CWG 2022: కామన్వెల్త్‌లో భారత్‌ కు మరో రెండు పతకాలు.. సత్తాచాటిన షట్లర్లు, వెయిట్‌లిఫ్టర్లు

|

Aug 03, 2022 | 6:54 AM

Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్ -2022 లో భారత్ పతకాల వేట కొనసాగిస్తోంది. 5వ రోజు పోటీల్లో వెయిట్‌లిఫ్టర్లతో పాటు షట్లర్లు కూడా సత్తాచాటారు. బ్యాడ్మింటన్‌ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లోనూ..

CWG 2022: కామన్వెల్త్‌లో భారత్‌ కు మరో రెండు పతకాలు.. సత్తాచాటిన షట్లర్లు, వెయిట్‌లిఫ్టర్లు
Cwg 2022
Follow us on

Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్ -2022 లో భారత్ పతకాల వేట కొనసాగిస్తోంది. 5వ రోజు పోటీల్లో వెయిట్‌లిఫ్టర్లతో పాటు షట్లర్లు కూడా సత్తాచాటారు. ఈక్రమంలో బ్యాడ్మింటన్‌ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లోనూ, వెయిట్‌లిఫ్టింగ్‌ ఈవెంట్లలోనూ భారత షట్లర్లు రజత పతకాలు గెల్చుకున్నారు. నాలుగేళ్ల క్రితం, 2018 గోల్డ్ కోస్ట్ గేమ్స్‌లో ఇదే ఈవెంట్‌లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్న భారత బ్యాడ్మింటన్‌ జట్టు ఈసారి మాత్రం ఆ ఫీట్‌ను పునరావృతం చేయలేకపోయింది. గతేడాది ఫైనల్‌లో ఓడిన మలేషియానే ఈసారి మనల్ని ఓడించి స్వర్ణం సొంతం చేసుకుంది. తద్వారా గత గేమ్స్‌లో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. బ్యాడ్మింటన్‌ ఈవెంట్లో తొలి మ్యాచ్‌లోనే భారత్‌కు గట్టి సవాల్‌ ఎదురైంది. టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత మలేషియాకు చెందిన పురుషుల డబుల్స్‌ జోడీ 21-18, 21-15తో భారత్‌కు చెందిన సాత్విక్‌సాయిరాజ్‌ రంకిరెడ్డి-చిరాగ్‌ శెట్టిపై గెలిచి 1-0తో ఆధిక్యంలో నిలిచింది. అయితే భారత నంబర్ వన్ క్రీడాకారిణి సింధు 22–20, 21–18తో గోహ్ జిన్ వీని ఓడించి 1–1తో సమం చేసింది. ఇక కీలకమైన మూడో పురుషుల సింగిల్స్‌లో జే యోంగ్ చేతిలో కిదాంబి శ్రీకాంత్ ఓటమి పాలయ్యాడు. దీంతో భారత బ్యాడ్మింటన్‌ జట్లు రజతంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

 

వెయిట్‌లిఫ్టింగ్‌లో మరొకటి..

రెండో రోజు నుంచి ఐదో రోజు వరకు వరుసగా నాలుగు రోజుల పాటు జరిగిన క్రీడల్లో సత్తాచాటిన వెయిట్‌లిఫ్టర్లు ఐదో రోజు కూడా అద్వితీయ ప్రదర్శన కనబరిచారు. 96 కేజీల విభాగంలో వికాస్ ఠాకూర్ (Vikas Thakur) రజతం సాధించి భారత్ ఖాతాలో మరో పతకాన్ని చేర్చాడు. స్నాచ్ రౌండ్‌లో 155 కేజీలు ఎత్తేశాడు… క్లీన్ అండ్ జెర్క్ రౌండ్‌లో 191 కేజీలు ఎత్తిన వికాస్ మొత్తంగా 346 కేజీలు ఎత్తి రెండో స్థానంలో నిలిచాడు. కాగా వికాస్ ఠాకూర్‌కి ఇది వరుసగా మూడో కామన్వెల్త్ మెడల్. ఇంతకుముందు 2014లో రజతం గెలలిచిన వికాస్, 2018 గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు.

పతకాల పట్టికలో మన ర్యాంక్‌ ఎంతంటే..

కాగా ఇప్పటివరకు భారత్‌ ఖాతాలో 5 స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్య పతకాలు ఉన్నాయి. దీంతో మొత్తం 13 మెడల్స్‌తో పతకాల పట్టికలో భారత్‌ ఆరో స్థానంలో నిలిచింది. ఎప్పటిలాగే ఆస్ట్రేలియా మొత్తం 106 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..