Chandrayaan-3: భూమికి కన్పించని చందమామ అవతలి వైపు ఫొటోలు షేర్ చేసిన ఇస్రో

జాబిల్లి అంటే ఎప్పటికీ మనిషిని ఊరించే ఒక రహస్యమే.! అక్కడేముంది..? ఆ చల్లని గోళం కడుపులో దాగిన వింత విశేషాల ఏంటి..? ఇలాంటి అంతు చిక్కని ప్రశ్నల జవాబు కోసం.. మనిషి సాగించే అన్వేషణ అనంతం.! చంద్రుడు మనిషికి చిక్కితే.. ఇక అక్కడ నుంచి మనిషి అంతరిక్ష ప్రయాణానికి.. పరిశోధనలకు తలుపులు తెరుచుకుంటాయి. అందుకే.. శతాబ్ధాలుగా మానవుడు జాబిల్లిలో.. ఏముందో తెలుసుకోవాలని ఆరాటపడుతున్నాడు. చందమామపై మనమూ అడుగుపెట్టాలనేది భారతీయులందరి ఆశ.

Chandrayaan-3: భూమికి కన్పించని చందమామ అవతలి వైపు ఫొటోలు షేర్ చేసిన ఇస్రో
Indian Space Research Organisation (ISRO) on Monday shared images of the moon from the far side area captured on August 19
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 21, 2023 | 12:05 PM

జాబిల్లిపై చంద్రయాన్‌-3 కాలుమోపే చారిత్రక ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 23న సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడిపై అడుగుపెట్టనుంది.దీంతో చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌కు అనువైన ప్రదేశం కోసం విక్రమ్‌ ల్యాండర్‌ అన్వేషిస్తోంది. ఈ క్రమంలో భూమికి  కనిపించని జాబిల్లి దక్షిణ ధ్రువం ఉండే ప్రాంతానికి సంబంధించిన కొన్ని ఫోటోలను ల్యాండర్‌ తన కెమెరాలో బంధించింది. చంద్రునిపై ల్యాండర్ సేఫ్‌గా ల్యాండ్ అయ్యేందుకు..  గుంతలు, బండరాళ్లు లేని ప్రదేశాన్ని గుర్తించేందుకు సైంటిస్టులకు ఈ కెమెరా ఉపయోగపడుతుంది. ఆగస్టు 19న ల్యాండర్‌ ఈ ఫోటోలను తీసినట్లు ఇస్రో తెలిపింది. తాజా ఫోటోల్లో చందమామ ఉపరితలంపై అనేక బిలాలు క్లియర్‌గా కన్పిస్తున్నాయి. వాటి పేర్లను ఇస్రో ఫోటోల్లో పేర్కొంది.

ఆ చిత్రాలను దిగువన చూడండి

ప్రయోగంలో కీలకమైన రెండో డీబూస్టింగ్‌ ప్రక్రియ సైతం విజయవంతమైంది. ఆదివారం ల్యాండర్‌ వేగాన్ని తగ్గించే విన్యాసాన్ని ఇస్రో చేపట్టింది. ఈ ప్రక్రియ అనంతరం ల్యాండర్‌ జాబిల్లికి మరింత చేరువైంది. ప్రస్తుతం ల్యాండర్‌ మాడ్యూల్‌ 25 x 134 కిలోమీటర్ల కక్ష్యలో పరిభ్రమిస్తున్నది. ఇదే కక్ష్య నుంచి ఈ నెల 23 సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేపట్టనుంది. ఈ ప్రయోగం సక్సెస్ అయితే.. జాబిల్లిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేసిన సోవియట్‌ యూనియన్‌, అమెరికా, చైనా లిస్ట్‌లో ఇండియా కూడా చేరిపోతుంది. చంద్రునిపైకి ఎవరూ వెళ్లని రూట్‌లో దక్షిణ ధ్రువంపై ఎంట్రీ ఇచ్చేందుకు చంద్రయాన్​-3ని జులై 14న ఎల్‌వీఎం3-ఎం4 రాకెట్‌ ద్వారా శ్రీహరికోట నుంచి ఇస్రో ప్రయోగించిన విషయం తెలిసిందే. ఆగస్టు 5న చంద్రుడి కక్ష్యలోకి దీన్ని విజయవంతంగా చేర్చారు. కక్ష్యలను తగ్గిస్తూ చంద్రునికి చేరువగా తీసుకెళ్లారు.

మరోవైపు చంద్రయాన్‌-3కి పోటీగా రష్యా ప్రయోగించిన లూనా-25 ప్రయోగం విఫలమవడంతో ఇప్పుడు అందరి కళ్లూ చంద్రయాన్‌-3పైనే ఉన్నాయి. చారిత్రక ఘట్టం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కాగా ఇస్రో వెబ్‌సైట్‌, య్యూట్యూబ్‌ చానల్‌, ఫేస్‌బుక్‌ పేజీ, డీడీ నేషనల్‌ చానల్‌లో 23వ తేదీ సాయంత్రం 5.27 గంటల నుంచి జాబిల్లిపై ల్యాండర్‌ కాలు మోపే లైవ్‌ ఈ దృశ్యాలను వీక్షించవచ్చు. విద్యా సంస్థల్లో లైవ్‌స్ట్రీమింగ్‌ నిర్వహించాలని ఇస్రో పిలుపునిచ్చింది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..