Rohit Sharma : సచిన్, ధోనీ, కోహ్లీల వల్ల కాలేదు.. అఫ్గాన్ వన్డేతో చరిత్ర సృష్టించనున్న రోహిత్ శర్మ
Rohit Sharma : అఫ్గానిస్తాన్ తో జరిగే తొలి వన్డే మ్యాచ్‌లో బరిలోకి దిగడం ద్వారా టీమిండియా తరఫున వన్డే ఆడిన అత్యంత వృద్ధ ఆటగాడి గా రోహిత్ శర్మ 37 ఏళ్ల నాటి మొహిందర్ అమర్‌నాథ్ రికార్డును బద్దలు కొట్టనున్నాడు.

Rohit Sharma : భారత్, అఫ్గానిస్తాన్ మధ్య ధర్మశాల వేదికగా ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఒక అరుదైన హిస్టారికల్ రికార్డును తన పేరిట లిఖించుకోవడానికి సిద్ధమయ్యాడు. ఐపీఎల్ ముగిసిన తర్వాత హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో ఇబ్బంది పడ్డ రోహిత్ శర్మ.. తాజాగా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఫిట్‌నెస్ టెస్ట్ పాస్ అయి జట్టుతో చేరాడు. శనివారం జరిగే మొదటి వన్డే మ్యాచ్ లో రోహిత్ శర్మ ప్లేయింగ్ 11లో భాగం కాగానే భారత క్రికెట్ చరిత్రలో గత 37 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న ఒక దిగ్గజ రికార్డు బద్దలు కానుంది.
టీమిండియా తరఫున వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన అత్యంత వృద్ధ ఆటగాడి రికార్డు ప్రస్తుతం భారత మాజీ దిగ్గజం మొహిందర్ అమర్‌నాథ్ పేరిట ఉంది. ఆయన 30 అక్టోబర్ 1989న ముంబైలోని వాంఖడే స్టేడియంలో వెస్టిండీస్‌పై తన చివరి వన్డే మ్యాచ్ ఆడినప్పుడు ఆయన వయసు 39 సంవత్సరాల 36 రోజులు. గత 37 ఏళ్లుగా ఈ రికార్డును ఎవరూ అధిగమించలేకపోయారు. అయితే అఫ్గానిస్తాన్‌తో తొలి వన్డే ఆడే సమయానికి రోహిత్ శర్మ వయసు 39 సంవత్సరాల 44 రోజులు. దీంతో మ్యాచ్ ప్రారంభం కాగానే మొహిందర్ అమర్‌నాథ్ రికార్డును దాటేసి, భారతదేశం తరఫున వన్డే ఆడిన అత్యంత వయస్కుడైన క్రికెటర్‌గా రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించనున్నాడు.
భారత క్రికెట్ లో ఎందరో మహానుభావులు ఎన్నో రికార్డులు సృష్టించినప్పటికీ.. ఈ పర్టిక్యులర్ రికార్డుకు మాత్రం ఎవరూ దరిదాపుల్లోకి రాలేకపోయారు. గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ వంటి దిగ్గజాలు సైతం 39 ఏళ్ల వయసు రాకముందే వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక ప్రస్తుత రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఇంకా ఆ వయసుకు చేరుకోలేదు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ ఈ అరుదైన మైలురాయిని అందుకోవడం నిజంగా విశేషం. కాగా, ప్రపంచ వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఎక్కువ వయసులో (47 సంవత్సరాల 257 రోజులు) మ్యాచ్ ఆడిన రికార్డు నెదర్లాండ్స్‌కు చెందిన నోలన్ క్లార్క్ పేరిట ఉంది.
అఫ్గానిస్తాన్ జట్టుపై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారతీయ బ్యాటర్‌గా కూడా రోహిత్ శర్మ రికార్డుల్లో ఉన్నాడు. ఆయన అఫ్గాన్ పై ఆడిన 3 వన్డే మ్యాచ్‌ల్లోనే ఏకంగా 150 పరుగులు చేశాడు. ఇందులో ఒకే మ్యాచ్ లో 131 పరుగుల భారీ ఇన్నింగ్స్ కూడా ఉంది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాలు గాయాల కారణంగా జట్టుకు దూరం కావడంతో.. కెప్టెన్‌గా రోహిత్ శర్మపై, యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌పై భారీ బాధ్యత పడింది.
క్రికెట్ చరిత్రను పరిశీలిస్తే.. అఫ్గానిస్తాన్ జట్టు ఏ ఫార్మాట్‌లోనూ (టెస్ట్, వన్డే, టీ20) ఇప్పటివరకు భారత్‌పై ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. వన్డేల విషయానికి వస్తే ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు జరగగా.. అందులో 3 మ్యాచ్‌లలో భారత్ ఘనవిజయం సాధించింది, ఒక మ్యాచ్ టైగా ముగిసింది. ఇటీవలే జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్ లోనూ అఫ్గాన్ పై భారత్ తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు అదే జోరును వన్డేల్లోనూ కొనసాగించి 2027 వరల్డ్ కప్ సన్నాహాలను ఘనంగా ప్రారంభించాలని హిట్ మ్యాన్ సేన భావిస్తోంది.
మరిన్ని క్రికెట్ మ్యాచ్‌ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
