కోల్‌కతాపై మ్యాచ్‌లో మ్యాజిక్‌ చేసిన సిరాజ్‌!

మహ్మద్‌ సిరాజ్‌... ఎంతగా కుమిలిపోయి ఉంటాడో.. ఎంతగా ఆవేదన చెంది ఉంటాడో.. కారణం నిన్న కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌ ముందు ఐపీఎల్‌లో అతగాడి రికార్డులేమీ గొప్పగా లేవు.. పైగా ఈ సీజన్‌లో ఆడింది కూడా మూడంటే మూడు మ్యాచ్‌లే...

కోల్‌కతాపై మ్యాచ్‌లో మ్యాజిక్‌ చేసిన సిరాజ్‌!
సిరాజ్
Follow us

|

Updated on: Oct 22, 2020 | 9:14 AM

జిందగి కి యహీ రీత్‌హై హార్‌కే బాద్‌ హీ జీత్‌ హై! థోడి ఆసూ హై, థోడి హసీ ఆజ్‌ గమ్‌ హై తో కల్‌ హై ఖుషీ

మహ్మద్‌ సిరాజ్‌… ఎంతగా కుమిలిపోయి ఉంటాడో.. ఎంతగా ఆవేదన చెంది ఉంటాడో.. కారణం నిన్న కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌ ముందు ఐపీఎల్‌లో అతగాడి రికార్డులేమీ గొప్పగా లేవు.. పైగా ఈ సీజన్‌లో ఆడింది కూడా మూడంటే మూడు మ్యాచ్‌లే… వందకు పైగా ఓవర్లు వేసిన 92 మంది బౌలర్లలో అందరికంటే ఎక్కువ 9.29 ఎకానమీతో చెత్త బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.. సిరాజ్‌ను జట్టులో ఎందుకు తీసుకున్నట్టు? అంటూ సోషల్‌ మీడియాలో వెక్కిరింతలు..వేళాకోళాలు…! అసలు సిరాజ్‌ అనే బౌలర్‌ ఉన్నాడన్న సంగతి చాలా మందికి తెలియదు కూడా! అలాగని సిరాజ్‌ నిరుత్సాహపడలేదు.. నీరసపడలేదు.. అతడిలో నిర్లిప్తత ఆవరించలేదు.. ఓ మంచి రోజు కోసం… తనదైన రోజు కోసం ఎదురుచూశాడు.. నిన్నటి రోజు అతడిలో కొత్త ఉత్సాహం తెచ్చింది.. కొత్త జీవితాన్ని ప్రసాదించింది.. ఓటమి వెనుక వచ్చిన గెలుపు అది! కన్నీళ్లను తుడిచేసి ఆనందాన్ని పంచిన రోజది! కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో మహ్మద్‌ సిరాజ్‌ వేసిన స్పెల్‌ ఐపీఎల్‌ టోర్నీ ఉన్నన్నాళ్లు గుర్తుండిపోతుంది.. మామూలు బౌలింగ్‌ కాదది! వరుసగా రెండు మెయిడిన్లు వేయడమన్నది ఐపీఎల్‌లో ఓ రికార్డు అయితే ఆ రెండు ఓవర్లలో మూడు వికెట్లు తీసుకోవడమన్నది అద్భుతం.. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు సునాయాస విజయాన్ని అందుకున్నదంటే అది సిరాజ్‌ వల్లే!

మహ్మద్‌ సిరాజ్‌ మన హైదరాబాదీనే! 2017లో సిరాజ్‌ ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చాడు.. ఆ సీజన్‌ ఐపీఎల్‌ వేలంలో సిరాజ్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్ టీమ్‌ 2.6 కోట్ల రూపాయలు ఇచ్చి కొనుక్కోవడంతో సిరాజ్‌పై అందరి దృష్టి పడింది.. అసలు ఎవరీ సిరాజ్‌ అనే క్యూరియాసిటీ కూడా పెరిగింది.. పేద కుటుంబంలో పుట్టిన సిరాజ్‌ తండ్రి రిక్షా కార్మికుడు.. అయినా సిరాజ్‌ను గొప్పవాడిని చేయాలన్న సంకల్పం ఆయనది! సిరాజ్‌ కూడా ఎంతో కష్టపడ్డాడు.. జూనియర్‌ క్రికెట్‌లో సత్తా చాటిన సిరాజ్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్‌ సాదరంగా ఆహ్వానం పలికింది.. మొదటి సీజన్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడిన సిరాజ్‌ 21.6 సగటుతో పది వికెట్లు తీసుకుని ఫర్వాలేదనిపించాడు.. ఈ ప్రదర్శనతోనే ఆ తర్వాత టీమిండియాలో కూడా చోట సంపాదించుకున్నాడు.. 2018 ఐపీఎల్‌ సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు టీమ్‌ సిరాజ్‌ను సొంతం చేసుకుంది.. బెంగళూరుకు ఆడిన రెండు సీజన్‌లలోనూ సిరాజ్‌ పెద్దగా రాణించలేకపోయాడు.. ఆడిన 20 మ్యాచ్‌లలో 18 వికెట్లే తీయగలిగాడు.. పరుగులు కూడా ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చాడు.. దాంతో సిరాజ్‌ను అందరూ మర్చిపోయాడు.. కానీ సిరాజ్‌ మాత్రం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు.. తాను ఎవరికీ తీసిపోనన్న విషయం సిరాజ్‌కు తెలుసు.. సిరాజ్‌లో టాలెంట్‌ ఉందన్న సంగతి కోహ్లీకి కూడా తెలుసు.. అందుకే షాబాజ్‌ స్థానంలో సిరాజ్‌ను తీసుకున్నాడు కోహ్లీ.. కోహ్లీ నిర్ణయంపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు.. కొందరు నొసలు చిట్లించుకున్నారు.. కొందరు ముక్కున వేలేసుకున్నారు.. మోరిస్‌తో కలిసి కొత్త బంతిని పంచుకునే అవకాశం లభించడంతో సిరాజ్‌ రెచ్చిపోయాడు.. నిప్పులు చెరిగే బంతులతో కోల్‌కతా ఆటగాళ్లను ముప్పు తిప్పలు పెట్టాడు.. బెంబేలెత్తించాడు.. వేగంతో బంతులు వేస్తూ బెదరగొట్టాడు.. మొత్తంగా నాలుగు ఓవర్లలో రెండు మెయిడిన్లతో ఎనిమిది పరుగులిచ్చి మూడు వికెట్లు తీసుకుని మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును అందుకున్నాడు.. కీపిటప్‌ సిరాజ్‌…!