AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Digital Arrest Scam: పోలీసులమంటూ ఫోన్లు.. రూ. లక్షల్లో స్వాహా.. కొత్త రకం స్కాం.. బీ అలర్ట్!

గతంలో సైబర్ నేరగాళ్లు బ్యాంకు అధికారులమంటూ కాల్స్ చేసేవారు. మన ఖాతా నంబర్లు, ఇతర వివరాలను అడిగి సొమ్ములు లాగేసేవారు. ఇప్పుడు పార్సిల్ స్కాం, డిజిటల్ అరెస్టు అనే కొత్త విధానాలకు తెరతీశారు. సీబీఐ అధికారులమంటూ బాధితులను నమ్మించి, కేసుల పేరుతో భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. వీరి బారిన పడి ఇటీవల నోయిడాకు చెందిన వ్యాపారవేత్త నుంచి రూ.5 లక్షలు పొగొట్టుకున్నాడు.

Digital Arrest Scam: పోలీసులమంటూ ఫోన్లు.. రూ. లక్షల్లో స్వాహా.. కొత్త రకం స్కాం.. బీ అలర్ట్!
Scam
Madhu
| Edited By: TV9 Telugu|

Updated on: Jun 21, 2024 | 4:17 PM

Share

ఆన్‌లైన్ మోసాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. ప్రజల భయాన్ని, అవగాహనా లేమిని అనుకూలంగా చేసుకుని స్కామర్లు అనేక మోసాలకు పాల్పడుతున్నారు. ప్రజల నుంచి లక్షల రూపాయలు గుంజుతున్నారు. విద్యావంతులు, వ్యాపారస్తులు కూడా వీరి వలలో చిక్కుకుని భారీగా డబ్బులు పొగొట్టుకుంటున్నారు.

కేసుల పేరుతో భయపెట్టి..

గతంలో సైబర్ నేరగాళ్లు బ్యాంకు అధికారులమంటూ కాల్స్ చేసేవారు. మన ఖాతా నంబర్లు, ఇతర వివరాలను అడిగి సొమ్ములు లాగేసేవారు. ఇప్పుడు పార్సిల్ స్కాం, డిజిటల్ అరెస్టు అనే కొత్త విధానాలకు తెరతీశారు. సీబీఐ అధికారులమంటూ బాధితులను నమ్మించి, కేసుల పేరుతో భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. వీరి బారిన పడి ఇటీవల నోయిడాకు చెందిన వ్యాపారవేత్త నుంచి రూ.5 లక్షలు పొగొట్టుకున్నాడు.

నోయిడాలో ఘటన..

నోయిడా లోని సెక్టార్ 62లో నవీన్ కుమార్ ఆనంద్ అనే వ్యాపారవేత్త ఉంటున్నారు. ఆయనకు జూన్ 5వ తేదీ మధ్యాహ్నం కాల్ వచ్చింది. ముంబై క్రైం బ్రాంచ్ కు చెందిన అధికారినంటూ అవతల వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. డ్రగ్స్ కేసులో మీ పేరు ఉందంటూ ఆనంద్ తో చెప్పాడు. అలాగే మనీలాండరింగ్ కు సంబంధించిన అభియోగాలు కూడా ఉన్నాయని వెల్లడించారు. ఆ కేసులకు సంబంధించి విచారణలో భాగంగా డిజిటల్ అరెస్టు చేస్తున్నట్టు చెప్పాడు. డిజిటల్ అరెస్టు అంటే విచారణ ముగేసే వరకూ బాధితుడు వీడియో కాల్ నుంచి బయటకు వెళ్లకూడదు.

బెదిరింపులు..

విచారణకు పూర్తిగా సహకరించాలని, లేకుంటే అరెస్టు వారెంట్ జారీ చేస్తానని ఫోన్ లో అవతలి వ్యక్తి బెదిరించాడు. సీబీఐ అధికారినని చెప్పడంతో ఆనంద్ అతడికి పూర్తిగా సహకరించాడు. నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి, బ్యాంకు ఖాతాలు స్తంభించకుండా ఉండాలంటే నిర్థిష్ట బ్యాంకు ఖాతాకు రూ.5 లక్షలు బదిలీ చేయాలని ఆ వ్యక్తి కోరాడు. విచారణ తర్వాత డబ్బు తిరిగి వచ్చేస్తుందని చెప్పాడు. అది నిజమని నమ్మిన ఆనంద్ అలాగే చేశాడు.

పోలీసులకు ఫిర్యాదు..

విచారణ అనంతరం సొమ్ము తిరిగి వచ్చేస్తుందని ఆనంద్ కు చెప్పి కాల్ కట్ చేశాడు. అయితే వారం రోజులు దాటినా సొమ్ము తిరిగి రాకపోవడంతో తాను మోసపోయినట్టు ఆనంద్ భావించాడు. దీంతో పోలీసులను ఫిర్యాదు చేశాడు.

అప్రమత్తత అవసరం..

చదువుకోని వారు, సమాజంపై అవగాహన లేనివారు ఇలాంటి మోసాల బారిన పడడం సహజం. కానీ ఆనంద్ లాంటి వ్యాపార వేత్త కూడా మోసపోయాడంటే స్కామర్లు ఎంత తెలివిగా బోల్తా కొట్టిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్లు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి విషయాలలో ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ ఘటన తెలియజేస్తోంది.

జాగ్రత్తలు పాటించాలి..

  • ఇలాంటి మోసగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
  • ఎవరైనా ఫోన్‌ చేసి వ్యక్తిగత వివరాలు, ఆర్థిక సమాచారం అడిగితే చెప్పకూడదు.
  • ప్రభుత్వ అధికారులమంటూ ఎవరైనా కాల్ చేసి డబ్బు డిమాండ్ చేస్తే, వెంటనే కాల్‌ను కట్ చేయండి.
  • మీకు వచ్చిన కాల్ నంబర్ ను పోలీసులకు తెలియజేయండి. సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ వెబ్‌సైట్‌లకు కూడా ఈ విషయంపై ఫిర్యాదు చేయండి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..