Formula E race Tickets: ఫిబ్రవరి 11 నుంచి హైదరాబాద్‌లో ఫార్ములా ఇ రేస్.. టికెట్లు ఇలా బుక్ చేసుకోండి..
Formula E race in Hyderabad: భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా ఫార్ములా ఇ రేస్.. మన హైదరాబాద్‌లో జరుగనుంది. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి జరుగనున్న ఈ రేస్ కోసం టికెట్ల బుకింగ్ ప్రారంభమైంది.

భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా ఫార్ములా ఇ రేస్.. మన హైదరాబాద్‌లో జరుగనుంది. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి జరుగనున్న ఈ రేస్ కోసం టికెట్ల బుకింగ్ ప్రారంభమైంది. ఫార్ముల ఇ రేస్ నిర్వాహకులు.. టికెట్ల బుకింగ్‌ను బుధవారం నుంచి ప్రారంభించించారు. దాదాపు 22,500 టికెట్లను అమ్మకానికి పెట్టగా.. ఆన్‌లైన్‌లో Bookmyshow, AceNetGen లో అందుబాటులో ఉంచారు. ఇక టికెట్ వాల్యూ భారీగా ఉంది. గ్రాండ్ స్టాండ్‌లకు రూ. 1000 ధర నిర్ణయించగా.. చార్జ్‌డ్ గ్రాండ్‌స్టాండ్‌లకు రూ. 3,500, ప్రీమియం గ్రాండ్‌స్టాండ్‌కు రూ. 6,000, ఏస్ గ్రాండ్‌స్టాండ్‌లకు రూ. 10,000 గా ఉంది. ఇక రేసింగ్ వీక్షించేందుకు 25,000 సీటింగ్ సామర్థ్యం ఏర్పాటు చేయగా. 22,500 టికెట్లు అమ్మకానికి పెట్టారు. కాగా, టికెట్ల విక్రయం ఆన్‌లైన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
కాగా ఇటీవల టీమిండియా మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ల విక్రయంలో జింఖానా గ్రౌండ్స్‌లో గందరగోళం నేపథ్యంలో ఫార్ములా ఇ రేస్ నిర్వాహకులు టికెట్లను ఆన్‌లైన్‌లో మాత్రమే అందుబాటులో ఉంచారు. ఇక హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మక ఫార్ములా ఇ రేసింగ్ నిర్వహించడం సంతోషకరం అని తెలంగాణ ప్రభుత్వ ఎంఏ&యూడీ స్పెషల్ చీఫ్ సెకరటరీ అరవింద్ కుమార్ అన్నారు. ప్రపంచంలోని టాప్ 25 నగరాల్లో హైదరాబాద్‌ను చేర్చడమే తమ లక్ష్యం అన్నారు. ఈ రేస్.. హైదరాబాద్‌ను ప్రపంచంలోనే టాప్ లీగ్‌లో ఉంచుతుదన్నారు.
11 జట్లు, 22 మంది డ్రైవర్లు..
ఫార్ముల ఇ రేసింగ్ కోసం ట్యాంక్‌బండ్ పరిసరాల్లో 2.8 కిలోమీటర్ల ట్రాక్ నిర్మించారు. 18 మలుపులతో ఉన్న ఈ ట్రాక్‌పై రేసింగ్ కార్లు దూసుకుపోన్నాయి. ఇక ఈ రేస్‌లో 11 జట్లు, 22 మంది డ్రైవర్స్ పాల్గొననున్నారు. ఈ రేసింగ్‌ను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గత నెలలో జరిగిన ఇండియన్ రేసింగ్ లీగ్ పోటీల సమయంలో ఎంట్రీ, ఔట్, పార్కింగ్ స్థలాలు, ఇతర ఏర్పాట్లకు సంబంధించి మంచి ఇన్‌పుట్‌లు అందాయని, మూడు సంస్థలు సేఫ్టీ ఆడిట్ చేస్తున్నాయన్నారు అరవింద్ కుమార్.




ట్రాఫిక్ ఆంక్షలు..
ఫార్ములా ఇ రేస్ నేపథ్యంలో హైదరాబాద్ ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టనున్నారు. దీనికి సంబంధించి ప్రజలకు ముందుగానే ట్రాఫిక్ అడ్వైజరీ ఇస్తామని అధికారులు చెబుతున్నారు. ఇప్టపికే టిక్కెట్స్‌కు భారీ స్పందన వస్తోందని, రద్దీని నియంత్రించడం కష్టంగా ఉన్నందున.. ఉచిత ప్రవేశం కల్పించడం లేదన్నారు. ఇక వీక్షకుల కోసం పెద్ద పెద్ద స్క్రీన్లను కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు అధికారులు. రేస్‌కు మూడు రోజుల ముందు ట్రాక్ బ్లాక్ చేయడం జరుగుతుందని, ఈవెంట్ మొదటి రెండు రోజులు స్కూల్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఉచితంగా ప్రవేశం ఉంటుందని తెలిపారు అధికారులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..




