46 ఫోర్లు, 41 సిక్స్‌లు.. 535 పరుగులతో ఐసీసీకే దడ పుట్టించిన కావ్యపాప ఫేవరేట్ ప్లేయర్..
ICC T20I Batter Ranking: భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టెస్ట్ క్రికెట్‌లో ప్రపంచ నంబర్ 1 ఆల్ రౌండర్‌గా తన ఆధిక్యాన్ని మరింత పెంచుకోగా.. మరో టీమిండియా యంగ్ డేంజరస్ ప్లేయర్ అభిషేక్ శర్మ తొలిసారిగా టీ20 ఫార్మాట్‌లో అగ్రస్థానానికి చేరాడు.

Abhishek Sharma: భారత యువ సంచలనం అభిషేక్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో కొత్త చరిత్ర సృష్టించాడు. ఐసీసీ తాజా T20I బ్యాటర్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ వంటి దిగ్గజాల సరసన నిలిచాడు. ఈ అరుదైన ఘనత సాధించిన మూడో భారతీయ బ్యాటర్‌గా అభిషేక్ శర్మ రికార్డుల్లోకెక్కాడు.
బుధవారం (జులై 30) ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ 829 పాయింట్లతో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ (814 పాయింట్లు)ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. గత ఏడాది జింబాబ్వేపై అరంగేట్రం చేసి, ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా, ఇంగ్లండ్‌లపై చూపిన నిలకడైన ప్రదర్శన అతన్ని ఈ ఉన్నత స్థానానికి చేర్చింది. కేవలం 17 T20I మ్యాచ్‌లలో రెండు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు సాధించి 193.84 స్ట్రైక్ రేట్‌తో పరుగులు రాబట్టడం అతని అద్భుతమైన ఫామ్‌కు నిదర్శనం.
భారత్ తరఫున T20I ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 స్థానానికి చేరడం అభిషేక్ శర్మకు ఒక మైలురాయి. గతంలో విరాట్ కోహ్లి 2014-2017 మధ్య కాలంలో ఈ స్థానాన్ని ఆక్రమించగా, సూర్యకుమార్ యాదవ్ కూడా అగ్రస్థానంలో కొనసాగాడు. ఈ ఎలైట్ క్లబ్‌లో అభిషేక్ చేరడంతో భారత క్రికెట్ భవిష్యత్తుకు మరింత ఆశాజనకంగా మారింది.
ప్రస్తుత ర్యాంకింగ్స్‌లో ఇతర భారతీయ ఆటగాళ్ల విషయానికి వస్తే, తిలక్ వర్మ 804 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతుండగా, సూర్యకుమార్ యాదవ్ ఆరో స్థానంలో, యశస్వి జైస్వాల్ 11వ స్థానంలో ఉన్నారు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ జాకబ్ డాఫి అగ్రస్థానంలో ఉండగా, భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడో స్థానంలో, అర్ష్‌దీప్ సింగ్ పదో స్థానంలో ఉన్నారు. టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ T20I ఫార్మాట్‌లో అగ్రస్థానంలో ఉంది.
అభిషేక్ శర్మ సాధించిన ఈ ఘనత యువ క్రికెటర్లకు స్ఫూర్తినిస్తోంది. అతని కఠోర శ్రమ, నిలకడైన ఆటతీరు ఈ ఉన్నత స్థాయికి చేర్చాయి. భవిష్యత్తులో భారత జట్టుకు అద్భుతమైన ప్రదర్శనలు అందించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








