Instagram: టీనేజర్ల భద్రతకు ఇన్‌స్టాగ్రామ్ కీలక చర్యలు.. ఇక ఆ అనుమతి తప్పనిసరి
ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడడం పరిపాటిగా మారింది. ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్స్ ద్వారా సోషల్ మీడియా యాప్స్‌ను వాడే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే టీనేజర్లు ఈ సోషల్ మీడియా యాప్స్ విషయంలో ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యంలో ప్రముఖ యాప్ ఇన్‌స్టాగ్రామ్ కీలక నిర్ణయం తీసుకుంది.

16 ఏళ్లలోపు ఉన్న ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు ఇకపై తల్లిదండ్రుల అనుమతి లేకుండా బోల్డ్ కంటెంట్ వీక్షించకుండా కఠిన చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా టీనేజర్ల కోసం భద్రతా చర్యలను విస్తృతం చేసే క్రమంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు మెటా స్పష్టం చేసింది. 18 ఏళ్లలోపు వినియోగదారులకు భద్రతా చర్యలను ఫేస్‌బుక్, మెసెంజర్లకు విస్తరిస్తున్నట్లు కూడా పేర్కొంది. ముఖ్యంగా సోషల్ మీడియా యువకుల జీవితాలను తప్పుగా ప్రభావితం చేస్తుందనే ఆరోపణల నేపథ్యంలో ఇకపై తల్లిదండ్రులు తమ పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాలను పర్యవేక్షించే అవకాశం ఇస్తామని మెటా గతేడాది సెప్టెంబర్‌లో ప్రకటించింది. ఆ నిర్ణయానికి అనుగుణంగా ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ టీనేజ్ యూజర్లకు ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఇన్‌స్టాగ్రామ్ తాజా అప్‌డేట్స్ మొదట యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాలోని వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి. భవిష్యత్‌లో ప్రపంచ వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి. ఈ మార్పుల ప్రకారం 16 ఏళ్లలోపు యువకులు తల్లిదండ్రులు అనుమతి ఇవ్వకపోతే ఇన్‌స్టాగ్రామ్ లైవ్ ఉపయోగించలేరు. అలాగే డైరెక్ట్ మెసేజ్‌లలో బోల్డ్ కంటెంట్ ఉంటే ఆ ఇమేజెస్‌ను బ్లర్ చేసే సదుపాయం ఫీచర్‌ను ఆఫ్ చేయడానికి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అవుతుంది. అలాగే మెటా తన ఫేస్‌బుక్, మెసెంజర్ ప్లాట్‌ఫామ్‌లకు కూడా టీనేజ్ ఖాతా భద్రతలను విస్తరిస్తున్నట్లు పేర్కొంది.
టీనేజ్‌లో ఉన్న ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు ఇప్పటికే కొన్ని భద్రతా చర్యలు అందుబాటులో ఉన్నాయి. టీనేజర్ల ఖాతాలను డిఫాల్ట్‌గా ప్రైవేట్‌గా సెట్ చేయడం, అపరిచితుల నుంచి ప్రైవేట్ సందేశాలను బ్లాక్ చేయడం, ఫైట్ వీడియోలు వంటి సున్నితమైన కంటెంట్‌పై కఠినమైన పరిమితులు, 60 నిమిషాల తర్వాత యాప్ నుంచి నిష్క్రమించడానికి రిమైండర్లు, నిద్రవేళల్లో నోటిఫికేషన్లను ఆఫ్ చేయడం వంటి భద్రతా చర్యలు ఇన్‌స్టాగ్రామ్ తీసుకుంటుంది. అలాగే ఫేస్‌బుక్, మెసెంజర్‌లోని టీనేజర్ ఖాతాలు అనుచితమైన కంటెంట్, అవాంఛిత పరిచయాన్ని పరిమితం చేయడానికి ఇలాంటి ఆటోమేటిక్ రక్షణలను అందిస్తాయి. సెప్టెంబర్‌లో ఈ చర్యలు మొదటగా తీసుకోవడం ప్రారంభించారు. ఇప్పటివరకు కనీసం 54 మిలియన్ల టీనేజర్ల ఖాతాలకు రక్షణ చర్యలు తీసుకున్నామని మెటా పేర్కొంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








