AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జపాన్‌లో భారత పారా స్విమ్మర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జీవితకాల నిషేధానికి సిఫార్సు!

ఆసియా పారా గేమ్స్ జరుగుతున్న జపాన్‌లో భారత బృందానికి ఊహించని పరిణామం ఎదురైంది. పారా స్విమ్మర్ మహమ్మద్ షమ్స్ ఆలం షేక్‌పై మహిళా హోటల్ సిబ్బందిని లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఫిర్యాదు తర్వాత జపాన్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అనంతరం భారత్‌కు పంపించారు. ఈ వ్యవహారంపై పీసీఐ కఠిన చర్యలకు సిద్ధమవుతోంది.

జపాన్‌లో భారత పారా స్విమ్మర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జీవితకాల నిషేధానికి సిఫార్సు!
Mohammad Shams Aalam Shaikh,
Venkata Chari
|

Updated on: Oct 22, 2026 | 7:30 PM

Share

జపాన్‌లోని ఐచి-నగోయాలో జరుగుతున్న ఆసియా పారా గేమ్స్ (Asian Para Games 2026)లో భారత పారా స్విమ్మింగ్ బృందానికి సంబంధించిన వివాదం వెలుగులోకి వచ్చింది. భారత పారా స్విమ్మర్ మహమ్మద్ షమ్స్ ఆలం షేక్ (Mohammad Shams Aalam Shaikh)పై మహిళా హోటల్ సిబ్బందిని లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఫిర్యాదు అనంతరం జపాన్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారని, ఆ తర్వాత భారత్‌కు తిరిగి పంపించారని పలు నివేదికలు వెల్లడించాయి.

అసలు ఏం జరిగింది?

నివేదికల ప్రకారం ఈ ఘటన సోమవారం, అక్టోబర్ 19న జరిగింది. భారత పారా స్విమ్మింగ్ బృందం బస చేసిన నాగోయాలోని హోటల్‌లో ఓ మహిళా హౌస్‌కీపింగ్ సిబ్బంది షేక్ గదిలో తన విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఆ మహిళ ఫిర్యాదు స్థానిక నిర్వాహక కమిటీకి చేరింది. అనంతరం భారత బృందం అధికారులకు కూడా సమాచారం అందింది. జపాన్ పోలీసులు ఈ వ్యవహారంపై స్పందించి షేక్‌ను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

భారత్‌కు తిరిగి పంపింపు

షేక్ ఆసియా పారా గేమ్స్‌లో తన ఈవెంట్లలో పాల్గొనాల్సి ఉంది. అయితే వివాదం వెలుగులోకి వచ్చిన తర్వాత అక్టోబర్ 20న అతడిని జపాన్ నుంచి భారత్‌కు పంపించారు. దీంతో ఈసారి ఆసియా పారా గేమ్స్‌లో అతడు పోటీ పడకుండానే స్వదేశానికి తిరిగి రావాల్సి వచ్చింది.

జీవితకాల నిషేధం వస్తుందా?

ఈ వ్యవహారాన్ని పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా (PCI) తీవ్రంగా పరిగణిస్తోంది. కమిటీకి చెందిన చెఫ్ డి మిషన్ షేక్‌పై అత్యంత కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, అందులో జీవితకాల నిషేధం కూడా ఉండాలని సిఫార్సు చేసినట్లు PCI వెల్లడించింది.

అయితే ఇది ప్రస్తుతం తుది నిర్ణయం కాదు. ఆసియా పారా గేమ్స్ ముగిసిన తర్వాత సంబంధిత అధికారులు నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకోనున్నారు. ఆరోపణలు ఇంకా తుది తీర్పుగా నిర్ధారించబడలేదు.

PCI తన ప్రకటనలో క్రీడాకారులు, బృంద సభ్యులు అందరూ క్రమశిక్షణ పాటించాలని స్పష్టం చేసింది. లైంగిక దుష్ప్రవర్తన విషయంలో సంస్థకు జీరో-టాలరెన్స్ విధానం ఉందని తెలిపింది.

ఎవరు ఈ మహమ్మద్ షమ్స్ ఆలం షేక్?

బీహార్‌కు చెందిన 40 ఏళ్ల షమ్స్ ఆలం షేక్ భారత పారా స్విమ్మింగ్‌లో అనుభవజ్ఞుడైన క్రీడాకారుడు. వరల్డ్ పారా స్విమ్మింగ్ రికార్డుల ప్రకారం, పురుషుల 100 మీటర్ల బటర్‌ఫ్లై S5, 50 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్ SB4 విభాగాల్లో అతడు గతంలో ప్రపంచ నంబర్-1 ర్యాంక్ సాధించాడు.

2018లో జకార్తాలో జరిగిన ఆసియా పారా గేమ్స్‌లో షేక్ 200 మీటర్ల, 50 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్ విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించాడు. 2025లో రేక్‌జావిక్ ఇంటర్నేషనల్ గేమ్స్‌లో 200 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో స్వర్ణం సాధిస్తూ భారత, ఆసియా రికార్డులు నమోదు చేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి.

2026 ఆసియా పారా గేమ్స్ అతడికి మూడో వరుస ఆసియా పారా గేమ్స్‌గా ఉండాల్సి ఉంది. అయితే తాజా పరిణామాల కారణంగా పోటీలో పాల్గొనకుండానే భారత్‌కు తిరిగి రావాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ కేసులో తదుపరి చర్యలు, PCI తీసుకునే క్రమశిక్షణా నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us