 | 3:36 PM

Radio: ఏదైనా ఒక విషయాన్ని కనిపెట్టడం అంత సులువు కాదు. ఒకవేళ కనిపెట్టినా దానిని విజయవంతంగా ప్రజలను ఒప్పించడం మరింత కష్టం. ఒక్కోసారి ఎంతో కష్టపడి కనిపెట్టిన ఆ విషయాలు వెలుగులోకి రావడానికి.. ప్రపంచం ఒప్పుకోవడానికి చాలా సమయం పట్టొచ్చు. కానీ, అటువంటి విషయాలు భవిష్యత్తులోనూ ప్రపంచానికి ఒక మంచి మార్గాన్ని చూపిస్తాయి. సరిగ్గా అలాంటి ఆవిష్కరణ రేడియో తరంగాలు. రేడియోకి పేటెంట్ హక్కులు లభించి ఈరోజు (జూలై 2) కి సరిగ్గా 125 సంవత్సరాలు. ఈ సందర్భంగా రేడియో ఆవిష్కరణలో దానిని కనిపెట్టిన మార్కోనీ ప్రపంచానికి తన ఆవిష్కరణ గొప్పతనాన్ని ఎలా రుజువు చేశాడో తెలుసుకుందాం.

ఇటలీకి చెందిన ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త – గుగ్లిఎల్మో మార్కోని. విద్యుదయస్కాంత తరంగాల ద్వారా సందేశాలను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రసారం చేయాలని మార్కోనీ ఆలోచించాడు. దీని కోసం, ఆయన ఒక పరికరాన్ని తయారు చేశారు. దీనితో సందేశాలను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి కొంత దూరం పంపవచ్చు. ఈ పరికరం నుంచి సందేశం పంపించేవారితో పాటు మరోవైపు రిసీవర్ కూడా ఉండాలి. ఈ పరికరం నుంచి సందేశం పంపినవారి వద్ద నుంచి విద్యుదయస్కాంత తరంగాలు విడుదల అవుతాయి.. వాటిని అవతల వైపు ఉన్న రిసీవర్ పట్టుకుంటుంది.

అయితే మార్కోనికి తన దేశంలో పెద్దగా గుర్తింపు రాలేదు. ఆయన అభివృద్ధి చేసిన పరికరం గురించి స్వదేశంలో పెద్దగా స్పందన రాలేదు. దీంతో ఆయన 1896 లో మార్కోని ఈ పరికరంతో ఇంగ్లాండ్ వెళ్ళాడు. అక్కడ ఆయన సర్ విలియం ప్రైస్‌ను కలిశారు. మార్కోని లానే విలియమ్ కూడా వైర్‌లెస్ టెలిగ్రాఫీలో పనిచేస్తున్నారు. మార్కోని ఈ పరికరంతో విభిన్న ప్రయోగాలు చేసారు. ప్రతిసారీ సిగ్నల్‌ను మునుపటి కంటే ఎక్కువ దూరానికి పంపగలిగారు. 1896 లో, మార్కోని రేడియో కోసం పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆయనకు ఆ సంవత్సరం జాలై 2 వ తేదీన రేడియో కోసం పేటెంట్ లభించింది.

మార్కోని తన సొంత పరికరంతో 1899 సంవత్సరంలో, మార్కోని మరో ప్రయోగం చేశారు. ఈ సంవత్సరం అతను ఫ్రాన్స్, ఇంగ్లాండ్ మధ్య వైర్‌లెస్ సిగ్నల్ పంపడంలో విజయం సాధించాడు. ఈ రేడియో తరంగాలను కమ్యూనికేషన్ కోసం ఉపయోగించవచ్చని అప్పుడు పూర్తిగా నిరూపితమైంది. కానీ, శాస్త్రవేత్తలు మాత్రం భూమి గుండ్రని రూపం కారణంగా రేడియో తరంగాలు చాలా దూరం ప్రయాణించలేవని భావిస్తూ ఇది అంత ఉపయోగకరం కాదని అన్నారు. ఈ విషయం తప్పు అని నిరూపిస్తానని మార్కోని నిశ్చయించుకున్నారు. ఆయన ఈ తరంగాలను అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా పంపాలని నిర్ణయించుకున్నారు.

దీని కోసం, కెనడాలోని సెయింట్ జాన్స్‌లో సముద్ర తీరంలో ఉన్న ఒక మట్టిదిబ్బను ఎంపిక చేశారు. ఇక్కడ మార్కోని తన పరికరాన్ని వ్యవస్థాపించారు. మరోవైపు ఇంగ్లాండ్‌లోని పోల్ధు నుండి కెనడాకు సందేశాలు పంపించారు. 1901 డిసెంబరులో, ఇంగ్లాండ్ నుండి పంపిన సందేశం మార్కోని యాంటెన్నా విజయవంతంగా సంగ్రహించినది. ఈ ప్రయోగం ప్రపంచంలోని కమ్యూనికేషన్‌లో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని మీడియా వ్యవస్థలూ మార్కోని సూత్రంపై పనిచేస్తున్నాయి. ఈ ఆవిష్కరణకు 1909 లో మార్కోనికి నోబెల్ బహుమతి లభించింది.

Also Read: Rocket Launch: విమానం ద్వారా విజయవంతంగా అంతరిక్షంలోకి రాకెట్ ప్రయోగం సక్సెస్..నిర్ణీత కక్ష్యలోకి చేరిన ఉపగ్రహాలు

Microsoft Bug: బగ్‌ను కనిపెట్టింది.. రూ. 22 లక్షలు గెలుచుకుంది. అసమాన ప్రతిభతో అదరగొట్టిన 20 ఏళ్ల ఢిల్లీ యువతి.