Smriti Mandhana: స్మృతి మంధాన పెళ్లి క్యాన్సిల్.. సోషల్ మీడియాలో స్టార్ క్రికెటర్ ఎమోషనల్ పోస్ట్
భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన తన పెళ్లి రద్దు చేసుకున్నారు. వ్యక్తిగత జీవితంపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ, ఆమె తన పూర్తి దృష్టిని దేశం తరపున ఆడి ట్రోఫీలు గెలవడంపైనే పెడతానని ప్రకటించారు. అటు పలాష్ ముచ్చల్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ, నిరాధారమైన వదంతులను ఖండించారు. అభిమానులు ఆమె నిర్ణయానికి మద్దతునిస్తున్నారు.

భారత మహిళా క్రికెట్ స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన పెళ్లి రద్దు అయ్యింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. గత కొన్ని వారాలుగా తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో మంధాన సోషల్ మీడియా వేదికగా స్పందించింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సుదీర్ఘ పోస్ట్‌ను షేర్ చేస్తూ, ఈ అంశంపై పూర్తి స్పష్టత ఇచ్చారు.
స్మృతి మాటల్లో..
‘‘కొన్ని వారాలుగా నా జీవితంపై ఎన్నో ఊహాగానాలు వస్తున్నాయి. ఈ సమయంలో మాట్లాడటం, స్పష్టత ఇవ్వడం చాలా ముఖ్యమని నాకు అనిపించింది. నేను నా జీవితం ప్రైవేట్‌గా ఉండాలని కోరుకునే వ్యక్తిని. అయితే నా పెళ్లి రద్దు అయిందని స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉందనిపించింది. నేను ఈ పెళ్లి అంశాన్ని ఇక్కడితో ముగించాలని అనుకుంటున్నాను. దయచేసి మా ఇద్దరి కుటుంబాల ప్రైవసీని గౌరవించాలని కోరుతున్నాను. నా దేశానికి అత్యున్నత స్థాయిలో ప్రాతినిథ్యం వహిస్తున్నాను. సాధ్యమైనంతవరకు దేశం తరపున ఆడి ట్రోఫీలు గెలవాలని కోరుకుంటాను. నా ఫోకస్ అంతా ఇక దానిపైనే ఉండబోతోంది’’ అని స్మృతి స్పష్టం చేశారు.
పలాష్ రియాక్షన్

స్మృతి మంధాన తన పెళ్లి రద్దయినట్టు ప్రకటించిన కొద్దిసేపటికే.. ఆమె మాజీ భాగస్వామి పలాష్ ముచ్చల్ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ వ్యక్తిగత బంధం నుంచి బయటకు రావడంపై వస్తున్న ఊహాగానాలకు, తప్పుడు ప్రచారాలకు ముచ్చల్ ఘాటుగా సమాధానమిచ్చారు. వ్యక్తిగత బంధం నుంచి బయటకొచ్చి, నా జీవితంలో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నా. ఇది నా జీవితంలో చాలా కష్టమైన దశ. నిరాధారమైన ఊహాగానాలపై జనం స్పందిస్తుంటే భయమేస్తోంది. కేవలం వదంతుల ఆధారంగా నిర్ణయానికి రావడాన్ని ఒక సమాజంగా మనం ఆపేయాలని కోరుతున్నా. ఇలాంటి మాటలు మాయని గాయాలు అవుతాయి. అంతేగాదు, వీటివల్ల తీవ్ర పర్యవసానాలను ఎదుర్కొంటాం. తప్పుడు, దురుద్దేశపూరిత ప్రచారాలు చేసేవారిపై నా టీమ్ న్యాయపరమైన చర్యలు తీసుకుంటుంది’’ అని పలాశ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
మంధాన ప్రకటనపై క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. వ్యక్తిగత నిర్ణయాన్ని గౌరవిస్తూనే, ఆమె మానసిక స్థైర్యాన్ని, క్రీడపై ఆమెకున్న అంకితభావాన్ని తోటి క్రీడాకారులు, అభిమానులు అభినందిస్తున్నారు. 29 ఏళ్ల మంధాన.. ప్రస్తుతం బ్యాటింగ్‌లో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నారు. రాబోయే టోర్నమెంట్ల కోసం ఆమె తన దృష్టిని పూర్తిగా క్రికెట్‌పై పెట్టాలని నిర్ణయించుకోవడం అభిమానులకు కొంత ఊరటనిచ్చింది.




