Team India : టీమిండియాలో పాకిస్తాన్ తరహా సంస్కృతి.. కెప్టెన్, కోచ్‌లకు నచ్చితేనే జట్టులో చోటా?
Team India : ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనల్లో వరుస ఓటము లతో టీమిండియా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. జట్టు ఎంపిక, మేనేజ్‌మెంట్ నిర్ణయాలు, ఆటగాళ్ల ఎంపికలో పక్షపాతం ఉందన్న ఆరోపణలు చర్చనీయాంశమవగా, భారత టీ20 జట్టు భవిష్యత్తుపై అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Team India : వరుసగా రెండు ప్రపంచకప్‌లు గెలిచి ప్రపంచ క్రికెట్‌ను శాసించిన భారత జట్టు.. ఇప్పుడు ఒకే ఒక్క విజయం కోసం ఇంతలా తల్లడిల్లుతుందని ఎవరూ ఊహించలేదు. టీమిండియా ప్రస్తుత ప్రదర్శనపై దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రిటన్ పర్యటనలో భాగంగా భారత జట్టు మొత్తం ఏడు టీ20 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, మిగిలిన ఆరు మ్యాచ్‌ల్లోనూ భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. భారత క్రికెట్ చరిత్రలోనే వరుసగా ఆరు టీ20 మ్యాచ్‌ల్లో ఓడిపోవడం ఇదే తొలిసారి. ఇంతటి ఘోర అవమానకరమైన ఓటములకు అసలు బాధ్యులు ఎవరు? మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయాలే జట్టును ముంచాయా? అనే ప్రశ్నలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం టీమిండియాలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, భారత క్రికెట్ కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దారిలోనే నడుస్తోందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్ జట్టులో సాధారణంగా కెప్టెన్, కోచ్‌లకు నచ్చిన వారికి, వారి స్నేహితులకే జట్టులో చోటు కల్పిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. అక్కడ దేశవాళీ క్రికెట్‌లో ఎంత బాగా రాణించినా సరే, కెప్టెన్ అనుగ్రహం లేకపోతే జట్టులోకి రాలేరు. దురదృష్టవశాత్తూ ఇప్పుడు టీమిండియాలోనూ ఇదే తరహా సంస్కృతి కనిపిస్తోందని విమర్శకులు మండిపడుతున్నారు. వరుసగా విఫలమవుతున్నప్పటికీ వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ వంటి ఆటగాళ్లను జట్టులోనే ఎందుకు కొనసాగిస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు.
గంభీర్, శ్రేయస్ అయ్యర్ దోస్తీ వల్లే జట్టు సర్వనాశనమా?
టీ20 జట్టు ఎంపికలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ముఖ్యంగా సూర్యాంశ్ శెడ్గేను ఏ ప్రాతిపదికన జాతీయ జట్టులోకి తీసుకున్నారనే దానికి సమాధానం లేదు. సూర్యాంశ్ శెడ్గేకు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వీరిద్దరిదీ ఒకే డొమెస్టిక్ టీమ్ కావడమే కాకుండా, ఐపీఎల్‌లోనూ పంజాబ్ కింగ్స్ తరఫున కలిసి ఆడతారు. 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో ప్రతిభావంతులకు కొదవ లేనప్పుడు, కేవలం కెప్టెన్‌కు సన్నిహితుడైనందుకే జాతీయ జట్టులో స్థానం కల్పించాలా? అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. దీనికి తోడు, ఐపీఎల్‌లో గాయం కారణంగా పూర్తిగా దూరమైన హర్షిత్ రాణాను, కనీసం డొమెస్టిక్ క్రికెట్ కూడా ఆడించకుండా నేరుగా టీమిండియాలోకి ఎలా తీసుకువచ్చారు? వరుణ్ చక్రవర్తి విషయంలోనూ ఇదే ప్రశ్న తలెత్తుతోంది.
క్లబ్ టీమ్‌లా మారిన భారత్
ఇంగ్లాండ్ లాంటి బలమైన జట్టును వారి సొంత గడ్డపై ఎదుర్కొనేటప్పుడు అనుభవజ్ఞులైన ఆటగాళ్లు అవసరమనే కనీస ఆలోచన మేనేజ్‌మెంట్‌కు లేకపోయింది. జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో లేనప్పుడు మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్ లేదా మహ్మద్ షమీ వంటి సీనియర్ బౌలర్లను ఎందుకు ఎంపిక చేయలేదు? స్పిన్ విభాగంలోనూ ఇంగ్లాండ్ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న కుల్దీప్ యాదవ్‌ను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఫలితంగా ఇంగ్లాండ్, ఐర్లాండ్ సిరీస్‌లలో భారత జట్టు అంతర్జాతీయ స్థాయి జట్టులా కాకుండా ఏదో ఒక సాధారణ లోకల్ క్లబ్ టీమ్‌లా కనిపించింది. మైదానంలో ఆటగాళ్ల ఫీల్డింగ్ అత్యంత దారుణంగా సాగింది. సులువైన క్యాచ్‌లను వదిలేశారు, సింగిల్స్ వెళ్లే చోట బౌండరీలు సమర్పించుకున్నారు.
వరల్డ్ కప్ హీరో సంజూ శాంసన్‌పై వేటు
తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ఒంటిచేత్తో భారతదేశానికి ప్రపంచకప్ అందించి పెట్టిన సంజూ శాంసన్‌ను ఈ పర్యటనలో జట్టు నుంచి ఎందుకు తప్పించారనేది మిస్టరీగా మారింది. సోషల్ మీడియాలో వచ్చే ఒత్తిడికి లొంగిపోయి జాతీయ జట్టు ఎంపికలను మారుస్తున్నారా? అనే సందేహాలు వస్తున్నాయి. అంతేకాకుండా, మ్యాచ్ మ్యాచ్‌కూ బ్యాటింగ్ ఆర్డర్‌ను విపరీతంగా మార్చడం వల్ల బ్యాటర్లలో ఆత్మవిశ్వాసం దెబ్బతింది. భారత బ్యాటర్లు కేవలం ఫ్లాట్ పిచ్‌లపై (బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌లు) మాత్రమే ఆడగలరని, పిచ్ కాస్త టర్న్ అయినా లేదా పేసర్లకు బౌన్స్ లభించినా చేతులెత్తేస్తారని మరోసారి రుజువైంది. ఇప్పటికైనా సెలెక్టర్లు, మేనేజ్‌మెంట్ తమ తప్పులను తెలుసుకుని జట్టును ప్రక్షాళన చేయకపోతే భారత క్రికెట్ తీవ్ర సంక్షోభంలో పడటం ఖాయం.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
