ఇన్ని రోజులు ఇంత పెద్ద తప్పు చేశామా.. ల్యాప్‌టాప్‌తో ఫోన్ ఛార్జింగ్ పెడితే ఏమవుతుందో తెలుసా?
పవర్ బ్యాంక్ లేదు.. ఛార్జర్ అందుబాటులో లేదు.. అప్పుడు ఏం చేస్తాం? వెంటనే ఫోన్‌ను ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేసి ఛార్జ్ చేసేస్తుంటాం. చాలామందికి ఇది రోజూ అలవాటే. అయితే ఇలా ల్యాప్‌టాప్ ద్వారా ఫోన్ ఛార్జ్ చేయడం నిజంగా సురక్షితమేనా? దీనివల్ల ఫోన్ బ్యాటరీ పాడవుతుందా? లేదా మీ డేటా ఏమైనా చోరీకి గురవుతుందా? టెక్ నిపుణులు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం..

ఈ రోజుల్లో ల్యాప్‌టాప్‌లు కేవలం ఆఫీస్ పనికే పరిమితం కాలేదు. ఆన్‌లైన్ క్లాసులు, మీటింగ్‌లు, సినిమాలు చూడటం నుండి అనేక పనులకు ఎంతో మంది వీటిని ఉపయోగిస్తున్నారు. అయి, కొన్నిసార్లు చేతిలో ఫోన్ ఛార్జర్ లేనప్పుడు లేదా పవర్ బ్యాంక్ అందుబాటులో లేనప్పుడు.. చాలామంది ఫోన్‌ను ల్యాప్‌టాప్ యూఎస్‌బీ పోర్ట్‌కు కనెక్ట్ చేసి ఛార్జ్ చేస్తుంటారు. ఇలా చేయడం మంచిదేనా..? దీనివల్ల ఫోన్ బ్యాటరీ పాడవుతుందా? అనే డౌట్లు చాలా మందికి ఉంటాయి. అయితే మీ ల్యాప్‌టాప్ సరిగ్గా పనిచేస్తూ, మీరు ఉపయోగిస్తున్న కేబుల్ మంచి క్వాలిటీతో ఉంటే.. ల్యాప్‌టాప్ నుండి ఫోన్‌ను ఛార్జ్ చేయడం సాధారణంగా సురక్షితమే. అయితే వాల్ ఛార్జర్‌తో పోలిస్తే ల్యాప్‌టాప్ నుండి ఛార్జింగ్ అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఎందుకంటే ల్యాప్‌టాప్ యూఎస్‌బీ పోర్ట్‌లు సాధారణ ఛార్జర్ల కంటే చాలా తక్కువ పవర్‌ని అందిస్తాయి.
ఫోన్ బ్యాటరీకి ఏమైనా నష్టం జరుగుతుందా?
ఈ రోజుల్లో వస్తున్న దాదాపు అన్ని స్మార్ట్‌ఫోన్‌లలో ఓవర్ ఛార్జింగ్, ఓవర్ కరెంట్ నుండి రక్షణ కల్పించే అధునాతన సేఫ్టీ టెక్నాలజీ ఉంటుంది. కాబట్టి సాధారణ పరిస్థితుల్లో లాప్‌టాప్ ద్వారా ఫోన్ ఛార్జ్ చేయడం వల్ల ఫోన్ బ్యాటరీకి ఎలాంటి పెద్ద ప్రమాదం జరగదు.
అసలైన ప్రమాదం ఎప్పుడు ఎదురవుతుంది?
ల్యాప్‌టాప్‌తో ఛార్జ్ చేసేటప్పుడు అసలైన ప్రమాదం బ్యాటరీతో కాదు.. మీ డేటాతో.. అవును.. పరిచయం లేని వ్యక్తుల కంప్యూటర్లు లేదా పబ్లిక్ కంప్యూటర్ల నుండి ఫోన్‌ను ఛార్జ్ చేయడం చాలా ప్రమాదకరం. యూఎస్‌బీ కేబుల్ ద్వారా కేవలం విద్యుత్ మాత్రమే కాకుండా డేటా ట్రాన్స్‌ఫర్ కూడా జరుగుతుంది. ఒకవేళ మీ ఫోన్‌లో File Transfer మోడ్ ఆన్‌లో ఉంటే, మీ పర్సనల్ ఫోటోలు, ఫైళ్లు ఇతరుల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. అందుకే ఎల్లప్పుడూ మీకు నమ్మకమైన ల్యాప్‌టాప్‌లను మాత్రమే ఛార్జింగ్ కోసం ఉపయోగించండి. ఫోన్ కనెక్ట్ చేసినప్పుడు Charge Only మోడ్‌ను మాత్రమే ఎంచుకోండి.
ఛార్జింగ్ ఎందుకు స్లోగా అవుతుంది?
మీ ఫోన్ ల్యాప్‌టాప్‌నుండి చాలా నెమ్మదిగా ఛార్జ్ అవుతుంటే దానికి ప్రధాన కారణాలు ఇవే..
- పాత రకం USB 2.0 పోర్ట్‌లను ఉపయోగించడం.
- నాసిరకం కేబుల్స్ వాడటం.
- ఫోన్‌లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లేకపోవడం.
- ఛార్జ్ అవుతున్న సమయంలో కూడా ఫోన్‌ను నిరంతరం ఉపయోగించడం.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
- ఫోన్ ఛార్జ్ చేయడానికి ఎల్లప్పుడూ ఒరిజినల్ లేదా మంచి క్వాలిటీ ఉన్న కేబుల్‌ను మాత్రమే వాడండి.
- ల్యాప్‌టాప్ బాగా వేడెక్కుతున్నా లేదా యూఎస్‌బీ పోర్ట్ లూజ్‌గా ఉన్నా ఛార్జింగ్ పెట్టకండి.
- మీకు ఫోన్ త్వరగా ఛార్జ్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఒరిజినల్ వాల్ ఛార్జర్‌ను ఉపయోగించడమే అత్యుత్తమమైన మార్గం.
- ల్యాప్‌టాప్ నుండి ఛార్జ్ చేయడాన్ని కేవలం అత్యవసర సమయాల్లో మాత్రమే ప్రత్యామ్నాయంగా ఉపయోగించడం తెలివైన పని.
