Itel A90: అతి తక్కువ ధరకే బెస్ట్ స్మార్ట్ ఫోన్.. ప్రత్యేకతలు..ధర వివరాలు ఇవే..!
మన దేశ మార్కెట్ లో స్మార్ట్ ఫోన్ల విక్రయాలు టాప్ స్పీడ్ లో దూసుకుపోతున్నాయి. ఆధునిక జీవనంలో ఫోన్ తప్పనిసరి అవసరంగా మారడంతో ప్రతి ఒక్కరూ కొనుగోలు చేస్తున్నారు. దీంతో వివిధ కంపెనీలు రోజుకో కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేస్తున్నాయి. ఫీచర్లు, ప్రత్యేకతలు, డిజైన్, నాణ్యత, బ్యాటరీ విషయంలో ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. అయితే అన్ని ఫీచర్లతో కూడిన ఫోన్ కొనాలంటే సుమారు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకూ ఖర్చు చేయాలి. మన దేశంలో ఎక్కువ శాతం ఉండే పేద, సామాన్యులకు ఇది భారంగా మారుతుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ తయారీ సంస్థ ఐటెల్ రూ.6,499కే లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ అందజేస్తోంది. ఆ వివరాలు, ప్రత్యేకతలు తెలుసుకుందాం.

దేశ మార్కెట్ లో తన వాటాను విస్తరించుకునేందుకు ఐటెల్ కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది. దానిలో భాగంగా తక్కువ ధరకే ఫోన్లను అందజేస్తోంది. తన లైనప్ ను విస్తరించడంతో పాటు సామాన్యులకు చేరువయ్యేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఐటెల్ ఏ90 పేరుతో సరికొత్త స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. ఐటెల్ 80కి వారసుడిగా దీన్ని మార్కెట్ లోకి తీసుకువచ్చింది. ఎక్కువ సమయం వచ్చే బ్యాటరీ, అంతరాయం లేని పనితీరు, మెరుగైన నాణ్యత దీని ప్రత్యేకతలు. మన దేశంలోని అన్ని రిటైల్ దుకాణాల్లో ఈ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు.
ఐటెల్ ఏ90 స్మార్ట్ ఫోన్ లో 6.6 అంగుళాల హెచ్ డీ ప్లస్ ఐపీఎస్ డిస్ ప్లే ఏర్పాటు చేశారు. దీనిలోని 90 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేటుతో విజువల్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆక్టా కోర్ టీ 7100 ప్రాసెసర్ తో పనితీరు బ్రహ్మాండంగా ఉంటుంది. కెమెరాల విషయానికి వస్తే 13 ఎంపీ ప్రధాన కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ షూటర్ ఏర్పాటు చేశారు. ఐపీ 54 రేటింగ్ కారణంగా దుమ్ము, దూళి, నీరు నుంచి అన్ని విధాలా రక్షణ లభిస్తుంది.
రెండు రకాల వేరియంట్లలో ఐటెల్ ఏ90 ఫోన్ అందుబాటులోకి వచ్చింది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ కలిగిన బేస్ మోడల్ ధర రూ.6,499 మాత్రమే. అలాగే 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేేజ్ వేరియంట్ ను రూ.6,999కి కొనుగోలు చేయవచ్చు. స్టార్ లిట్ బ్లాక్, స్పేస్ టైటానియం అనే ఆకర్షణీయమైన రంగుల్లో తీసుకువచ్చారు. ఈ ఫోన్ పై వంద రోజుల్లోపు ఉచిత స్క్రీన్ రీప్లేస్ మెంట్ ఆఫర్ ను కూడా కంపెనీ అందజేస్తుంది.
ఐటెల్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 గో ఎడిషన్ ఆధారిత ఐటెల్ ఓఎస్ 14తో నడుస్తుంది. అలాగే 8 జీబీ వరకూ విస్తరించదగిన వర్చువల్ ర్యామ్ బాగుంది. ఈ ఫోన్ లో 10 డబ్ల్యూ చార్జింగ్ సపోర్టుతో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. దీంతో తరచూ చార్జింగ్ అయిపోతుందనే ఇబ్బంది ఉండదు. ఫేస్ అన్ లాక్ ఫీచర్, సైడ్ మౌంటెంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, పైన డైనమిక్ బార్ నాచ్, కుడివైపున స్లైడింగ్ జూమ్ బటన్, డీటీఎస్ సౌండ్ టెక్నాలజీ, ఐవానా 2.0 ఏఐ అసిస్టెంట్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








