Paris Olympics 2024: ముచ్చటగా మూడో పతకంపై మను బాకర్ కన్ను.. తదుపరి ఈవెంట్ ఎప్పుడంటే?

|

Jul 30, 2024 | 5:11 PM

పారిస్ ఒలింపిక్స్‌లో భారత మహిళా షూటర్ మను బాకర్ రికార్డు సృష్టించింది. ఒకే ఒలింపిక్స్‌లో 2 పతకాలు సాధించిన తొలి భారతీయ అథ్లెట్ గా మను బాకర్ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. మొదట మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్‌కు కాంస్య పతకాన్ని అందించిన ఆమె మంగళవారం (జులై 29) సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి టీమ్ ఈవెంట్‌లో మరో కాంస్య పతకాన్ని సాధించింది

Paris Olympics 2024: ముచ్చటగా మూడో పతకంపై మను బాకర్ కన్ను.. తదుపరి ఈవెంట్ ఎప్పుడంటే?
Manu Bhaker
Follow us on

పారిస్ ఒలింపిక్స్‌లో భారత మహిళా షూటర్ మను బాకర్ రికార్డు సృష్టించింది. ఒకే ఒలింపిక్స్‌లో 2 పతకాలు సాధించిన తొలి భారతీయ అథ్లెట్ గా మను బాకర్ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. మొదట మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్‌కు కాంస్య పతకాన్ని అందించిన ఆమె మంగళవారం (జులై 29) సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి టీమ్ ఈవెంట్‌లో మరో కాంస్య పతకాన్ని సాధించింది. మను భాకర్ సాధించిన విజయానికి దేశం మొత్తం సంబరాలు చేసుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోడీతో సహా పలువురు ప్రముఖులు ఈ షార్ప్ షూటర్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే మను బాకర్ ముచ్చటగా మూడో పతకం సాధించేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్ కు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. మను బాకర్ మొత్తం 3 ఈవెంట్లలో పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఇప్పటికే రెండు ఈవెంట్లలోనూ కాంస్య పతకంతో మెరిసిన ఆమె హ్యాట్రిక్ పతకంపై కన్నేసింది. ఆగస్టు 2న 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ ఈవెంట్‌లో మనూ తలపడనుంది. ఆగస్టు 2న మధ్యాహ్నం 12:30 గంటలకు ఈ కీలక మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ ఈవెంట్‌లోనూ పతకం గెలవడానికి మను బలమైన పోటీదారుగా పరిగణిస్తున్నారు. ఒకవేళ ఇందులోనూ పతకం సాధించడంలో మనూ సఫలమైతే భారతావనికి అంతకన్నా ఆనందం మరొకటి ఉండదు.

మను బాకర్ తన మొదటి పతకాన్ని జూలై 28న గెలుచుకుంది. ఈ విజయంతోనే ఒలింపిక్స్ పతకాల పట్టికలో భారత్ ఖాతా తెరిచింది. ఈ విజయంతో ఒలింపిక్స్‌లో షూటింగ్ ఈవెంట్‌లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళా అథ్లెట్‌గా మను బాకర్ నిలిచింది. ఇక మంగళవారం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో సరబ్జోత్ సింగ్‌తో కలిసి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుందామె. మను భాకర్, సరబ్జోత్ సింగ్ జంట 16-10తో దక్షిణ కొరియాను ఓడించి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఈ పతకం సాధించడం ద్వారా మను ఒలింపిక్స్‌లో ఒకే ఎడిషన్‌లో 2 పతకాలు సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా నిలిచింది. గతంలో రెజ్లర్ సుశీల్ కుమార్, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఒలింపిక్స్‌లో రెండేసి పతకాలు సాధించారు. కానీ అవి వేర్వేరు ఎడిషన్లలో. సుశీల్ కుమార్ 2008లో కాంస్య పతకం, 2012లో రజత పతకం సాధించాడు. అలాగే, పీవీ సింధు 2016లో రజత పతకం, 2021లో కాంస్య పతకం సొంతం చేసుకుంది.

ఇవి కూడా చదవండి

 

మరిన్న క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..