China Deep Sea Scientists: మహాసముద్రం లోతుల్లో వింత జీవాలు! సంచలన నిజాలు బయటపెట్టిన శాస్త్రవేత్తలు
చైనా శాస్త్రవేత్తలు మహాసముద్రంలోని హడల్ జోన్‌లో 6 కి.మీ లోతులో 7500 కొత్త సూక్ష్మజీవులను కనుగొన్నారు. 33 సార్లు లోతుకు వెళ్లి నమూనాలను సేకరించి పరిశోధన చేశారు. ఈ సూక్ష్మజీవులు తక్కువ వనరులతో మనుగడ సాగిస్తున్నాయి. వాటిలో కొన్ని చిన్న జన్యువులను కలిగి ఉండగా మరికొన్ని పెద్ద జన్యువులను కలిగి ఉంటాయి. ఈ ఆవిష్కరణ సముద్ర జీవవైవిధ్యం గురించి కొత్త అవగాహనను అందిస్తోంది.

మహాసముద్రాల్లో చాలా రకాల జీవులు ఉన్నాయనే విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు కనుగొనని మరికొన్ని వింత జీవులను చైనా శాస్త్రవేత్తలు కనిపెట్టారు. అత్యంత కఠినమైన సముద్రపు లోతుల్లోకి 33 సార్లు వెళ్లి కొత్త జీవుల్ని కనుగొన్నారు. ఈ పరిశోధనలు 2021 నుంచి జరుగుతున్నప్పటికీ.. వాటి ఫలితాలు ఇప్పుడు వెలువడ్డాయి. సముద్రంలో 6 కిలోమీటర్ల లోతులో వేరే ప్రపంచం ఉందని ఈ కొత్త ఆవిష్కరణ చెబుతోంది. శాస్త్రవేత్తలు ఇంతకు ముందు ఎన్నడూ చూడని వేలాది అదృశ్య సూక్ష్మజీవుల జాతులను కనుగొన్నారు. ఈ పరిశోధన పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలోని మరియానా ట్రెంచ్‌తో సహా సముద్రంలోని అత్యంత లోతైన భాగాలలో జరిగింది. సముద్రంలోని ఈ భాగాన్ని హడల్ జోన్ అంటారు.
హడాల్ జోన్ 6 కిలోమీటర్లు (3.7 మైళ్ళు) నుండి ప్రారంభమై 11 కిలోమీటర్లు (6.8 మైళ్ళు) వరకు విస్తరించి ఉంటుంది. అది ఎంత లోతంటే.. 30 ఎంపైర్ స్టేట్ భవనాలు లేదా ఒకటిన్నర మౌంట్ ఎవరెస్ట్‌ల అంత ఎత్తు. సముద్రంలో ఇంత లోతులో జీవించడం చాలా కష్టం. ఉష్ణోగ్రత గడ్డకట్టే స్థాయికి దగ్గరగా ఉంటుంది. నీటి పీడనం విపరీతమైన స్థాయిలో ఉంటుంది. తినడానికి చాలా తక్కువ పోషకాలు ఉంటాయి. అయినా కూడా ఆ లోతులో దాదాపు 7500 రకాల ప్రత్యేక సూక్ష్మజీవులు ఉన్నట్లు కనుగొన్నారు. వాటిలో 90 శాతం పూర్తిగా కొత్తవని చెబుతున్నారు. చైనా శాస్త్రవేత్తలు ఈ లోతుకు 33 సార్లు డైవ్ చేశారు. ఈ పరిశోధనల కోసం మానవ సహిత జలాంతర్గామి(సబ్ మెరైన్)ని ఉపయోగించారు. వారు అక్కడి నుండి అవక్షేపం, సముద్రపు నీటి నమూనాలను సేకరించారు. ఈ నమూనాలను తరువాత నిశితంగా పరిశీలించి, విశ్లేషించారు.
ఆ పరిశోధన ఫలితాలు ప్రస్తుతం షాక్‌కు గురిచేస్తున్నాయి. ఈ సూక్ష్మజీవులకు రెండు ప్రధాన మనుగడ వ్యూహాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇటువంటి సూక్ష్మజీవులు చిన్న జన్యువులను కలిగి ఉంటాయి. చాలా తక్కువ వనరులు ఉన్నప్పటికీ అవి మనుగడ సాగించగలవు. సముద్రపు తీవ్రమైన పీడనం, చలిని తట్టుకోవడానికి సహాయపడే ఎంజైమ్‌లు వాటిలో ఉన్నాయి. కొన్ని సూక్ష్మజీవులు పెద్ద జన్యువులను కలిగి ఉంటాయి. అవి వివిధ రకాల వాతావరణాలలో జీవించగలవు, వివిధ రకాల పోషకాలను ఉపయోగించుకోగలవు. ఈ ఆవిష్కరణలో వెలుగులోకి వచ్చిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, వివిధ సమూహాలకు చెందిన సూక్ష్మజీవులు సముద్రపు లోతుల్లో ప్రతిచోటా నివసిస్తాయి. అవి చిన్న ప్రదేశాలలో స్థిరపడి అక్కడి పరిస్థితులకు అనుగుణంగా మారతాయి. లోతు పెరిగేకొద్దీ, సూక్ష్మజీవులు ఒకదానికొకటి సహాయం చేసుకుంటాయి. అవి తమను తాము రక్షించుకోవడానికి బయోఫిల్మ్‌లను ఏర్పరుస్తాయని కూడా చెబుతారు.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి