AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భూమిని ఢీకొట్టేందుకు దూసుకొస్తున్న YR4 గ్రహశకలం! ఇండియాకి డేంజర్‌ అంటున్న సైంటిస్టులు!

ఓ గ్రహశకలం భూమిని 2032లో ఢీ కొనే అవకాశం ఉందని మూడు నెలల క్రితం నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని వల్ల సంభవించే ప్రమాద శాతం పెరుగుతూ, తగ్గుతూ వస్తోంది. అయితే ఒక వేళ అది నిజంగానే ఢీ కొడితే ఈ భూమిపై ప్రభావితం అయ్యే ప్రాంతాలు ఇవే అంటూ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఆ లిస్ట్‌లో ఇండియా కూడా ఉంది. మరి ఇండియాతో పాటు ఇంకెన్ని దేశాలు ఉన్నాయో చూద్దాం..

భూమిని ఢీకొట్టేందుకు దూసుకొస్తున్న YR4 గ్రహశకలం! ఇండియాకి డేంజర్‌ అంటున్న సైంటిస్టులు!
Yr4 Asteroid
SN Pasha
|

Updated on: Feb 18, 2025 | 1:42 PM

Share

భూమి వైపు ఓ గ్రహశకలం దూసుకొస్తుందనే విషయాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు 2024 డిసెంబర్‌లో గుర్తించారు. దానికి 2024 వైఆర్‌4 అని నామకరణం కూడా చేశారు. 2032లో ఇది భూమిని ఢీ కొనే అవకాశం ఉందని గుర్తించారు. మొదట అది భూమిని ఢీ కొనే అవకాశం కేవలం 1.2 శాతం మాత్రమే అని వెల్లడించారు. కానీ, ఒక్క వారంలోనే అది 2.3 శాతానికి పెరిగిందని నాసా పేర్కొంది. దీంతో ఒక్కసారిగా అందరిలో భయం మొదలైంది. సాధారణంగా అయితే భూమి చుట్టుపక్కల ఉన్న గ్రహశకలాలతో మనకు ఎంత ప్రమాదం ఉందనే విషయాన్ని టొరినో స్కేల్‌తో లెక్కిస్తారు. మొత్తం 10 పాయింట్లతో ఉండే ఈ టొరినో స్కేల్‌పై గ్రహశకలంతో ఉండే ప్రమాదాన్ని బట్టి దానికి పాయింట్లు ఇస్తారు. ఇప్పటి వరకు భూమి చుట్టు పక్కల ఉన్న అన్ని గ్రహశకలాలకు 0 పాయింట్లు ఇచ్చిన టొరినో స్కేల్‌, ఈ వైఆర్‌4కు మాత్రం ఏకంగా 3 పాయింట్లు ఇచ్చింది. ఇదే ఖగోళ శాస్త్రవేత్తలను ఆందోళనకు గురిచేస్తోంది.

500 అణుబాంబులతో సమానం..

నాసాతో పాటు ఈరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ కూడా అత్యంత శక్తివంతమైన వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌తో మార్చ్‌లో ఈ వైఆర్‌4 గ్రహశకలాన్ని మరింత క్లియర్‌గా పరిశీలించనున్నాయి. తర్వాత అది భూమిని ఢీ కొనే అవకాశం ఎంత ఉందనే దానిపై ఇంకాస్త సమాచారం రావొచ్చు. మొదట 1.2 శాతంగా, ఆ తర్వాత 2.3 శాతం.. ఇప్పుడు తాజా రిపోర్ట్‌ ప్రకారం వైఆర్‌4 భూమిని ఢీ కొనే అవకాశం 2.0 శాతానికి తగ్గింది. 98 శాతం అది భూమిని ఢీ కొనకుండా పక్క నుంచి వెళ్లిపోయే అవకాశం ఉంది. కానీ, ఆ రెండు శాతాన్ని కూడా శాస్త్రవేత్తలు లైట్‌ తీసుకోరు. ఎందుకంటే.. ఒక వేళ ఆ గ్రహశకలం భూమిని ఢీ కొనకపోయినా.. భూమి దగ్గరగా వెళ్తున్న క్రమంలో అది పేలిపోయినా భారీ విధ్వంసం తప్పదు. ఒక వేళ అలా జరిగితే ఎంత భారీ విస్పోటనం జరుగుతుందంటే.. ఓ 500 అణుబాంబులు ఒకే సారి పడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. హిరోషిమాపై జరిగిన అణుదాడి గురించి తెలుసుగా? అలాంటి దాడి భూమిపై 500 రెట్లు జరిగితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అందుకే ఈ వైఆర్‌4 ఖగోళ శాస్త్రవేత్తలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఇందులో మరో ప్రమాదం ఉంది. ఈ వైఆర్‌4 గ్రహశకలం కొన్ని రోజులకు కనిపించకుండా పోతుంది. అది తిరుగుతున్న కక్ష్య కారణంగా భూమిని నుంచి మరింత దూరంగా జరుగుతుంది. ఆ సమయంలో దాన్ని పరిశీలించడం సాధ్యం కాదు. మళ్లి అది 2028లో మనకు దగ్గరగా వచ్చినప్పుడు దాన్ని శాస్త్రవేత్తలు పరిశీలించగలరు. ఆలోపు దాని సైజ్‌, వేగం వంటి కీలక విషయాలపై సైంటిస్టులు వీలైనంత ఎక్కువ సమాచారం తెలుసుకోవాలి. అందుకే నాసా, ఈరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీలో మార్చ్‌లో ప్రక్రియ మొదలు పెట్టబోతున్నాయి.

ఇండియాతో సహా ఇవన్నీ పోతాయ్‌..

అయితే ఒక వేళ ఆ గ్రహశకలం నిజంగానే భూమిని ఢీ కొన్నా, ఒక వేళ భూమికి దగ్గరగా వచ్చిన పేలిపోయే.. గుండ్రంగా తిరుగుతున్న భూమికి ఏ వైపు అది జరుగుతుందో కూడా శాస్త్రవేత్తలు అంచనా వేశారు. దీన్ని రిస్క్‌ కారిడార అంటారు. ఆ గ్రహశకలం కారణంగా ప్రమాదం సంభవిస్తే, తీవ్రంగా నష్టపోయే దేశాల పేర్లు కూడా వెల్లడించారు. దురదృష్టం ఏంటంటే.. ఆ జాబితాలో ఇండియా పేరు కూడా ఉంది. నాసా సైంటిస్ట్‌ డేవిడ్‌ రాంకిన్‌తో పాటు మరికొంత మంది సైంటిస్టుల ప్రకారం ఉత్తర దక్షిణ అమెరికా, పసిఫిక్‌ మహాసముద్రం, దక్షిణ ఆసియా, అరేబియా సముద్రం, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలకు ఈ ప్రమాద తీవ్రత విస్తరించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇండియా, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఇథియోపియా, సుడాన్‌, నైజీరియా, వెనిజులా, కొలంబియా, ఈక్వెడార్‌ దేశాలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.