Tokyo Olympics: భారత పురుషుల హాకీ జట్టు ప్రకటన..! ఒలింపిక్స్‌లో తొలిసారి ఆడనున్న 10మంది ఆటగాళ్లు

16 మంది సభ్యులతో కూడిన పురుషుల హాకీ జట్టును హాకీ ఇండియా శుక్రవారం ప్రకటించింది. ప్రస్తుత జట్టులో 10 మంది ఒలింపిక్ క్రీడల్లో తొలిసారి ఆడనున్నారు.

Tokyo Olympics: భారత పురుషుల హాకీ జట్టు ప్రకటన..! ఒలింపిక్స్‌లో తొలిసారి ఆడనున్న 10మంది ఆటగాళ్లు
Hockey India
Follow us
Venkata Chari

|

Updated on: Jun 18, 2021 | 5:04 PM

Tokyo Olympics: టోక్యో ఒలింపిక్ గేమ్స్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈమేరకు అన్ని దేశాలు ఒలింపిక్స్‌లో పాల్గొనే సభ్యులను ప్రకటిస్తున్నారు. తాజాగా ‘హాకీ ఇండియా’ 16 మంది సభ్యులతో కూడిన హాకీ జట్టును శుక్రవారం ప్రకటించింది. ప్రస్తుత జట్టులో 10 మంది ఒలింపిక్ క్రీడల్లో తొలిసారి ఆడనున్నారు. ఈమేరకు బెంగళూరులో జరుగుతున్న శిబిరంలో సెలక్టయిన అభ్యర్థులకు కఠిన శిక్షణ ఉండనుంది.

గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్, మిడం ఫీల్డర్ మన్ప్రీత్ సింగ్ లతో పాటు ఒలింపిక్ ఆడిన అనుభవం కలిగిన హర్మన్ప్రీత్ సింగ్, రూపీందర్ పాల్ సింగ్, సురేందర్ కుమార్, మండీప్ సింగ్ లతో జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. మోకాలికి గాయం కారణంగా 2016 లో ఒలింపిక్స్‌ ఆడలేకపోయిన బిరేంద్ర లక్రా కు చోటు లభించింది. అలాగే అమిత్ రోహిదాస్, హార్దిక్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, నీలకాంత శర్మ, సుమిత్ తోపాటు షంషేర్ సింగ్, దిల్‌ప్రీత్ సింగ్, గుర్జంత్ సింగ్, లలిత్ కుమార్ ఉపాధ్యాయ తొలిసారి ఒలింపిక్స్‌లో అడుగుపెట్టనున్నారు.

జట్టు ఎంపిక చేసిన అనంతరం చీఫ్ కోచ్ గ్రాహం రీడ్ మాట్లాడుతూ, “16 మంది ఆటగాళ్లను ఎంపిక చేయడం అంత తేలికైన ప్రక్రియ కాదు. ప్రస్తుత టీంలో ఉన్నవారి మధ్య మంచి రిలేషన్ ఉంది. సమిష్టిగా రాణించేందకు కలిసి పనిచేస్తారు. దేశం తరపున ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించడం అంటే మాములు విషయం కాదు. ఎన్నో ఆశలు వీరిపై ఉంటాయి. అలాగే ఎంతో బాధ్యత వీరిపై ఉంటోంది. ప్రస్తుతం కఠినమైన శిక్షణపై దృష్టి సారించాం. టోక్యోలో పతకం సాధించాలన్నదే మా లక్ష్యమని” ఆయన అన్నారు.

భారత పురుషుల హాకీ జట్టుకు ఒలింపిక్స్‌లో గొప్ప చరిత్ర ఉంది. 8 బంగారు, 1 రజత, 2 కాంస్య పతకాలతో మొత్తం 11 ఒలింపిక్ పతకాలను హాకీ జట్టు గెలుచుకుంది. అయితే, భారత జట్టు చివరిసారిగా ఒలింపిక్ పతకం సాధించి దాదాపు 41 సంవత్సరాలు అవుతోంది. దీంతో ప్రస్తుత జట్టు టోక్యోలో మరో పతకాన్ని సాధించి సగర్వంగా తిరిగి రావాలని ఆశిస్తోంది. ప్రస్తుత జట్టు గత కొన్నేళ్లుగా మంది ప్రదర్శన చేస్తోంది. 2016, 2018 ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీతోపాటు, 2017 ఆసియా కప్, 2019 ప్రపంచ సిరీస్‌లను గెలుచుకుంది.

ఒలింపిక్స్ సన్నాహాల్లో భాగంగా పురుషుల జట్టు యూరప్, అర్జెంటీనాకు వెళ్లారు. ఈ పర్యటనలలో జర్మనీ, గ్రేట్ బ్రిటన్, గత ఒలింపిక్ ఛాంపియన్స్ అర్జెంటీనా వంటి జట్లతో తలపడ్డారు. ప్రపంచ ర్యాకింగ్స్ లో నంబర్ 4 లో కొనసాగుతోన్న భారత హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్ లో భాగంగా బలమైన జట్లతో ఆడి తన సత్తాను చాటింది. అనంతరం ఎఫ్‌ఐహెచ్ ప్రో లీగ్ వంటి ఉన్నత స్థాయి పోటీల్లో పాల్గొంది. ఈ పోటీలలో అర్జెంటీనాను ఓడించి సత్తా చాటారు.

ఒలింపిక్ లో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, స్పెయిన్, ఆతిథ్య జపాన్‌లతో పాటు భారత పురుషుల జట్టు పూల్ ఏలో పోటీపడనుంది. ఈ టోర్నమెంట్ జులై 23 నుంచి ఆగస్టు 5 వరకు టోక్యోలో జరుగుతుంది.

స్క్వాడ్: గోల్ కీపర్: పీఆర్ శ్రీజేష్ డిఫెండర్లు: హర్మన్‌ప్రీత్ సింగ్, రూపీందర్ పాల్ సింగ్, సురేందర్ కుమార్, అమిత్ రోహిదాస్, బిరేంద్ర లక్రా మిడ్‌ఫీల్డర్స్: హార్దిక్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, నీలకాంత శర్మ, సుమిత్ ఫార్వర్డ్: షంషర్ సింగ్, దిల్‌ప్రీత్ సింగ్ లలిత్ కుమార్ ఉపాధ్యాయ, మందిప్ సింగ్.