Indian Football: భారత మహిళల ఫుట్‌బాల్ జట్టులో లైంగిక వేధింపుల కేసు.. అసిస్టెంట్ కోచ్‌పై వేటు..

లైంగిక వేధింపుల ఆరోపణలతో U-17 మహిళల జట్టు అసిస్టెంట్ హెడ్ కోచ్ అలెక్స్ ఆంబ్రోస్‌ను తొలగించారు. సీఓఏ సభ్యుడు ఒకరు ఈ విషయాన్ని ధృవీకరించారు.

Indian Football: భారత మహిళల ఫుట్‌బాల్ జట్టులో లైంగిక వేధింపుల కేసు.. అసిస్టెంట్ కోచ్‌పై వేటు..
Indian Football
Follow us
Venkata Chari

|

Updated on: Jul 03, 2022 | 3:30 PM

లైంగిక వేధింపుల ఆరోపణలపై భారత ఫుట్‌బాల్ మహిళల అండర్-17 జట్టు అసిస్టెంట్ కోచ్ అలెక్స్ ఆంబ్రోస్‌ను అతని పదవి నుంచి తొలగించారు. సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (COA) సభ్యుడు డాక్టర్ SY ఖురేషీ ఈ విషయాన్ని ధృవీకరించారు. అండర్‌-17 మహిళల జట్టు అసిస్టెంట్‌ హెడ్‌ కోచ్‌ అలెక్స్‌ ఆంబ్రోస్‌ లైంగిక వేధింపుల ఆరోపణలతో పెద్ద దుమారం రేగింది. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది. జూన్ 30న అలెక్స్ ఆంబ్రోస్‌ను తొలగించాలని COA సూచించింది. కాగా, ఆసమయంలో పేరు మాత్రం వెల్లడించలేదు. ‘అండర్-17 మహిళల జట్టులో లైంగిక వేధింపుల కేసు తెరపైకి వచ్చింది, జట్టు ప్రస్తుతం యూరప్‌ పర్యటనలో ఉంది. AIFF క్రమశిక్షణా రాహిత్యం విషయంలో జీరో టాలరెన్స్ విధానాన్ని నిర్వహిస్తుంది. ప్రాథమిక చర్యగా, ఫెడరేషన్ తదుపరి విచారణ పెండింగ్‌లో సంబంధిత వ్యక్తిని తాత్కాలికంగా సస్పెండ్ చేసింది’ సీఓఏ ప్రకటించింది.

ఇలాంటి కేసులు ఇంతకు ముందు కూడా..

ఇటీవలి కాలంలో భారత క్రీడల్లో లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. ఇటీవల, ఒక మహిళా సైక్లిస్ట్ స్లోవేనియా పర్యటనలో జాతీయ కోచ్ అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపించింది. ఆ తర్వాత కోచ్‌ని తొలగించి, ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. మహిళా సెయిలర్ (సెయిలింగ్ ప్లేయర్) కూడా విదేశీ పర్యటనలో తనతో పాటు వచ్చిన కోచ్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది.

ఇవి కూడా చదవండి

అండర్-17 ప్రపంచకప్ ఈ ఏడాది భారత్‌లో..

ఈ ఏడాది అక్టోబర్‌లో అండర్-17 మహిళల ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. అక్టోబర్ 11 నుంచి 30 వరకు భువనేశ్వర్, గోవా, నవీ ముంబై మూడు నగరాల్లో ఈ టోర్నీ మ్యాచ్‌లు జరగనున్నాయి. టోర్నీలో గ్రూప్‌-ఎలో అమెరికా, మొరాకో, బ్రెజిల్‌లతో భారత్‌ జట్టు చేరింది.

తొలిరోజు అమెరికాపై భారత్ తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. దీని తర్వాత మ్యాచ్‌లు వరుసగా అక్టోబర్ 14, 17 తేదీల్లో మొరాకో, బ్రెజిల్‌లతో జరుగుతాయి. ఆల్ ఇండియా గ్రూప్-స్టేజ్ మ్యాచ్‌లు భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో జరుగుతాయి.