BCCI: బీసీసీఐలో ఆ ఇద్దరికి ప్రమోషన్స్.. గంగూలీని అదృష్టం వరించేనా..?

|

Sep 17, 2022 | 7:57 AM

భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు-BCCI లో ఆ ఇద్దరికీ ప్రమోషన్స్ రానున్నాయా.. ఒకరు అంతర్జాతీయ క్రికెట్ మండలికి వెళ్లనున్నారా.. మరొకరికి సొంత సంస్థలోనే ప్రమోషన్ దక్కనుందా.. గతంలో వినిపించిన వదంతులు నిజం కానున్నాయా..

BCCI: బీసీసీఐలో ఆ ఇద్దరికి ప్రమోషన్స్.. గంగూలీని అదృష్టం వరించేనా..?
Bcci
Follow us on

BCCI: భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు-BCCI లో ఆ ఇద్దరికీ ప్రమోషన్స్ రానున్నాయా.. ఒకరు అంతర్జాతీయ క్రికెట్ మండలికి వెళ్లనున్నారా.. మరొకరికి సొంత సంస్థలోనే ప్రమోషన్ దక్కనుందా.. గతంలో వినిపించిన వదంతులు నిజం కానున్నాయా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ, కార్యదర్శిగా జైషా కొనసాగుతున్నారు. వీరి పదవీకాలంపై కొంత వివాదం కొనసాగినా వీరిద్దరు 2025 వరకు బీసీసీఐలో కొనసాగేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు పెద్దల ఆలోచన మాత్రం భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి-ICC ఛైర్మన్‌ పదవి వైపు సౌరవ్ గంగూలీ అడుగులు పడుతుండగా.. బోర్డు అధ్యక్షుడిగా జై షా ఎంపికకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ రాజీనామా చేశారని, జై షా తదుపరి అధ్యక్షుడంటూ వదంతులు సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొట్టాయి. అయితే అధికారికంగా బీసీసీఐ దానిని ఖండించింది. ఆ ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. అయితే ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే మాత్రం BCCI పాలకవర్గంలో మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరో రెండు నెలల్లో అంటే దాదాపు నవంబరులో సౌరవ్ గంగూలీ ఐసీసీ ఛైర్మన్‌ బాధ్యతలు చేపట్టేందుకు పావులు కదుపుతున్నట్లు బీసీసీఐ వర్గాల నుంచి వస్తున్న సమాచారం.

ప్రస్తుత ICC ఛైర్మన్‌ గ్రెగ్‌ బార్క్‌లీ పదవీ కాలం పూర్తవుతున్న నేపథ్యంలో అత్యున్నత పీఠానికి ఎన్నికలు జరుగనున్నాయి. అయితే మరో రెండేళ్లు పదవిలో కొనసాగేందుకు బర్మింగ్‌హామ్‌లో జరిగిన వార్షిక సమావేశంలో గ్రెగ్ బార్క్‌లీ ఆసక్తి కనబరిచారు. నూతన ఛైర్మన్‌ను ఎన్నుకునే కొత్త విధానాన్ని బర్మింగ్‌హామ్‌ సమావేశంలో నిర్ణయించారు. ఛైర్మన్‌ ఎన్నికకు మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం లేదు. ఇటీవలి ప్రతిపాదన ప్రకారం 51 శాతం ఓట్లు సాధించిన అభ్యర్థి విజేతగా నిలుస్తారు. కాబట్టి 16 మంది సభ్యుల బోర్డులో 9 మంది డైరెక్టర్ల ఓట్లు సంపాదిస్తే ఛైర్మన్‌గా ఎన్నికవ్వొచ్చు. ఈనేపథ్యంలో సౌరవ్ గంగూలీ అభ్యర్థిత్వానికి BCCI మద్దతు తెలుపుతున్నట్లు సమాచారం. సౌరవ్ గంగూలీ ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికైతే ఈ పదవి చేపట్టిన అయిదో భారతీయుడిగా ఘనత సాధిస్తాడు. గతంలో శ్రీనివాసన్‌, శశాంక్‌ మనోహర్‌ ఈ పదవిలో కొనసాగారు. అంతకుముందు జగ్మోహన్‌ దాల్మియా, శరద్‌ పవార్‌ ICC ఛైర్మన్లుగా వ్యవహరించారు.

ఒకవేళ బీసీసీఐ అధ్యక్షులు సౌరవ్ గంగూలీ ICC ఛైర్మన్ గా వెళ్తే.. ఆ స్థానాన్ని ప్రస్తుత బీసీసీఐ కార్యదర్శి జైషా తో భర్తీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుత బోర్డు కోశాధికారి అరుణ్‌ ధుమాల్‌ కార్యదర్శిగా ఎన్నికయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రస్తుతం 15 రాష్ట్ర సంఘాలు జై షాకు మద్దతు ఇస్తున్నాయి. బోర్డు రాజ్యాంగంలో సవరణలకు సుప్రీంకోర్టు ఆమోదం తెలపడంతో బీసీసీఐకి త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి. ప్రస్తుత కార్యవర్గం పదవీ కాలం ఈనెలతో ముగుస్తుంది. ఆ వెంటనే ఎన్నికలు నిర్వహిస్తారు. అధ్యక్ష పదవి కోసం సుమారు 15 రాష్ట్ర సంఘాలు జై షా అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నాయి. కోవిడ్‌ మహమ్మారి సమయంలో జై షా వల్లే ఐపీఎల్‌ జరిగినట్లు అత్యధిక సంఘాలు భావిస్తున్నాయి. దీంతో బీసీసీఐ అధ్యక్షుడిగా జై షా అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించే అవకాశాలు ఉన్నప్పటికి.. బీసీసీఐ పెద్దల ఆలోచన ఏమిటనేది మరి కొద్దిరోజుల్లో తేలనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..