IND vs ENG 3rd Test:లార్డ్స్‌లో హిస్టరీ క్రియేట్ చేయడం ఖాయమా ? భారత్‌కు అతి పెద్ద ఛేజింగ్ ఇదే కానుందా ?
లార్డ్స్ టెస్ట్ చివరి రోజున భారత్ 193 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేయాలి. లార్డ్స్‌లో భారత్‌కు ఇదే అతిపెద్ద రన్ ఛేజింగ్ అవుతుంది. లార్డ్స్‌లో భారత జట్టు చరిత్రను తిరగరాస్తుందా లేదా ఇంగ్లాండ్ పుంజుకుని గెలుస్తుందా అనేది ఈరోజు ఆసక్తికరంగా మారింది. పంత్, రాహుల్ గనుక నిలబడితే భారత్ గెలుపు ఖాయం.

IND vs ENG 3rd Test: లార్డ్స్‌లో జరుగుతున్న భారత్, ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ చివరి రోజుకు చేరుకుంది. ఏ జట్టు గెలుస్తుందో చెప్పడం కష్టంగా మారింది. ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్న భారత జట్టుకు విజయం కోసం ఇంకా 135 పరుగులు అవసరం, చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. ఈ రోజు ఆరంభంలో మొదటి 10 ఓవర్లు కీలకం కానున్నాయి. ఎందుకంటే బంతి ఎక్కువగా స్వింగ్ అయ్యే అవకాశం ఉంది.
నాలుగో రోజు ఇంగ్లాండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 192 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్‌కు గెలుపు కోసం 193 పరుగుల లక్ష్యం లభించింది. మొదటి ఇన్నింగ్స్‌లో రెండు జట్లు 387 పరుగులతో సమంగా నిలిచాయి. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో భారత టాప్ ఆర్డర్ తడబడింది. యశస్వి జైస్వాల్ సున్నా పరుగులకే, కరుణ్ నాయర్ 14, శుభ్‌మన్ గిల్ 6 పరుగులకే అవుట్ అయ్యారు. మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన కేఎల్ రాహుల్ మాత్రం 33 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు.
93 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ చరిత్రలో, భారత జట్టు లార్డ్స్ మైదానంలో మొత్తం 19 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 12 మ్యాచ్‌లు ఓడిపోయింది, కేవలం 3 మ్యాచ్‌లలో మాత్రమే గెలిచింది. ఈ మూడు విజయాలలో లక్ష్యాన్ని ఛేజ్ చేసి గెలిచింది కేవలం ఒక్కసారే.
1986లో కపిల్ దేవ్ సారథ్యంలో భారత్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. ఆ మ్యాచ్‌లో భారత్‌కు 134 పరుగుల లక్ష్యం లభించగా, 5 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.ఆ తర్వాత 2014లో ధోని సారథ్యంలో 95 పరుగుల తేడాతో, 2021లో విరాట్ కోహ్లీ సారథ్యంలో 151 పరుగుల తేడాతో భారత్ గెలిచింది. ఈ రెండు మ్యాచ్‌లలో భారత్ లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకుని గెలిచింది. అందుకే, ఈరోజు భారత్ 193 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేస్తే, అది లార్డ్స్‌లో భారత్ సాధించిన అతిపెద్ద రన్ ఛేజింగ్ అవుతుంది. అలాగే, 1986 తర్వాత ఛేజ్ చేసి గెలిచిన రెండో మ్యాచ్ కూడా అవుతుంది.
నాలుగో రోజు ఆట చివరిలో ఆకాష్ దీప్‌ను నైట్ వాచ్‌మన్‌గా పంపారు. అయితే అతను చివరి బంతికి అవుట్ అయ్యాడు. ఈరోజు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ బ్యాటింగ్‌కు దిగుతారు. ఈ ఇద్దరిపైనే జట్టు గెలుపు భారం ఉంది. గత ఇన్నింగ్స్‌లో వీరిద్దరూ కలిసి 141 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈరోజు కూడా అదే భాగస్వామ్యం కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




