Cricket: అండర్ 19 ప్రపంచకప్ క్రికెట్ షెడ్యూల్ ఖరారు.. టీమిండియా మ్యాచ్‌ల వివరాలివే..
వచ్చే ఏడాది వెస్టిండీస్ వేదికగా జరగనున్న అండర్-19 ప్రపంచకప్ షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది....
వచ్చే ఏడాది వెస్టిండీస్ వేదికగా జరగనున్న అండర్-19 ప్రపంచకప్ షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5 వరకు ఈ టోర్నమెంట్ జరగనుంది. మొత్తం 14 దేశాలు వరల్డ్ కప్ ట్రోఫీ కోసం తలపడనున్నాయి. కాగా కరీబియన్ దీవుల్లో అండర్- 19 ప్రపంచకప్ నిర్వహించడం ఇదే మొదటిసారి. అంటిగ్వా అండ్ బార్బుడా, గయానా, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశాల్లోని మొత్తం పది మైదానాల్లో 48 మ్యాచ్‌లు నిర్వహిస్తామని ఐసీసీ ఈవెంట్స్ హెడ్ క్రిస్ టెట్లీ తెలిపారు. ఫైనల్ మ్యాచ్ అంటిగ్వాలోని ప్రతిష్ఠాత్మక సర్ వివియన్ రిచర్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతుందని ఆయన వెల్లడించారు.
టోర్నీ నుంచి న్యూజిలాండ్ ఔట్.. కాగా ఈ టోర్నమెంట్లో పాల్గొనడం లేదని ఇప్పటికే న్యూజిలాండ్ జట్టు ప్రకటించింది. క్వారంటైన్ నిబంధనలు కఠినంగా ఉండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. కివీస్‌కు బదులు స్కాట్లాండ్ ఈ ప్రపంచకప్‌లో తన అదృష్టం పరీక్షించుకోనుంది. ఇక భారత జట్టు షెడ్యూల్ విషయానికొస్తే..ఈ ప్రపంచకప్‌లో తొలిసారిగా పాల్గొననున్న ఉగాండా, దక్షిణాఫ్రికా, ఐర్లాండ్‌తో కూడిన గ్రూప్-బిలో భారత్ ఉంది. జనవరి 15న దక్షిణాఫ్రికాతో, 19న ఐర్లాండ్‌తో, 22న ఉగాండాతో భారత జట్టు తలపడనుంది. కాగా గ్రూప్- ఏలో మాజీ ఛాంపియన్ బంగ్లాదేశ్, ఇంగ్లండ్, కెనడా, యూఏఈలు ఉండగా, గ్రూప్- సిలో పాకిస్థాన్, అఫ్గనిస్థాన్, జింబాబ్వే, పపువా న్యూ గినియా జట్లు ఉన్నాయి. ఇక గ్రూప్-డీలో వెస్టిండీస్, ఆస్ట్రేలియా, శ్రీలంక, స్కాట్లాండ్ జట్లు తలపడనున్నాయి.
Also Read:
IND vs NZ: ఇండియన్ ఓపెనర్ల తడాఖా.. ఖాతాలోకి సరికొత్త రికార్డ్.. ఏంటంటే..?